అమరావతి మూడున్నర దశాబ్దాలుట...పెద్దాయన బాంబు !

ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని లోగుట్టు మొత్తం బయటపెట్టారు. అంతే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు.;

Update: 2025-06-14 03:15 GMT

ఏపీ ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న అమరావతి రాజధాని ఎపుడు పూర్తి అవుతుంది అంటే టీడీపీ కూటమి పెద్దలు చెబుతున్న దానిని బట్టి పదే పదే ఇస్తున్న ఇస్తున్న ప్రకటనల బట్టి చూస్తే 2028లో పూర్తి అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇక 34 వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు అయితే అమరావతి పూర్తి అయితే తమ రిటర్న్స్ పెద్ద ఎత్తున వస్తాయని భావిస్తున్నారు. ఆశగా వారు ఉన్నారు. అయితే అమరావతి పూర్తి కావడం అంటే తమాషా వ్యవహారం కాదని ఏకంగా 35 ఏళ్లు పడుతుందని పెద్దాయన టీడీపీ మాజీ ఎంపీ వడ్డే శోభనాదీశ్వరరావు పెద్ద బాంబే పేల్చారు.

ఆయన తాజాగా మీడియాతో మాట్లాడుతూ అమరావతి రాజధాని లోగుట్టు మొత్తం బయటపెట్టారు. అంతే కాదు ముఖ్యమంత్రి చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ ప్రపంచ బ్యాంకుకే రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా తెలియజేసింది ఏమిటి అంటే అమరావతి రాజధానిని మూడు దశలలో నిర్మాణం చేస్తామని, మొత్తం పూర్తి అయ్యేనాటికి మూడున్నర దశాబ్దాలు పడుతుందని.

దాంతో అమరావతి ఇప్పటప్పట్లో పూర్తి కాదా అన్న కొత్త చర్చ మొదలైంది. మరో వైపు చూస్తే తమ ప్రభుత్వమే నిరంతరాయంగా రావాలని బాబు కోరుతున్న దాని వెనక విషయం కూడా అమరావతి నిర్మాణం అన్న అతి పెద్ద యజ్ఞం కోసమే అని అంటున్నారు. ఇక వడ్డే చాలా విషయాలే చెప్పారు. అమరావతిలో జరీబ్ భూములను తీసుకోవద్దని తాము గతంలోనే చంద్రబాబుకు చెప్పామని ఆయన అన్నారు.

ముక్కారు పంటలు పండే భూములు అవి అని దేశంలో హర్యానా పంజాబ్ రాష్ట్రాలతో సరిసమానంగా సారవంతమైన భూములు అమరావతిలో ఉన్నాయని వడ్డే అన్నారు. అలాంటి భూములు కృష్ణా నదీ పరివాహిక ప్రాంతంలో మూడు కిలోమీటర్ల మేర ఉన్నాయని గుర్తు చేశారు. జరీబ్ భూములు ఉన్న రైతులే కోటీశ్వరులను వారి భూములను తీసుకుని కొత్తగా సంపన్నులను చేసేది ఏముందని ఆయన ప్రశ్నించారు.

పైగా ఆ భూములలో రాజధాని అన్నది పర్యావరణ చట్టాల ప్రకారం కుదిరే వ్యవహారం కాదని అన్నారు. నూజివీడు వద్ద అటవీ భూములను తీసుకుంటే కేంద్రం వాటిని డీ నోటిఫై చేసి రాష్ట్రానికి ఇచ్చేదని, పైగా రాజధాని నిర్మాణానికి పూచీ పడేదని వడ్డే అన్నారు. అలా కాకుండా మహా నగరం కాన్సెప్ట్ తో వేలాది భూములను సేకరించడం బాధాకరం అన్నారు. ఇపుడు రైతులే ఎక్కువగా నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ భూములు చాలవని మరో 45 వేల ఎకరాలు తీసుకోవాలని చూడడం అంటే అది మరింత బాధాకరం అన్నారు. అందువల్ల ఆ భూములు ఇవ్వవద్దని తాను రైతులను చేతులెత్తి కోరుతున్నాను అని వడ్డే అన్నారు. ఇక విశాఖని ఎకనామికల్ జోన్ గా చేస్తామని చెబుతూ అక్కడ లక్ష ఎకరాలు సేకరించమని కూటమి పెద్దలు చెప్పడాన్ని ఆయన తప్పు పట్టారు.

ఈ భూముల పిచ్చి ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఎక్కడైనా అవసరం అయితేనే భూములు తీసుకోవాలి తప్పించి ఇలా లక్షల ఎకరాలను సేకరించి పెట్టుబడిదారులకి కట్టబెట్టడం వల్ల వ్యవసాయిక రాష్ట్రంగా ఉన్న ఏపీకే తీవ్ర నష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ అడ్డగోలు భూసేకరణ విషయంలో ప్రజలు కూడా రోడ్డెక్కి వ్యతిరేకించాలని ఆయన కోరుతున్నారు.

అమరావతి నుంచి హైదరాబాద్ కి ఆరు లైన్ల రోడు ఉండగా మరో ఐకానిక్ బ్రిడ్జి అంటూ పాతిక వేల కోట్ల రూపాయలు దానికి కేటాయిస్తామని చెప్పడం ఎంతవరకూ సమంజసమని ఆయన ప్రశ్నిస్తున్నారు. కేంద్రం కూడా ఏపీ విషయంలో ఇలాంటి ప్రతిపాదనలకు ఎందుకు ఒప్పుకుంటోంది అంటే వారు విభజన హామీలేవీ అమలు చేయకుండా గమ్మున ఉండేందుకే అని వడ్డే అంటున్నారు.

ఏది ఏమైనా అమరావతి రాజధాని కానీ అక్కడ నవ నగరాలు కానీ ఒక్కోదానికి వేలాది ఎకరాల భూములు కానీ ఏపీ మొత్తం సంపదను ఒకే చోట కుమ్మరించే విధానం కానీ పూర్తిగా తప్పు అని వడ్డే అన్నారు. బాబు మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉందని ఈ సీనియర్ మోస్ట్ నేత సూచిస్తున్నారు.

Tags:    

Similar News