వెన్నుపోటు దినం : కుప్పకూలిన బొత్స
వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.;
వైసీపీ నిర్వహిస్తున్న వెన్నుపోటు దినం కార్యక్రమంలో ఆ పార్టీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యానారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తన సొంత నియోజకవర్గం చీపురుపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖ నుంచి వచ్చిన ఆయన పార్టీ శ్రేణులతో కలిసి సుమారు కిలో మీటరు మేర ర్యాలీ నిర్వహించారు. ఆ తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతుండగా, ఆకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.
ఈ హఠాత్ పరిణామంతో షాక్ కు గురైన స్థానిక నేతలు వెంటనే అప్రమత్తమై స్థానిక డాక్టర్లను పిలిపించారు. సంఘటన ప్రదేశంలోనే ఆయనకు ప్రాథమిక వైద్యం చేయడంతో కోలుకున్నారు. అనంతరం చీపురుపల్లి - గరివిడి పట్టణాల మధ్య ఉన్న బొత్స క్యాంపు కార్యాలయానికి ఆయనను తరలించారు. అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత బొత్స పూర్తిగా కోలుకున్నారు.
తీవ్రమైన ఎండలో నడవడం వల్లే బొత్స సొమ్మసిల్లిపడిపోయినట్లు వైద్యులు చెప్పారు. బొత్స అస్వస్థతకు గురైన సమాచారం తెలిసిన వెంటనే ప్రైవేటు వైద్యులతోపాటు ప్రభుత్వ వైద్యులు క్షణాల వ్యవధిలో చీపురుపల్లి మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకున్నారు. ఎండ దెబ్బ వల్లే ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. సీనియర్ నేత బొత్స సొమ్మసిల్లి పడిపోవడంపై వైసీపీ శ్రేణులు ఒకింత ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నారు.