శంషాబాద్ డబ్బు.. సిట్ కు కీలక ప్రశ్నలు
హైదరాబాద్ నగర శివార్లలోని సులోచన ఫాం హౌసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదు ఎవరిదో తేల్చడం పోలీసులకు సవాల్ గా మారిందని అంటున్నారు.;
హైదరాబాద్ నగర శివార్లలోని సులోచన ఫాం హౌసులో స్వాధీనం చేసుకున్న రూ.11 కోట్ల నగదు ఎవరిదో తేల్చడం పోలీసులకు సవాల్ గా మారిందని అంటున్నారు. ఏపీ మద్యం స్కాంపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు దర్యాప్తులో నగదు డంపు బయటపడగా, ఆ సొమ్ము అంతా మద్యం స్కాంలో ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిదేనని ప్రచారం జరిగింది. అయితే ఆ డబ్బుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతూ కోర్టులో పిటిషన్ వేసిన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డి, ఆ డబ్బు ఎప్పుడు బ్యాంకు నుంచి విత్ డ్రా చేశారు? ఎవరు చేశారో తేల్చాలంటూ కోర్టును అభ్యర్థించడంతో సిట్ ఇరకాటంలో పడిందని అంటున్నారు.
మద్యం స్కాంపై విచారణ చేస్తున్న సిట్ అధికారులు ప్రధాన నిందితుడు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డికి చెందినదిగా చెబుతున్న రూ.11 కోట్లు అక్కడికి ఎలా వచ్చిందన్న విషయం తేల్చడమే పెద్ద సమస్యగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ40 వరుణ్ పురుషోత్తం వాంగ్మూలం ప్రకారం ఆ డబ్బు నిందితుడిదేగా ఏసీబీ చెబుతున్నా, నిందితుడు లేవనెత్తిన ప్రశ్నలతో కేసు విచారణ కీలక మలుపు తిరగినట్లుగా చెబుతున్నారు.
సిట్ ఆరోపణలను ఖండిస్తూ నిందితుడు కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కీలక విషయాలను ప్రస్తావించినట్లు చెబుతున్నారు. అందులో ప్రధానమైనది 2024 జూన్ లో రూ.11 కోట్లను తాను దాచాను అనడంలో వాస్తవం లేదని చెప్పడంతోపాటు ఆ నోట్ల కట్టల బ్యాచ్ నంబర్లను వీడియోగ్రఫీ తీయడంతో ఎప్పుడు మార్కెటులోకి విడుదల చేశారో రిజర్వ్ బ్యాంకు ఇండియాతో నిగ్గు తేల్చాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటిషన్ వేశారు. ఆ నోట్ల కట్టలపై నంబర్ల ఆధారంగా డబ్బును ఎప్పుడు, ఎవరు, ఎక్కడ డ్రా చేశారో తేల్చొచ్చని రాజ్ కేసిరెడ్డి పట్టుబట్టారు. రాజ్ కేసిరెడ్డి తరపు న్యాయవాదుల వాదనతో కోర్టు ఏకీభవించింది. ఆ పని చేయాలని సిట్ ను ఆదేశించింది.