బుట్టా రాజకీయం క్లోజ్ అవుతోందా ?
అయితే 2018 తరువాత ఆమె పార్టీ మారారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఆమె రాజకీయ వైభవం కాస్తా కరగిపోతూ వచ్చింది.;
ఆమె అనూహ్యంగా రాజకీయాల్లో కీలక స్థానం అందుకున్నారు. వైసీపీ తరఫున 2014 ఎన్నికల్లో కర్నూల్ నుంచి ఎంపీగా పోటీ చేసి సీనియర్ నేత టీడీపీ నాయకుడు అయిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఓడించి పార్లమెంట్ లో అడుగు పెట్టారు. విద్యాధికురాలిగా వ్యాపారవేత్తగా మహిళా నాయకురాలిగా బహుముఖంగా బుట్టా రేణుక రాణిస్తూ వచ్చారు.
అయితే 2018 తరువాత ఆమె పార్టీ మారారు. వైసీపీ నుంచి టీడీపీలో చేరడంతో ఆమె రాజకీయ వైభవం కాస్తా కరగిపోతూ వచ్చింది. అంతే కాదు టీడీపీలో చేరినా ఆమెకు కోరుకున్న సీటు దక్కలేదు, ఎక్కడా అకామిడేషన్ కూడా చూపించలేదు. దాంతో ఆమె 2019 ఎన్నికల ముందు తిరిగి సొంత పార్టీ వైసీపీలోకి వచ్చేశారు.
అయితే వైసీపీ ఆ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. పార్టీ బాధ్యతలు అప్పగించింది. అలా అయిదేళ్ళ పాటు ఆమె పార్టీ కోసం పనిచేసిన మీదట 2024లో ఆమె అడిగి మరీ ఎమ్మిగనూరు ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తప్పించి మరీ జగన్ ఆమెకు టికెట్ ఇచ్చారు. అక్కడ బుట్టా రేణుక సొంత సామాజిక వర్గానికి చెందిన వారు అధిక సంఖ్యలో ఉండడం జగన్ బీసీ నినాదం పనిచేస్తే ఆమె గెలుపు ఖాయమని అనుకున్నారు.
కానీ టీడీపీ కూటమి వేవ్ ఒక వైపు వైసీపీలోనే వర్గ రాజకీయం మరో వైపు బుట్టా ఆశలను నీరు కార్చాయి. ఆమె ఎమ్మిగనూరులో గెలుపు కోసం కాలికి బలపం కట్టుకుని తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఆమె సొంత పార్టీ వారి వల్లనే ఓటమి పాలు అయ్యారని అంటున్నారు.
ఇక ఆమె ఓడాక పార్టీ ఎమ్మిగనూరు వైసీపీ ఇంచార్జి గా నియమించింది. అయితే మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి మరో వర్గంగా మారి రేణుక రాజకీయానికి బ్రేకులు వేస్తున్నారు అని అంటున్నారు. ఆమెకి టికెట్ ఇవ్వడాన్ని జీర్ణించుకోలేని ఆయన అప్పటి నుంచే తనదైన వర్గంగా పార్టీ రాజకీయాలను నడుపుతున్నారు.
ఇంకో వైపు చూస్తే బుట్టా రేణుక వ్యాపారాలలో కూడా ఇబ్బందులు రావడం ఆర్ధికంగా చాలా సమస్యలు రావడంతో ఆమెకి అన్ని వైపుల నుంచి ఇరకాటంగా ఉంది అని అంటున్నారు. రాజకీయాల్లోకి రావడం వల్లనే తనకు వ్యాపారాలలోనూ ఇబ్బందులు వచ్చాయని ఆమె భావిస్తున్నారుట. ఇక రాజకీయంగా ఆమెకు ఆసక్తి తగ్గిపోతోంది అని అంటున్నారు.
అందుకే అనారోగ్యం పేరుతో ఏకంగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినాయకత్వం కూడా ఆమెను ఎమ్మిగనూరు ఇంచార్జి బాధ్యతల నుంచి తప్పిస్తారు అన్న టాక్ అయితే గట్టిగా వినిపిస్తోంది.
బుట్టా రేణుకకు 2029లో టికెట్ దక్కదని కూడా ప్రచారం మొదలైపోయింది. ఒకవేళ ఇచ్చినా ఆమె గెలుపు కష్టమని వ్యతిరేక వర్గం చెబుతూ వస్తోంది. దాంతో ఆమెను తప్పించి జగన్మోహన్ రెడ్డికే చాన్స్ ఇస్తారని అంటున్నారు. ఇక రాజకీయంగా వైరాగ్యంతో ఉన్న బుట్టా రేణుక ఇక తన పాలిటిక్స్ కి స్వస్తి చెబుతారా అన్న చర్చ సాగుతోంది.
అనుకోకుండా రాజకీయ అరంగేట్రం చేసి ఏకంగా పార్లమెంట్ లో ఎంపీగా అయి తన సత్తాను చాటిన ఆమె ఇపుడు రాజకీయంగా ఎత్తిగిల్లలేని స్థితికి చేరుకున్నారు అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కుమారుడు ధరణి రెడ్డికి ఎమ్మిగనూరు బాధ్యతలు అప్పగిస్తారు అని కూడా అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.