ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న సికింద్రాబాద్ సెగ.. అసలు ఏంటి..? ఎందుకీ వివాదం..?
నగరాలు కేవలం మ్యాపుల్లో గీసిన గీతలు కావు. అవి జ్ఞాపకాల సమాహారం, చరిత్రకు చిరునామా, ప్రజల భావోద్వేగాలకు ప్రతీక.;
నగరాలు కేవలం మ్యాపుల్లో గీసిన గీతలు కావు. అవి జ్ఞాపకాల సమాహారం, చరిత్రకు చిరునామా, ప్రజల భావోద్వేగాలకు ప్రతీక. అలాంటి నగరాల్లో ఒకటి ‘సికింద్రాబాద్’. హైదరాబాద్‌కు జంట నగరంగా వందేళ్లకు పైగా తనదైన గుర్తింపుతో నిలిచిన సికింద్రాబాద్ ఇప్పుడు మరోసారి చర్చలకు, ఆందోళనలకు కేంద్రంగా మారింది. అభివృద్ధి పేరుతో, పరిపాలనా సౌలభ్యం పేరుతో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలు సికింద్రాబాద్ అస్తిత్వానికే ముప్పు తెస్తున్నాయా? అనే ప్రశ్న ప్రజల మధ్య గట్టిగా వినిపిస్తోంది. ఇటీవల తెలంగాణలో కొత్త జిల్లాలు, మండలాల పునర్విభజనపై ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతోందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఉత్తర భాగం నార్త్ జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజిగిరి కార్పొరేషన్‌లో కలిపే యోచన ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, రాజకీయ వర్గాల వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సికింద్రాబాద్ పేరు, పరిధి మార్పుపై జరుగుతున్న చర్చలకు అగ్గిపుల్లలా మారాయి.
హైదరాబాద్ కు జీవనాడి..
సికింద్రాబాద్ నార్త్ జోన్‌లోని ప్రాంతాలు కేవలం నివాస కాలనీలే కాదు. మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నవి, జనసాంద్రత ఎక్కువగా ఉన్నవి, ఆర్థిక కార్యకలాపాలు చురుకుగా సాగేవి. కుత్బుల్లాపూర్, అల్వాల్ వంటి ప్రాంతాలు సికింద్రాబాద్ జీవన నాడిగా భావిస్తారు. ఇలాంటి ప్రాంతాలను విడదీస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న వాదన ఒకవైపు ఉన్నా.. నగర సమగ్రత దెబ్బతింటుందన్న భయం మరోవైపు ప్రజల్లో ఉంది. ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేస్తుంది ప్రభుత్వ మౌనం. ‘విడదీస్తాం’ అని స్పష్టంగా చెప్పడంలేదు; ‘ఇది కేవలం ప్రచారం’ అని కొట్టిపారేయడంలేదు. ఈ మౌనం అనుమానాలను పెంచుతోంది. ప్రజాస్వామ్యంలో పెద్ద మార్పులు ప్రజలతో మాట్లాడకుండా జరగవు. ముఖ్యంగా సికింద్రాబాద్‌లాంటి చారిత్రక నగరానికి సంబంధించిన విషయాల్లో పారదర్శకత అవసరం.
అన్ని అవసరాలు అక్కడి నుంచే..
సికింద్రాబాద్ అనగానే గుర్తుకొచ్చేది రైల్వే స్టేషన్, పెద్ద బస్టాండ్, కంటోన్మెంట్ ప్రాంతం, బ్రిటీష్ కాలం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సాంస్కృతిక వాతావరణం. ఇవన్నీ కలిసి సికింద్రాబాద్‌ను హైదరాబాద్‌కు భిన్నమైన నగరంగా తీర్చిదిద్దాయి. ఈ గుర్తింపును కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మసకబార్చడం సమంజసమేనా? అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రాజకీయంగా కూడా ఈ అంశం సున్నితమే. సికింద్రాబాద్ పరిధి ఓటు బ్యాంక్ సమీకరణల్లో కీలకం. ఇక్కడి మార్పులు పార్టీ సమీకరణాలపై ప్రభావం చూపుతాయి. అందుకే రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతున్నాయి. కానీ ఈ వాదనల మధ్య అసలు విషయమేమిటంటే—ప్రజల అభిప్రాయం. తమ ప్రాంతం ఏ నగరంలో ఉండాలన్నది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఆ భావాలను పట్టించుకోకుండా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రతిఘటనకే దారి తీస్తాయి.
అభివృద్ధి అవసరం అది వాస్తవం. కానీ అభివృద్ధి అంటే గీతలు మార్చడమే కాదు; జీవన నాణ్యతను మెరుగుపరచడం. సికింద్రాబాద్‌ను విడగొట్టి అభివృద్ధి సాధ్యమైతే ఆ లాభనష్టాలను ప్రజల ముందు పెట్టాలి. లేదంటే, ఈ సెగ కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు సికింద్రాబాద్ అస్తిత్వంపై ముద్రపడే దీర్ఘకాలిక ప్రశ్నగా మిగిలిపోతుంది. ఇప్పుడు స్పష్టత అవసరం. ప్రభుత్వం నేరుగా ప్రజలతో మాట్లాడాలి. సికింద్రాబాద్ పేరు, పరిధి, గుర్తింపు చర్చలకు అతీతమైనవి కావు. కానీ నిర్ణయాలకు ముందు ప్రజల మనసు గెలుచుకోవాలి. లేదంటే, ఈ సెగ మరింత ముదిరి నగర చరిత్రలో మరో వివాద అధ్యాయంగా నమోదవుతుంది.