40 ఏళ్ల తర్వాత హత్య కేసు నుంచి వందేళ్ల వ్యక్తికి ఊరట
న్యాయం ఆలస్యంగా జరగటమే అంటే.. న్యాయం సరైన సమయంలో లభించకపోవటమే అవుతుంది. ఈ ఉదంతం గురించి తెలిసినప్పుడు ఈ మాటలో నిజమెంతో అర్థమవుతుంది.;
న్యాయం ఆలస్యంగా జరగటమే అంటే.. న్యాయం సరైన సమయంలో లభించకపోవటమే అవుతుంది. ఈ ఉదంతం గురించి తెలిసినప్పుడు ఈ మాటలో నిజమెంతో అర్థమవుతుంది. దశాబ్దాల తరబడి న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఒక పెద్ద వయస్కుడికి ఎట్టకేలకు న్యాయం లభించింది. అది కూడా అతడికి వందేళ్ల వయసులో. ఒక హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు వందేళ్ల వయసులో నిర్దోషిగా పేర్కొంటూ కోర్టు ఇచ్చిన తీర్పుతో భారీ ఊరట లభించినట్లైంది. ఈ ఉదంతం ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. న్యాయం లభించేందుకు అసాధారణ ఆలస్యంపై కోర్టు సైతం స్పందిస్తూ.. లోపం ఎక్కడుందన్న విషయాన్ని ప్రస్తావించింది.
ఇంతకూ ఈ కేసేంటి? అన్న విషయంలోకి వెళితే.. 1982లో ఒక భూవివాదం ఒక హత్యకు దారి తీసింది. యూపీలో జరిగిన ఈ ఉదంతంలో మైకు ప్రధాన నిందితుడు. ఈ హత్యకు ధనీరామ్, సత్తిదిన్ ప్రేరేపించారని అభియోగాలు నమోదయ్యాయి. దీంతో హమీర్ పుర్ సెషన్స్ కోర్టు 1984లో ధనీరామ్, సత్తిదిన్ లకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది,
మైకు మాత్రం అరెస్టు కాలేదు. సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ.. ఆ ఇద్దరు 40ఏళ్ల క్రితం అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ అప్పటి నుంచి అలానే ఉండిపోయింది, విచారణ దశలో నిందితులకు బెయిల్ లభించింది. కేసు మాత్రం ఎటూ తేలకుండా ఉండిపోయింది. కొన్నేళ్లకు సత్తిదిన్ మరణించగా.. తాజాగా హైకోర్టులో ఈ కేసు విచారణ జరిగింది.
ప్రధాన నిందితుడు మైకును ఎందుకు అరెస్టు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. అదే సమయంలో ధనీరామ్ అప్పీలుపై నిర్ణయంలో జరిగిన అసాధారణ జాప్యాన్ని.. ప్రాసిక్యూషన్ లో లోపాల్ని కోర్టు ఎత్తి చూపింది. చివరకు సదరు నిందితుడి వయసును పరిగణలోకి తీసుకొని ఆయనను నిర్దోషిగా తీర్పు చెప్పింది. హత్యకు ప్రేరేపించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనకు ఇప్పుడు వందేళ్లు. దీర్ఘకాలం కేసు విచారణలో ఉన్న కారణంగా నిందితుడు ఇప్పటివరకు సమాజంలో ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పరిగణలోకి తీసుకోవాలన్న అతడి తరపు న్యాయవాది వాదనను కోర్టు పరిగణలోకి తీసుకుంది. ఏమైనా.. నలభై ఏళ్ల సుదీర్ఘ జాప్యం మన న్యాయవ్యవస్థలోని లోపాల్ని ఇట్టే చూపిస్తుందని చెప్పక తప్పదు.