కాక్ పీట్ కిటికీలోంచి వేలాడిన పైలెట్... ఆ విమానంలో ఏమి జరిగింది?
ఈ సమయంలో గాలి పీడనం, ఆక్సిజన్ స్థాయిలను దృష్టిలో పెట్టుకుని సురక్షితమైన ఎత్తుకు దిగడాన్ని కొనసాగించాలని ఫస్ట్ ఆఫీసర్ అచిసన్ నిర్ణయించుకున్నాడు.;
ఇటీవల విమానాల్లో ఎదురవుతున్న వరుస సాంకేతిక సమస్యల విషయాలు, ఇటీవల అహ్మదాబాద్ లో జరిగిన ఘోర ప్రమాదం, ఈ ఏడాది అగ్రరాజ్యంలో జరిగిన పలు ప్రమాదాల వేళ 1990లో బ్రిటిష్ ఎయిర్ వెస్ విమానంలో జరిగిన ఓ షాకింగ్ సంఘటన గురించి ఇప్పుడు తెలుసుకుందాం..! కాక్ పీట్ లోని విండో గ్లాస్ ఊడిపోవడంతో.. సగం బయటకు వెళ్లిపోయిన పైలెట్ 20 నిమిషాలపాటు అలాగే ఉండగా.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయిన ఘటన ఇది.
అవును... జూన్ 10, 1990న బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం 5390.. స్థానిక సమయం ప్రకారం ఉదయం 8:20 గంటలకు బర్మింగ్ హామ్ నుండి బయలుదేరింది. దీని గమ్యస్థానం స్పెయిన్ లోని నాల్గవ అత్యంత రద్దీ విమానాశ్రయం అయిన మాలాగా - కోస్టా డెల్ సోల్. ఈ విమానం గరిష్ట సామర్థ్యం 119 మంది కాగా... ఆ సమయంలో విమానంలో 81 మంది ప్రయాణికులు ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ విమానం 1988లో బ్రిటిష్ ఎయిర్ వేస్ లో చేరింది.
ఇలా బర్మింగ్ హామ్ నుండి 8:20 గంటలకు బయలుదేరిన బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం.. 13 నిమిషాల తర్వాత (08:33 గంటలకు) ఆక్స్ ఫర్డ్ షైర్ లోని డిడ్ కాట్ అనే చిన్న రైల్వే పట్టణం మీదుగా 17,300 ఎత్తులో ప్రయాణిస్తోంది. ఈ సమయంలో కెప్టెన్ లాంకాస్టర్ వైపు ఉన్న విండ్ స్క్రీన్ విమానం నుంచి ఒక్కసారిగా ఊడి పడిపోయింది. ఆ సమయంలో పెద్ద శబ్ధం వచ్చింది. దీంతో... పైలెట్ ఒక్కసారిగా బయటకు వచ్చేశారు. అయితే అతని మోకాళ్లు ఫ్లైట్ కంట్రోల్స్ కి చిక్కుకున్నాయి.
ఈ సమయంలో గాలి పీడనం, ఆక్సిజన్ స్థాయిలను దృష్టిలో పెట్టుకుని సురక్షితమైన ఎత్తుకు దిగడాన్ని కొనసాగించాలని ఫస్ట్ ఆఫీసర్ అచిసన్ నిర్ణయించుకున్నాడు. ఇదే సమయంలో.. అత్యవసర ల్యాండింగ్ ప్రక్రియను ప్రారంభించాడు. ఈ సమయంలో.. క్యాబిన్ సిబ్బంది కాక్ పిట్ లో కెప్టెన్ కాళ్లను గట్టిగా పట్టుకుని ఉన్నారు. అతన్ని అలా వదిలేస్తే.. శరీరం విమానం ఇంజిన్, రెక్కలను ను ఢీకొట్టి, మరింత విధ్వంసం సృష్టిస్తుందనే భయం కూడా వారికి ఉందని చెబుతారు.
దీంతో... స్థానిక కాలమానం ప్రకారం 08:55 గంటలకు విమానం సౌతాంప్టన్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. టేకాఫ్, అత్యవసర ల్యాండింగ్ మధ్య మొత్తం 35 నిమిషాలు గడిచాయి. ఆ సమయంలో కెప్టెన్ లాంకాస్టర్ సుమారు 20 నిమిషాలకు పైగా కాక్ పిట్ వెలుపల ఇరుక్కుపోయాడు. ఈ సమయంలో... అతని అర చేతులు, మణికట్టుకు గాయాలు అయ్యాయి.. పగుళ్లు ఏర్పడ్డాయి.
మరోవైపు ఈ సంఘటన తర్వాత బ్రిటిష్ ఎయిర్ వేస్ విమానం 5390 సిబ్బందికి మరింత గౌరవం పెరిగింది. ఈ సమయంలో... ఫస్ట్ ఆఫీసర్ అచిసన్, విమాన సహాయకులు సుసాన్ గిబ్బిన్స్, నిగెల్ ఓగ్డెన్ లకు వారి వీరత్వానికి, గాలిలో విలువైన సేవ చేసినందుకు క్వీన్స్ ప్రశంసలు లభించాయి.