అసెంబ్లీలో మంత్రి గారి 'పాపారావు' పనులు... వీడియో వైరల్!
పేకాట పాపారావు సినిమా దాదాపు చాలా మంది చూసి ఉంటారు. అందులో కథనాయకుడు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పేకాట ఆడుతూ గడిపేస్తాడు.;
పేకాట పాపారావు సినిమా దాదాపు చాలా మంది చూసి ఉంటారు. అందులో కథనాయకుడు.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ పేకాట ఆడుతూ గడిపేస్తాడు. చేతిలో పేక లేనిదే అతడికి పూట గడవదు. ఆ సంగతి ఇప్పుడు ఎందుకంటే... ప్రజాస్వామ్య దేవాలయం అసెంబ్లీలో తాజాగా ఓ మంత్రివర్యులు ఫోన్ లో ఆన్ లైన్ లో రమ్మీ ఆడుతూ కనిపించారు.
అవును... ఇటీవల కాలంలో అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు చేయకూడని పనులు చేస్తూ కెమెరాలకు చిక్కుతున్న సంగతి తెలిసిందే. అది ప్రజాస్వామ్య దేవాలయమని, తాము ప్రజా ప్రతినిధులమే విషయం మరిచిపోయినట్లు బిహేవ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఒక పక్క అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా.. మరోవైపు సెల్ ఫోన్ లో ఆన్ లైన్ గేమ్ లు ఆడారు ఓ మంత్రి!
వివరాళ్లోకి వెళ్తే... మహారాష్ట్రలో అసెంబ్లీ సమావేశాల సమయంలో ఆ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి మాణిక్ రావ్ కోకెట్.. అసెంబ్లీ సమావేశాల సమయంలో ఫోన్ లో రమ్మీ ఆడుతున్నారని ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే రోహిత్ పవార్ ఆరోపించారు. రైతులు, వ్యవసాయ సమస్యల గురించి సభలో చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి ఇలా వ్యవహరించారని మండిపడ్డారు.
రాష్ట్రంలో రోజుకు 8 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అయినప్పటికీ వ్యవసాయ శాఖ మంత్రి వీటన్నింటినీ పట్టించుకోకుండా ఆటలాడుతున్నారని ధ్వజమెత్తారు. ఇటువంటి మంత్రులున్న ప్రభుత్వం.. రుణ మాఫీ, పంటల బీమా, మద్దతు ధరల కోసం రైతులు చేసే డిమాండ్ లను ఏం వింటుందని విమర్శించారు.
ఇదే సమయంలో... అప్పుడప్పుడు పేద రైతుల పొలాలను సందర్శించండి మహారాజా అంటూ వ్యవసాయ శాఖ మంత్రి మాణిక్ రావ్ కోకెట్ పై.. రోహిత్ పవార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్భంగా... 'ఎక్స్' వేదికగా మంత్రి గారి ఆన్ లైన్ దీనికి సంబంధించిన వీడియోలను పంచుకున్నారు. దీంతో ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి!
మరోవైపు దీనిపై శివసేన (యూబీటీ) ప్రతినిధి ఆనంద్ దూబే స్పందించారు. ప్రభుత్వానికి రైతుల సమస్యలు పట్టడం లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో... మంత్రి కోకెట్ రాజీనామా చేయాలని ఆనంద్ దుబే డిమాండ్ చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని సీఎం దేవేంద్ర ఫడణవీస్ కు విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో... మహారాష్ట్రలో అనేక కుటుంబాలను నాశనం చేసిన జంగ్లీ రమ్మీ ఆడుతూ మంత్రి దొరికారని.. ఈ మంత్రులకు సిగ్గు లేదని, రాష్ట్ర శాసనసభ పట్ల గౌరవం లేదని ఫైర్ అయ్యారు ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జితేంద్ర అవ్హాద్. దీనిపై ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఎలా స్పందిస్తారో చూడాలనుకుంటున్నట్లు తెలిపారు.
కాగా... మాణిక్ రావ్ కోకెట్ సిన్నార్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యే!