ఇరాన్ సైనిక శక్తి నిర్వీర్యం.. కొత్త సుప్రీం లీడర్‌పై ట్రంప్ తీవ్ర హెచ్చరిక
ఈ యుద్ధ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.;
అంతర్జాతీయ రాజకీయ యవనికపై పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌పై సాగుతున్న యుద్ధం దాదాపు ముగింపు దశకు చేరుకుందని.. ఆ దేశ రక్షణ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయని ఆయన సంచలన ప్రకటన చేశారు.
ఇరాన్‌పై అమెరికా–దాని మిత్రదేశాలు చేపట్టిన సైనిక చర్యలు ఊహించిన దానికంటే వేగంగా ఫలితాలను ఇస్తున్నాయని డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఇరాన్‌పై యుద్ధం దాదాపుగా పూర్తయిందని స్పష్టం చేశారు. యుద్ధం ముగియడానికి మొదట 4 నుండి 5 వారాల సమయం పడుతుందని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అంతకంటే ముందే లక్ష్యాలను చేరుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కుప్పకూలిన ఇరాన్ రక్షణ వ్యవస్థలు
అమెరికా, ఇజ్రాయెల్ బలగాల దాడుల వల్ల ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా నిర్వీర్యమైందని ట్రంప్ వివరించారు. ముఖ్యంగా మూడు కీలక రంగాలలో ఇరాన్ కోలుకోలేని దెబ్బతిన్నదని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ నౌకాదళ సామర్థ్యం దాదాపుగా శూన్యమైంది. వైమానిక దళం లేకుండా పోయింది.. గగనతలంలో ప్రతిఘటించే శక్తిని ఇరాన్ కోల్పోయింది. సైనిక వ్యూహాలను పంచుకునే కమ్యూనికేషన్ వ్యవస్థలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
పుతిన్‌తో ఫోన్ కాల్: మారిన రాజకీయ సమీకరణాలు
ఈ యుద్ధ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఫోన్ కాల్‌లో మాట్లాడటం అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరాన్ యుద్ధంతో పాటు ఉక్రెయిన్ సంక్షోభంపై కూడా వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు క్రెమ్లిన్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా-రష్యా మధ్య జరుగుతున్న ఈ చర్చలు పశ్చిమాసియాలో కొత్త రాజకీయ సమీకరణాలకు దారితీసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా తన వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అమెరికాతో ఏ మేరకు సహకరిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
కొత్త సుప్రీం లీడర్‌పై ట్రంప్ హెచ్చరికలు
ఇరాన్ అంతర్గత రాజకీయాల్లో 'సుప్రీం లీడర్' ఎంపికపై కూడా ట్రంప్ ఘాటుగా స్పందించారు. అయతుల్లా అలీ ఖమేనీ వారసుడిగా మొజ్తబా ఖమేనీ ఎన్నికవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మొజ్తబా ఎన్నిక కేవలం వారసత్వ రాజకీయాల ఫలితమేనని.. దీనివల్ల ఇరాన్ మళ్లీ పాత సమస్యలనే ఎదుర్కొంటుందని హెచ్చరించారు. "కొత్త లీడర్‌గా ఎవరొచ్చినా వారు ఎక్కువ కాలం అధికారంలో ఉండబోరని.. వారిని కూడా అంతం చేస్తామని" ట్రంప్ పరోక్షంగా హెచ్చరించారు. అలీ ఖమేనీ తరహాలోనే మొజ్తబాను కూడా లక్ష్యం చేసుకునే అవకాశం ఉందని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇరాన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.
ప్రాంతీయ అస్థిరతపై విశ్లేషకుల ఆందోళన
యుద్ధం సైనికంగా ముగిసినట్లు కనిపిస్తున్నప్పటికీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వెంటనే తగ్గుతాయని చెప్పలేమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ సైనికంగా బలహీనపడినా ఆ దేశం తన 'ప్రాక్సీ' దళాల ద్వారా ప్రతిఘటించే ప్రమాదం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు కొత్త నాయకత్వం వచ్చిన తర్వాత ఇరాన్ తన విదేశాంగ విధానంలో మార్పులు చేసుకుంటుందా? లేదా అమెరికాతో ఘర్షణ వైఖరినే కొనసాగిస్తుందా? అనే అంశంపై ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ఏది ఏమైనా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇరాన్ భవిష్యత్తును, పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాలను శాసించే విధంగా ఉన్నాయి.