త్రిషకు 'టైమొచ్చింది'.. మదురైలో మోత మోగుతోంది!

తమిళనాడు రాజకీయం అంటేనే వెండితెర రంగుల కలబోత. అక్కడ తెరపై నాలుగు డైలాగులు పేల్చిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒకరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కాలని కలలు కనడం చాలా కామన్.

Update: 2026-08-05 17:15 GMT

తమిళనాడు రాజకీయం అంటేనే వెండితెర రంగుల కలబోత. అక్కడ తెరపై నాలుగు డైలాగులు పేల్చిన ప్రతీ ఒక్కరూ ఏదో ఒకరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కాలని కలలు కనడం చాలా కామన్. ఎంజీఆర్, జయలలిత కాలం నుంచి మొన్నటి విజయకాంత్, కమల్ హాసన్, నిన్నటి విజయ్ వరకు అందరూ సినిమా క్లాప్ కొట్టి పొలిటికల్ స్పీచ్‌లు దంచేసినవాళ్లే. అయితే ఆ సీనియర్ల లిస్టులోకి ఇప్పుడు కొత్తగా చేరిన పేరు అవర్ ఎవర్ గ్రీన్ క్వీన్ త్రిష.. గత రెండు దశాబ్దాలుగా వెండితెరపై కుర్రకారు గుండెల్లో రీల్ హంగామా చేసిన త్రిష మేడమ్ గారికి ఇప్పుడు రియల్ పొలిటికల్ కోరికలు పుట్టాయో లేదో తెలీదు కానీ ఆమె అభిమానులకు మాత్రం ఉత్సాహం నయాగరా జలపాతంలా ఉప్పొంగిపోతోంది.

తాజాగా మదురై వీధుల్లో త్రిష నర్పణి మండ్రం అంటే మన భాషలో త్రిష సేవా సమితి పేరిట వెలిసిన పోస్టర్లు ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్ని ఒక్కసారిగా హీటెక్కిస్తున్నాయి. రామ్మా త్రిషా రాజకీయం నీకోసం వెయిటింగ్ అంటూ ఫ్యాన్స్ వేసిన ఆ పోస్టర్లు చూస్తుంటే ఆమె పొలిటికల్ ఎంట్రీ రేపో మాపో దాదాపు ఖాయమైపోయినంత రేంజ్‌లో రచ్చ నడుస్తోంది.

ఇప్పటికే దళపతి విజయ్ "తమిళగ వెట్రి కళగం" పార్టీ పెట్టి పొలిటికల్ గ్రౌండ్‌లో సింహంలా దూకేయగా ఆయన పక్కన మైక్ పట్టుకుని నిలబడేందుకు త్రిష కూడా సైడ్ క్యారెక్టర్ నుంచి స్ట్రెయిట్ లీడ్ రోల్‌కి షిఫ్ట్ అవుతోందనేది ప్రస్తుతం కోలీవుడ్ నుంచి పొలిటికల్ కారిడార్ల వరకు షికారు చేస్తున్న లేటెస్ట్ గ్యాసిప్. విజయ్ కనుక తమిళనాడు సీఎంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తూ ఉప ఎన్నిక జరిగే నియోజకవర్గంలో త్రిషను కనుక నిలబడితే గెలిపిస్తామని ఫ్యాన్స్ హోరెత్తిస్తున్నారు. రేపు పొద్దున గెలిస్తే త్రిష మేడమ్ గారు నియోజకవర్గాన్ని ఏలేసి ప్రజలకు సేవలు అందించేస్తారన్నమాట.

ఇక అక్కడ పొలిటికల్ మైండ్‌గేమ్స్‌లోనైతే ఆమె పాత్ర వేరే లెవల్‌లో ఉంది. అధికార, ప్రతిపక్ష నాయకులు ఒకరినొకరు తిట్టుకోవాలన్నా లేదా పొలిటికల్ పంచ్‌లు వేసుకోవాలన్నా త్రిష పేరే వాడుతున్నారు. ముఖ్యంగా ఉదయనిధి స్టాలిన్, విజయ్‌ల మధ్య జరిగే మాటల యుద్ధంలో అనవసరంగా త్రిష పేరును మధ్యలోకి లాగి ఆమె ప్రత్యక్షంగా మైక్‌ ముందుకు రాకపోయినా పరోక్షంగా పొలిటికల్ స్టార్‌ను చేసి పారేశారు.

మరోవైపు మదురైలో పోస్టర్లు పడుతున్నాయి, సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి, న్యూస్ ఛానళ్లలో హెడ్‌లైన్లు మారిపోతున్నాయి. మరి ఈ మొత్తం హంగామాపై త్రిష స్పందన ఏంటయ్యా అంటే మాత్రం నో కామెంట్స్ అని ముసుగు తన్నుకుని కూర్చోవడమే. ఆమె పాటించే ఈ వ్యూహాత్మక మౌనం చూస్తుంటే ఈ ఊహాగానాలకు ప్రస్తుతానికి ముగింపు పడేలా కనిపించడం లేదు. అసలు ఈ పోస్టర్ల వెనుక ఉన్నది ఫ్యాన్స్ అతి ఉత్సాహమా లేక నిజంగానే తెర వెనుక పొలిటికల్ స్క్రిప్ట్ రెడీ అయి క్లాప్ బోర్డ్ పడబోతోందా అనేది త్రిష స్వయంగా నోరు విప్పితేనే తేలుతుంది. అంతవరకు మాత్రం తమిళ పొలిటికల్ స్క్రీన్ పై త్రిష పొలిటికల్ డ్రామా నడుస్తూనే ఉంటుంది.. జనాలు చూస్తూనే ఉంటారు.



Tags:    

Similar News