ఏపీలో ఆ సంస్థ మీడియాపై బ్యాన్.. కానీ, సిమెంట్ పరిశ్రమకు భారీ రాయితీలు!
ఇలా రెండున్నరేళ్లకు పైగా సదరు మీడియా ప్రతినిధులను దూరం పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు అనూహ్యంగా ఆ సంస్థకు చెందిన ఒక పరిశ్రమకు భారీ రాయితీలు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఏపీలో రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటాయని చెబుతుంటారు. ఇందుకు తాజాగా చోటుచేసుకున్న ఓ పరిణామాన్ని ఉదహరిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ మీడియాను నడుపుతున్న ఒక ప్రముఖ పారిశ్రామిక సంస్థను ప్రభుత్వం రెండేళ్లుగా దగ్గరకు రానీయడం లేదనే ప్రచారం ఉంది. ఆ సంస్థ సొంతంగా నిర్వహిస్తున్న మీడియాపై అనధికార నిషేధం విధించడంతో పాటు భాగస్వామ్యం ఉన్న మరో మీడియా సంస్థపైనా ప్రభుత్వం సెన్సార్ షిప్ నడుపుతోందన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ముఖ్యనేతల పర్యటనలకు కూడా ఆ మీడియా సంస్థలకు ఆహ్వానం ఉండటం లేదని అంటున్నారు. ఇలా రెండున్నరేళ్లకు పైగా సదరు మీడియా ప్రతినిధులను దూరం పెడుతున్న ప్రభుత్వం ఇప్పుడు అనూహ్యంగా ఆ సంస్థకు చెందిన ఒక పరిశ్రమకు భారీ రాయితీలు ఇవ్వడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులను కూటమి ప్రభుత్వం భారీ రాయితీలను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా పల్నాడు జిల్లాలో ఒక పరిశ్రమపై వరాల జల్లు కురిపించింది. ఈ పరిణామం చూస్తే ఇతర పెట్టుబడులు మాదిరిగా సహజంగానే అనిపించవచ్చునని అంటున్నారు. కానీ, ఇక్కడే ట్విస్టు ఉందని పరిశీలకులు చెబుతున్నారు. పల్నాడు జిల్లాలో పరిశ్రమ పెడుతున్న సంస్థ యాజమాన్యంపై రెండేళ్లుగా కూటమి పెద్దలు కారాలు మిరియాలు నూరుతున్న పరిస్థితి ఉందని అంటున్నారు. సంస్థ యాజమాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్న రెండు మీడియా గ్రూపులు గత ఎన్నికలకు ముందు తమకు వ్యతిరేకంగా పనిచేశాయని ప్రభుత్వ పెద్దలు కన్నెర్ర చేశారని అంటున్నారు.
ఈ కారణంగా రెండేళ్లుగా ఆ మీడియా సంస్థలను దగ్గరకు రానీయడం లేదని చెబుతున్నారు. అయితే ఇలాంటి వాడివేడి వాతావరణంలో మీడియా సంస్థల యాజమాన్యానికి చెందిన ఒక భారీ పరిశ్రమపై ప్రభుత్వం వరాల జల్లు కురిపించడమే చర్చనీయాంశంగా మారింది. పల్నాడు జిల్లాలో ఏర్పాటు కాబోతున్న పరిశ్రమకు రూపాయికే కరెంటు సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతోపాటు భూమి, మూలధన పెట్టుబడిలో 39 శాతం రాయితీ వంటి వరాలు ఇచ్చారు. దీంతో ఈ నిర్ణయం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది. సదరు కంపెనీ యాజమాన్యం ఏ మాయ చేసిందో అర్థం కావడం లేదని పరిశీలకులు జుట్టు పీక్కుంటున్నట్లు చెబుతున్నారు. అయితే ఇటీవల పరిశ్రమ యాజమాన్యం భాగస్వామిగా ఉన్న ఒక మీడియా సంస్థలో ప్రభుత్వ ప్రముఖుడి అనుచరుడు ఉద్యోగంలో చేరాడని, అక్కడి నుంచి సదరు పారిశ్రామిక వేత్తల విషయంలో ప్రభుత్వ ఆలోచనలో మార్పు వచ్చిందని అంటున్నారు.
రెండేళ్లుగా దూరం పెడుతున్న మీడియా సంస్థ యాజమాన్యం విషయంలో ప్రభుత్వంలో సానుకూల మార్పురావడం గమనిస్తే, రాజకీయంగా కూడా పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు విపక్షాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని గతంలో ఆరోపణలు ఎదుర్కొన్న పారిశ్రామిక సంస్థ యూటర్న్ తీసుకోవడం చూస్తే మీడియాలో కూడా విపక్షం బలహీనమవుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయని అంటున్నారు. అయితే ఈ విషయంలో కేంద్ర పెద్దల జోక్యం కూడా ఉండొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కంపెనీ యాజమాన్యానికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ ఉండటం వల్ల బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారే పల్నాడు పరిశ్రమ విషయంలో సహాయం చేసి ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఈ మార్పు మునుముందు ఎటువంటి రాజకీయానికి తెర తీస్తుందో చూడాల్సివుందని అంటున్నారు.