చంద్రబాబు హిట్ లిస్టులో ఐదుగురు మంత్రులు.. మరోసారి సీఎం వార్నింగ్, హాట్ టాపిక్
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.
ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన అంశం మరోసారి తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు పూర్తయిన తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కొందరు మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని, వారిని మార్చి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారని అంటున్నారు. దీనిపై తాజాగా మంత్రులతో జరిగిన టెలికాన్ఫరెన్సులో సీఎం సంకేతాలిచ్చారని విస్తృత ప్రచారం జరుగుతోంది. మంత్రివర్గంలో ఐదుగురు మంత్రుల పనితీరు నిరాశజనకంగా ఉందని మందలించడంతోపాటు ప్రతిపక్షాన్ని సమర్థంగా ఎదుర్కోవడం, ఇంచార్జులుగా ఉన్న జిల్లాలను నిర్లక్ష్యం చేస్తుండటాన్ని సీఎం తీవ్రంగా పరిగణించారని చెబుతున్నారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో మంత్రులు ఎలా పనిచేయాలనే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో మంత్రుల పనితీరుపై ఆయన చేసిన వ్యాఖ్యలు పరోక్షంగా విస్తరణకు సంకేతాలుగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వ, పార్టీ వ్యవహారాల్లో మంత్రుల అనుకున్న విధంగా ఫలితాలు సాధించలేకపోతున్నారని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేయడం పార్టీలో హాట్ టాపిక్ అవుతోంది. సీఎం వ్యాఖ్యలను పరిశీలిస్తే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత కేబినెట్‌లో భారీ మార్పులు జరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా మంత్రులు ఆయా శాఖలపై పట్టు సాధించలేకపోతున్నారని సీఎం భావిస్తున్నారని అంటున్నారు. ఇదే విషయమై టెలీకాన్ఫరెన్స్‌లో కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారని వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధార ఆరోపణలను తిప్పికొట్టడంలో, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో కొందరు మంత్రులు మౌనంగా ఉండటాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారని అంటున్నారు. "ప్రతి విషయాన్నీ నేనే స్వయంగా చెప్పాలంటే కుదరదు. ఇక నుంచి ప్రతి ఒక్కరూ మిషన్ మోడ్‌తో పనిచేయాలి. మంత్రులు మౌనంగా ఉంటే సహించేది లేదు" అంటూ ఆయన మంత్రులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారని ప్రచారం జరుగుతోంది.
ఐదుగురు మంత్రులపై అసంతృప్తి
పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం మంత్రివర్గంలో సుమారు ఐదుగురు టీడీపీ మంత్రులపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. రెండేళ్లు అవుతున్నా పూర్తిస్థాయిలో పనిచేయలేకపోవడం, ఫైళ్ల క్లియరెన్స్, నిర్ణయాల అమలులో అలసత్వంగా ఉంటున్నారని సీఎం గుర్తించారని అంటున్నారు. ఇక జిల్లాల ఇన్‌చార్జ్ మంత్రులుగా కూడా సరిగా బాధ్యతలు నిర్వర్తించడం లేదని సీఎం చీవాట్లు పెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ నాయకుల మధ్య అంతర్గత సమన్వయాన్ని సాధించడంలో విఫలమవుతున్నారని తనకు ఫిర్యాదులు అందాయని సీఎం వెల్లడించారని చెబుతున్నారు. అంతర్గత పోరును తగ్గించాలని పదే పదే చెబుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారని అంటున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలే ప్రక్షాళనకు గీతరావ్యం?
ఈ పరిస్థితుల్లో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీ కరించాలని సీఎం భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇందుకు ముహూర్తం తీయవచ్చని అంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం స్థానిక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి పార్టీలు ఒక్క చోట కూడా ఓటమి చవిచూడకూడదని, ఎక్కడా అలసత్వానికి తావులేకుండా ప్రతి ఒక్కరూ శ్రమించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ నిరంతరం మీడియా ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా, దాని తాలూకు ఫలితం ఓట్ల రూపంలో మారకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని తేల్చిచెప్పారు.
తానే స్వయంగా మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించనున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు. "పనితీరు మెరుగుపరుచుకోని వారు ఆలోచన చేసుకోవాలి" అంటూ ఆయన పరోక్షంగా పదవుల నుంచి తొలగించేలా సంకేతాలు ఇచ్చారని అంటున్నారు. వచ్చే స్థానిక ఎన్నికల ఫలితాలను బట్టి కేబినెట్‌లో కీలక మార్పులు ఉండే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి, పాలనలో వేగం పెంచాలని, ప్రతిపక్షాల దాడిని ధీటుగా తిప్పికొట్టాలని చంద్రబాబు ఇస్తున్న హెచ్చరికలు కేబినెట్ మంత్రుల్లో గుబులు పుట్టిస్తున్నట్లు చెబుతున్నారు.