మొన్న ఈడీ.. నేడు సీబీఐ.. అనిల్ అంబానీని వీడని నీడలా..
అన్న ఆకాశంలో.. తమ్ముడు పాతాళంలో! ఇదీ ప్రముఖ పారిశ్రామిక కుటుంబం అంబానీల గురించి చెప్పే మాట. సరిగ్గా 21 ఏళ్ల కిందట 2004లో ఇదే రోజుల్లో అన్నదమ్ములిద్దరూ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు.;
అన్న ఆకాశంలో.. తమ్ముడు పాతాళంలో! ఇదీ ప్రముఖ పారిశ్రామిక కుటుంబం అంబానీల గురించి చెప్పే మాట. సరిగ్గా 21 ఏళ్ల కిందట 2004లో ఇదే రోజుల్లో అన్నదమ్ములిద్దరూ వ్యాపార సామ్రాజ్యాన్ని పంచుకున్నారు. విడిపోవద్దని తల్లి కోకిలా బెన్ ఎంత వారిస్తున్నా వినకుండా ఎవరి వాటా వాళ్లు తీసుకున్నారు. వాస్తవానికి పంపకాల్లో అన్న ముకేశ్ కంటే తమ్ముడు అనిల్ కు దక్కిన వ్యాపారాలే చాలా లాభాలు ఇచ్చేవి అని అప్పట్లో అనుకున్నారు. కానీ, ఇప్పుడు మకేశ్ ప్రపంచ కుబేరుడిగా ఎదిగి ఎక్కడికో వెళ్లిపోతే, అనిల్ మాత్రం విఫల వ్యాపారవేత్తగా మిగిలారు.
ఈడీ వాంగ్మూలం...
రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీని మరిన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. బ్యాంక్ మోసం కేసులో ఆయన కంపెనీలు, ఇతర ప్రాంతాల్లో శనివారం సీబీఐ సోదాలు చేపట్టింది. పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని అవకతవకలకు పాల్పడ్డారని అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలపై కేసు నమోదైంది. రెండు వారాల కిందట ఇదే అంశమై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అనిల్ అంబానీని పది గంటలు ప్రశ్నించింది. మనీ ల్యాండరింగ్ నిరోధక చట్టం కింద వాంగ్మూలం కూడా నమోదు చేసింది.
సీబీఐ సోదాలు...
తాజాగా అనిల్ అంబానీ కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు చేసింది. ఎస్ బీఐని రూ.2 వేల కోట్ల మేర మోసం చేసిన కేసుకు సంబంధించి సోదాలు నిర్వహించింది. నష్టాల్లో చిక్కుకున్న టెలికాం సంస్థ రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్ కామ్) తీసుకున్న రుణాన్ని కొద్ది రోజుల కిందటనే మోసంగా ఎస్ బీఐ పేర్కొంది. ఈ క్రమంలో 21 రోజుల్లో ఆర్బీఐకి సమాచారం ఇవ్వాలి. కేసును సీబీఐ లేదా పోలీసులకు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. అందుకే సీబీఐ కేసు నమోదు చేసింది.
మోసం విలువ ఎంత..?
''అనిల్ అంబానీ సంస్థలు 2017-19 మధ్య ఎస్ బ్యాంక్ నుంచి రూ.3 వేల కోట్లు రుణంగా తీసుకున్నాయి. వీటిని అనుమానాస్పద రీతిలో దారిమళ్లించాయి. ఇందుకోసం ఎస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచం ఇచ్చారు'' అనేది ఈడీ ప్రాథమిక నివేదిక. గతంలో ఎస్ బ్యాంక్ మాజీ ఎండీ, ప్రమోటర్ గా ఉన్న రాణాకపూర్ పై ఈడీ కేసు పెట్టింది. దీనిపై 2020లోనే ఈడీ ఎదుట అనిల్ అంబానీ విచారణకు హాజరయ్యారు. అయితే, ఎస్ బ్యాంక్ కే కాదు.. ఇదే తరహాలో రూ.14 వేల కోట్ల మేరకు ఇతర బ్యాంకుల్లో మోసానికి పాల్పడినట్లు అనిల్ కంపెనీలపై అభియోగాలున్నాయి.