విజయ్ ను కడిగి పారేసిన రంజనా నాచ్చియార్ ఎవరు?
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని మాటల అన్నా అదో లెక్క. కానీ.. సొంత పార్టీకి చెందిన వారి నోటి నుంచి వచ్చే ప్రతి విమర్శ ఒక సవాలే.;
రాజకీయాల్లో ప్రత్యర్థులు ఎన్ని మాటల అన్నా అదో లెక్క. కానీ.. సొంత పార్టీకి చెందిన వారి నోటి నుంచి వచ్చే ప్రతి విమర్శ ఒక సవాలే. అందునా.. పార్టీ అధినేతపై సొంత పార్టీకి చెందిన ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న మహిళా నేత సూటిగా ప్రశ్నించే పరిస్థితితో ఎదురయ్యే సమస్య అంతా ఇంతా కాదు. ఇప్పుడు అలాంటి ఇబ్బందికర పరిస్థితినే ఎదుర్కొంటున్నారు నటుడు కం టీవీజే అధినేత విజయ్. మహిళా దినోత్సవం వేళ తన వైవాహిక జీవితానికి సంబంధించి.. తనపై వస్తున్న ఆరోపణలపై పరోక్షంగా స్పందించిన విజయ్.. వర్త్ కాదన్న మాట రావటం కొత్త చర్చకు తెర తీసింది. ఈ వ్యాఖ్యలపై మిగిలిన వారి స్పందనను పక్కన పెడితే.. సొంత పార్టీకి చెందిన మహిళా నేత కం నటి రంజనా నాచ్చియార్ చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇంతకూ ఆమె ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? నటిగా ఆమె ఎలాంటి విజయాల్నిఅందుకున్నారు? రాజకీయాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు? ఆమె తీరు ఎలా ఉంటుంది? రాజకీయ నాయకురాలిగా ఆమె స్పందిస్తుంటారు? తన అభిప్రాయాన్ని వెల్లడించే క్రమంలో సొంత పార్టీనే ఇరుకున పడేస్తారా? కేవలం విజయ్ విషయంలోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందా? లాంటి ప్రశ్నలకు సమాధానం వెతికితే బోలెడన్ని ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి.
ఇంతకూ రంజనా నొచ్చియార్ ఎవరన్న ప్రశ్నకు చూస్తే.. ఆమె రామనాథపురం సంస్థానానికి చెందిన రాజా భాస్కర్ సేతుపతి మనమరాలు. మరింత తేలిగ్గా అర్థం కావాలంటే.. ఆమె ప్రముఖ దర్శకుడు.. విలక్షణ చిత్రాలు తీస్తూ ప్రత్యేక గుర్తింపు పొందటమే కాదు.. జాతీయ ఉత్తమ దర్శక అవార్డు గ్రహీత బాల తెలుసు కదా? ఆయన మేనకోడలు. ఆమె కుటుంబ నేపథ్యం ఇలా ఉంటే.. ఆమె విద్యార్హతల గురించి తెలిసినప్పుడు మాత్రం ఫిదా కావాల్సిందే. ఎమ్మెస్సీ.. ఎంటెక్ తో పాటు ఎల్ఎల్ బీ చేసిన తీరు చూస్తే.. చదువు మీద ఆమెకున్న ఫ్యాషన్ కు వావ్ అనేస్తారు.
ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్.. ఉన్నత చదువులతో పాటు బలమైన వ్యక్తిత్వం.. ఆమె నడవడిక.. ముక్కుసూటితనం ఆమెను సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఉంచాయి. చెప్పే మాటలకు తగ్గట్లే.. చేసే పనులు ఉండటం ఆమెలో కనిపిస్తుంది. నటిగా తనకు గ్లామర్ పాత్రల కంటే నటనకు అస్కారం ఉండే పాత్రల మీదనే ఆమె ఆసక్తి చూపటం కనిపిస్తుంది. కేవలం అందం చుట్టూ తిరిగే పాత్రల్లో నటించటం తనకు ఇష్టం లేదని స్పష్టంగా చెప్పేశారు. సూపర్ స్టార్ రజనీతో పాటు పలు చిత్రాల్లో నటించారు. ఆమె హీరోయిన్ పాత్రలు కాదు.. సహాయ పాత్రలు.. కీలక పాత్రల్లో నటించారు.
నటిగా తనకంటూ పేరును తెచ్చుకున్న ఆమె.. ఆ తర్వాతి దశలో స్టార్ గురు ఫిలిం ప్రొడక్షన్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను స్టార్ట్ చేవారు. ఒకేసారి రెండు సినిమాలు నిర్మిస్తూ.. మహిళా నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు. దాదాపు దశాబ్దానికి పైనే రాజకీయాల్లో ఉన్న ఆమె.. తనకు నచ్చిన అంశాలపై ఎంత ఘాటుగా రియాక్టు అవుతారో.. సినిమా రంగంలోనూ అలాంటి తీరునే ఆమె ప్రదర్శించటం కనిపిస్తుంది. తనకు నచ్చనిది.. తాను తప్పు అనుకున్నది జరిగినప్పుడు ఆమె స్పందించే తీరు తీవ్రంగా ఉంటుంది. సినిమా నిర్మాణంలోకి వచ్చినప్పుడు ఒక మహిళగా తనను చాలామంది తక్కువ చేసి మాట్లాడాని.. వాటన్నింటిని తట్టుకొని తాను నెగ్గుకొచ్చినట్లుగా ఆమె చెబుతారు.
