ఆ చేపలు ఒడ్డుకు.. భారీ విపత్తుకు సంకేతమా?
అలాంటి ఈ చేపలు సముద్రం ఉపరితలం మీదకు కానీ ఒడ్డుకు కానీ వచ్చాయంటే.. అప్పుడు ప్రకృత్తి విపత్తులకు అవకాశం ఉందని జపనీయులు నమ్ముతారు.;
కొన్ని దేశాల్లో కొన్ని సెంటిమెంట్లు బలంగా ఉంటాయి. వాటికి శాస్త్రీయత ఉంటుందా? లేదా అన్నది పక్కన పెడితే.. తాము బలంగా నమ్మే అంశాలు ఎదురైనప్పుడు వారిలో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. అలాంటిదే ఇప్పుడు మెక్సికోలో చోటు చేసుకుంది. ఆ దేశంలోని కాబో శాన్ లూకాస్ బీచ్ ఒడ్డుకు రెండు ఓర్ ఫిష్ లు వచ్చాయి. వీటిని డూమ్స్ డే చేపలుగా పేరుంది. జానపద కథల్లోనూ.. ప్రజల్లోనూ ఇవి బయటకు వస్తే ప్రపంచానికి ఏదో ముప్పు వాటిల్లుతుందన్న విషయాన్ని తెలియజేసినట్లుగా భావిస్తారు. వీటికి ఉన్న ప్రత్యేకత ఏమంటే.. ఇవి సముద్రంలో దాదాపు 200 నుంచి 1000 మీటర్ల లోతులో నివసిస్తాయి.
అలాంటి ఈ చేపలు సముద్రం ఉపరితలం మీదకు కానీ ఒడ్డుకు కానీ వచ్చాయంటే.. అప్పుడు ప్రకృత్తి విపత్తులకు అవకాశం ఉందని జపనీయులు నమ్ముతారు. ఈ చేప ఒక్కొక్కటి ముప్ఫై అడుగుల పొడవు వరకూ ఉంటాయి. వెండి రంగులో పాము మాదిరి ఉంటాయి. అయితే.. వీటికి పొలుసులు ఉండవు. ఇలాంటి ఓర్ ఫిష్ లు రెండు తాజాగా మెక్సికోలోని ఒడ్డుకు కొట్టుకు వచ్చి.. గిలగిలా కొట్టుకున్న వైనానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గామారింది. అదే సమయంలో ప్రపంచానికి కొత్త కష్టం ఏదో రానున్నట్లుగా ఆందోళన మొదలైంది. అత్యంత అరుదుగా మాత్రమే ఇవి ఒడ్డుకు వస్తాయని.. అలా వచ్చాయంటే.. ప్రపంచానికి ఏదో మూడిందన్న వ్యాఖ్యల జోరు పెరిగింది.
జపనీయుల నమ్మకం ప్రకారం ఈ ఓర్ ఫిష్ లను ‘‘ర్యుగు నో సుకై’’గా పిలుస్తారు. తెలుగులో అర్థం చెప్పాలంటే.. సముద్ర దేవుడి ప్యాలెస్ నుంచి వచ్చిన దూతగా పేర్కొంటారు. ఈ చేపలు సముద్ర ఉపరితలానికి కానీ ఒడ్డుకు కానీ వచ్చాయమంటే త్వరలో భూకంపాలు.. సునామీలు సంభవిస్తాయన్న మాట జపనీస్ పురాణాలు చెబుతుంటాయి. నిజానికి ఈ నమ్మకానికి ఎలాంటి శాస్త్రీయత లేదు. కానీ.. 2011లో జపాన్ లో సంభవించిన భయంకర భూకంపం.. సునామీకి ముందు దాదాపు ఇరవై ఓర్ ఫిష్ లు ఒడ్డుకు రావటంతో.. ఈ నమ్మకం మరింత పెరిగింది.
అయితే.. ఈ ఓర్ ఫిష్ లు ఒడ్డుకు రావటానికి శాస్త్రవేత్తలు చెప్పే కారణాల్ని చూస్తే.. ఇవి అనారోగ్యానికి గురైనప్పుడు.. చనిపోయే ముందు మాత్రమే ఇలా సముద్ర ఉపరితలం వైపు వస్తాయని చెబుతారు. మరికొందరు మాత్రం సముద్ర ప్రవాహాల కారణంగా దారి తప్పినప్పుడు కూడా ఒడ్డుకు వచ్చే వీలుందంటారు. శాస్త్రీయత లేని మరో అంచనా కూడా ప్రచారంలోొ ఉంది. అదేమంటే.. సముద్రం లోపల ప్లేట్ల కదలికల కారణంగా కలిగే విద్యుదయస్కాంత మార్పులను ఇవి గుర్తిస్తాయని.. అందులో భాగంగా బయటకు వస్తాయన్న అభిప్రాయం ఉంది. కానీ.. ఈ వాదనకు శాస్త్రీయత లేదు. తాజాగా మెక్సికో తీరానికి రావటం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.