అనిల్ అంబానీకి ఈడీ షాక్.. డజనుకు పైగా బ్యాంకులకు నోటీసులు..

ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఇటీవల అనిల్ అంబానీకి అప్పులు ఇచ్చిన కొన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది.;

Update: 2025-08-04 11:18 GMT

రిలయన్స్ గ్రూప్స్ విడిపోయిన తర్వాత అనిల్ అంబానీని కష్టాలు వీడడం లేదు. ముఖేష్ అంబానీ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యాన్ని ఏర్పరిచినా అనిల్ అంబానీ మాత్రం రోజు రోజుకు పతనం అంచునకు వెళ్లిపోతూనే ఉన్నారు. రిలయన్స్ కమ్యునికేషన్ దివాలా తీయడంతో సెల్ ఫోన్ టవర్లను అమ్ముకొని అప్పులు కట్టాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన పెట్టిన ఏ బిజినెస్ కూడా సక్సెస్ కాలేదు. అన్న ముఖేష్ అంబానీకి చెందిన జియో, ఆయిల్ కంపెనీలు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానానికి వెళ్లాయి. ప్రపంచ కుబేరుల్లో ఇప్పటికీ ముఖేష్ అంబానీ పేరు టాప్ 10లో వస్తూనే ఉంటుంది. కానీ అనిల్ అంబానీ సంపద మాత్రం రోజు రోజుకు తరిగిపోతూనే ఉంది. తరిగిపోవడమే కాకుండా కోర్టులు, నోటీసులు అంటూ మరింత ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి.

13 బ్యాంకులకు నోటీసులు..!

ఇప్పటికే మనీలాండరింగ్ కేసులో ఆయన పాత్రపై ఈడీ దర్యాప్తు చేస్తూనే ఉంది. ఈ దర్యాప్తులో భాగంగానే ఇటీవల అనిల్ అంబానీకి అప్పులు ఇచ్చిన కొన్ని బ్యాంకులకు నోటీసులు జారీ చేసింది. రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు కావాలని ఆదేశించింది. 12 నుంచి 13 బ్యాంకులకు నోటీసులు వెళ్లాయి. వీటిలో పబ్లిక్ సెక్టార్ నుంచి ప్రైవేట్ సెక్టార్ వరకు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకులు రిలయన్స్ హౌసింగ్ ఫైనాన్స్, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్, రిలయన్స్ కమ్యునికేషన్స్ వంటి విభాగాలకు భారీగా అప్పులు ఇచ్చాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సింధ్ బ్యాంక్‌ లు ఉన్నాయని ఆంగ్ల మీడియా ఎన్‌డీటీవీ కథనం వెలువరించింది.

సంబంధం ఉన్న అందరిపై కేసులు..

అనిల్ అంబానీ గ్రూపుతో సంబంధం ఉన్న పార్థసారధి బిస్వాల్ ను రూ. 3 వేల కోట్ల రుణానికి సంబంధించి మోసం చేశారని గత వారం అరెస్ట్ చేశారు. బిస్వాల్ ట్రేడ్ లింక్ ప్రైవేట్ లి. కంపెనీకి బిస్వాల్ ఎండీ. ఆయనపై పీఎంఎల్ఏ చట్టంను సైతం ప్రయోగించారు. రిలయన్స్ గ్రుపులోని పవర్ సెక్టార్ కు రూ. 68.2 కోట్లకు తప్పులు హామీ పత్రాలను సమర్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. యస్ బ్యాంక్ నుంచి రిలయన్స్ గ్రూప్స్ కు 2017-19 మధ్యలో జారీ అయిన రూ. 3వేల కోట్ల రుణంపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఈకేసుకు సంబంధించి ఆగస్ట్ 5వ తేదీన తమ ఎదుట హాజరవ్వాలని గత నెల ఈడీ సమన్లు జారీ చేసింది. విదేశాలకు వెళ్లకుండా లుకౌట్ సర్య్కూలర్ ను కూడా జారీ చేసింది. పీఎంఎల్‌ఏ కింద అనిల్ అంబానీ వాంగ్మూలాన్ని నమోదు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈయనతో పాటు గ్రూప్స్ కు సంబంధించి కొంత మంది ఎగ్జిక్యూటివ్ లకు కూడా సమన్లు జారీ చేయనుంది.

Tags:    

Similar News