ఆమె రాజకీయ ప్రస్థానాన్ని చూస్తే.. ఆసక్తికరంగా ఉంటుంది. తొలుత బీజేపీలో చేరారు. ఆ పార్టీలో దాదాపు ఎనిమిదేళ్లు కొనసాగారు. బీజేపీలో ఆర్ట్ అండ్ కల్చరల్ వింగ్ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరించారు. బీజేపీ నాయకురాలిగా ఆమె తన పొలిటికల్ ప్రయాణంలో పార్టీ తీరును పలుమార్లు తప్పు పట్టటం కనిపిస్తుంది. హిందీని బలవంతంగా రుద్దతోందని ప్రశ్నించటమే కాదు.. బీజేపీ నాయకత్వం తమిళ అస్తిత్వాన్ని.. సంస్కృతిని విస్మరిస్తుందని తప్పు పట్టేవారు. ఆమె తీరు పలు సందర్భాల్లో హాట్ టాపిక్ గా మారేది. బీజేపీ నేతలు ఆమె తీరుతో ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు.
తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడే మహిళగా ఆమె కనిపిస్తారు. అందుకు భిన్నంగా ఉన్న అంశాలను మాత్రమే కాదు.. వ్యక్తులను వదిలిపెట్టరు. వారు ఎలాంటి స్థానాల్లో ఉన్నా పెద్దగా పట్టించుకోరు. కొన్ని సందర్భాల్లో బీజేపీ సిద్ధాంతాలను మాత్రమే కాదు.. రాష్ట్ర నాయకత్వాన్ని సూటిగా ప్రశ్నించిన ట్రాక్ రికార్డు ఆమె సొంతం. బీజేపీకి గుడ్ బై చెప్పే సమయంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై అనుసరిస్తునన త్రిభాషా విధానాన్ని వ్యతిరేకించటమే కాదు.. ‘‘పార్టీ నాయకత్వం కేవలం పురుషుల కోసం.. పురుషులే నిర్ణయాలు తీసుకునేలా ఉంది. బీజేపీలో పురుషాధిక్యత ఎక్కువగా ఉంది’’ అని ఘాటుగా రియాక్టు అయ్యేందుకు వెనుకాడలేదు.
అంతేకాదు ఆమె చేసిన వ్యాఖ్యల కారణంగా బీజేపీ ఇరుకున పడేలా చేసింది కూడా. బీజేపీ రాష్ట్ర నేతలు కేవలం అధికారంకోసం జాతీయవాదాన్ని.. మతాన్నివాడుకుంటున్నట్లుగా తప్పు పడుతూ.. తమిళ అస్తిత్వాన్ని విస్మరిస్తున్నారన్న బహిరంగ విమర్శ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. బీజేపీలో మహిళలకు సరైన ప్రాధాన్యత లేదని.. కేవలం పేరుకు మాత్రమే మహిళా విభాగాల్ని వాడుకుంటున్నట్లుగా విమర్శించటం గమనార్హం. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమంటే..బీజేపీలో ఉన్నప్పుడు ఆమె చేసిన విమర్శలు మొత్తం సైద్దాంతికంగా.. అంశాల మీద తనకున్న విరుద్ధ భావాల్ని మాత్రమే చెప్పేవారు. తాజాగా మాత్రం విజయ్ వ్యక్తిగత జీవితాన్ని ప్రశ్నించేలా ఉన్నాయి. విజయ్ వ్యక్తిగత జీవితంపై వ్యూహాత్మకంగానే టార్గెట్ చేశారన్న వాదన బలంగా వినిపిస్తున్న వేళ.. ఆ పార్టీకి చెందిన మహిళా నేత విజయ్ వ్యవహారశైలిని.. ఆయన క్యారెక్టర్ ను ప్రశ్నించేలా మాట్లాడటం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆమె బీజేపీకి నమ్మకమైన స్టీపర్ సెల్ అని.. విజయ్ ను దెబ్బ తీయటానికే ఆమె పార్టీలో చేరారన్నఆగ్రహాన్ని విజయ్ వీరాభిమానులు కొందరు వ్యక్తం చేస్తున్నారు. బీజేపీలో ఉన్న సమయంలో ఆమెను నపుంసకురాలు అంటూ సంబోధించిన నేతలను అంతకుమించి అన్నరీతిలో విరుచుకుపడ్డారు. ‘ఆలోచనల్లో పౌరుషం లేని వారు.. ఇతరులను హింసించే మనస్తత్వం ఉన్న వారు మాత్రమే నపుంసక వ్యాఖ్యలు చేస్తారు’ అంటూ రివర్సులో విరుచుకుపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆమె తన వ్యక్తిగత జీవితం గురించిన వివరాల్ని గోప్యంగా ఉంచటం కనిపిస్తుంది. ఆమె కుటుంబ సభ్యులను ఎప్పుడూ మీడియా ముందుకు తీసుకురాకపోవటం గమనార్హం. ఆమె వ్యక్తిగత జీవితం మీద మాట్లాడే ధైర్యం ఎవరూ చేయని ఫైర్ బ్రాండ్ తత్త్వం ఆమె సొంతమని చెబుతుంటారు. పార్టీ అధినేత విజయ్ పై విరుచుకుపడిన ఆమెకు రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో చూడాలి.