జగన్ మీద పవన్ స్టైల్ మారిందా ?
తాజాగా ఆయన అనేక న్యూస్ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో జగన్ విషయంలో తన తీరు మారలేదని క్లారిటీ ఇచ్చేశారు.;
ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ల మధ్య రాజకీయ సమరం గత పదేళ్ళకు పైగా కొనసాగుతోంది. ఈ ఇద్దరూ ప్రత్యర్థులుగా మూడు ఎన్నికల్లో తలపడ్డారు. 2029లో అదే జరగనుంది. ఏపీ రాజకీయాలో వైసీపీ ఉండకూడదని పవన్ పట్టుదలగా ఉన్నారు. అయితే పవన్ రాజకీయంగా ఉండకూడదని వైసీపీ కోరుకోవడం లేదు కానీ కూటమి నుంచి వేరుగా ఉండాలని భావిస్తోంది. అపుడే తమకు మేలు జరుగుతుంది అని ఆశిస్తోంది.
ఇదిలా ఉంటే పవన్ 2019లో ఓడారు, జగన్ 2024లో ఓడారు. కానీ రాజకీయంగా ఈ ఇద్దరి వైఖరులలో మార్పులు అయితే రాలేదు. మధ్యలో చంద్రబాబుతో పవన్ విడిపోయినా మళ్ళీ జత కట్టారు. అలాగే బీజేపీతో విడి మళ్లీ కలిశారు. నిజానికి టీడీపీ బీజేపీలను కూడా పవన్ 2019 ఎన్నికల ముందు గట్టిగానే విమర్శించారు. కానీ మళ్ళీ వారితోనే 2024 ఎన్నికల ముందు కూటమి కట్టారు.
జగన్ విషయంలో మాత్రం అలా కావడం లేదు. జగన్ ని మొదటి నుంచి ఒకేలా పవన్ చూస్తున్నారు. అలాగే పవన్ విషయంలో జగన్ కూడా అదే విధంగా ప్రత్యర్థిగానే చూస్తున్నారు. ఇక 2029 ఎన్నికలను పవన్ పట్టుదలగానే తీసుకుంటున్నారు అని తెలుస్తోంది. ఇక సినిమాలు తగ్గించి రాజకీయాల వైపు ఫుల్ ఫోకస్ పెట్టాలని ఆయన ఆలోచిస్తున్నారు.
మరోసారి జగన్ ని మూడు పార్టీల కూటమితో ఓడించాలని చూస్తున్నారు. బీజేపీ జాతీయ పార్టీగా ఉంది. ఏపీలో బలం లేకపోయినా ఎలక్షనీరింగ్ లో ఆ పార్టీ సాయం అవసరం. అలాగే గ్రౌండ్ లెవెల్ దాకా క్యాడర్ ఉన్న టీడీపీతో జత కట్టడం కూడా అతి ముఖ్యమని పవన్ భావిస్తున్నారు. అందుకే ఆయన కూటమిలో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా పెద్దగా రియాక్ట్ కావడం లేదు. ఆయన జగన్ ని అధికారంలోకి రానీయకూడదు అన్నదే పంతంగా ఉన్నారు.
తాజాగా ఆయన అనేక న్యూస్ చానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో జగన్ విషయంలో తన తీరు మారలేదని క్లారిటీ ఇచ్చేశారు.తన స్టైల్ అదే అని కూడా తేటతెల్లం చేశారు. తాను ఎవరినీ రెచ్చగొట్టను అన్నారు. కానీ వైసీపీ నేతలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని అన్నారు. తాను కనుక నోరు విప్పితే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకే బాగా తెలుసు అన్నారు రప్పా రప్పా అనడం కానీ బరిలోకి దిగి చూపించాలని పవన్ ఒక విధంగా వైసీపీ నేతలకు సవాల్ చేశారు.
ఏపీలో వైసీపీ నేతల మీద పెడుతున్న ప్రతీ కేసుకూ ఆధారాలు ఉన్నాయని అన్నారు. ఇక జగన్ అరెస్టు విషయంలో తాను ఇపుడే ఏమీ మాట్లాడటం బాగుండదని అన్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యల విషయంలో పట్టించుకోవాల్సిన అవసరం ఉందా అని ఊరుకుంటున్నాను అన్నారు. అయితే ఎవరైనా చట్టం ముందు సమానమే అన్నారు. వైసీపీ నేతలు మితిమీరి వ్యవహరిస్తే మాత్రం చర్యలు తప్పవని పవన్ అంటున్నారు.
ఇవన్నీ చూస్తూంటే జగన్ విషయంలో తన సుదీర్ఘమైన రాజకీయ వైరాన్ని కొనసాగించడానికే పవన్ సిద్ధపడుతున్నట్లు గా కనిపిస్తోంది అని అంటున్నారు. ఈ క్రమంలో కూటమిలో తాను క్రియాశీలంగా ముఖ్య భాగస్వామిగా ఉంటే చాలు అని ఆయన భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన ఏపీ అభివృద్ధికి వైసీపీ విఘాతం కలిగిస్తోంది అని భావిస్తున్నారు అంటున్నారు. అందుకే జగన్ అధికారంలోకి వచ్చి ఏమి చేస్తారు అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా జగన్ విషయంలో పవన్ స్టైల్ అయితే మారలేదు. అది కూటమికి ఎప్పటికీ శ్రీరామరక్ష అయితే వైసీపీకి పొలిటికల్ స్పేస్ ఏపీలో పెరగకపోవడానికి కారణంగా కూడా మారుతోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి.