ట్రంప్‌ పేరుతో భారీ స్కామ్: ఏఐ సాయంతో కోటి రూపాయలు కొట్టేశారు

సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, సైబర్‌ నేరగాళ్లు దానిని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేసే ఘటనలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి.;

Update: 2025-05-25 21:30 GMT

సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో, సైబర్‌ నేరగాళ్లు దానిని దుర్వినియోగం చేస్తూ ప్రజలను మోసం చేసే ఘటనలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. తాజాగా కర్ణాటకలో చోటుచేసుకున్న ఒక భారీ మోసం ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పేరును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను వాడుకొని సైబర్‌ మోసగాళ్లు దాదాపు 150 మందిని నమ్మించి కోటి రూపాయలకు పైగా దోచుకున్నారు.

మోసగాళ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ను ఉపయోగించి డొనాల్డ్ ట్రంప్‌ మాట్లాడుతున్నట్లుగా నకిలీ వీడియోలను సృష్టించారు. "తాను ట్రంప్‌ పేరుతో ఒక యాప్‌ను రూపొందించానని.. ఇందులో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు గడించవచ్చని" ట్రంప్‌ సూచిస్తున్నట్లు ఉన్న ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో విస్తృతంగా షేర్‌ చేశారు. ఈ వీడియోలు ఎంత నమ్మదగినవిగా ఉన్నాయి. ఇవి చూసి కర్ణాటకలోని తుమకూరు, బెంగళూరు, హవేరి ప్రాంతాలకు చెందిన దాదాపు 150 మంది వాటిని నిజమని నమ్మారు. వీడియోలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌కు కాల్‌ చేసి, యాప్‌లో పెట్టుబడులు పెట్టారు.

బాధితులను పూర్తిగా నమ్మించేందుకు, మోసగాళ్లు పెట్టుబడిదారులకు యూఎస్‌ ప్రభుత్వానివే అని నమ్మించేలా ధ్రువీకరణ పత్రాలు కూడా జారీ చేశారు. కొన్ని నెలల పాటు, వారు పెట్టిన పెట్టుబడులకు లాభాలు వచ్చినట్లు చూపిస్తూ, కొంత డబ్బును, ఇతర బహుమతులను కూడా అందించారు. దీంతో బాధితులు తమ పెట్టుబడులు సురక్షితంగా ఉన్నాయని, లాభాలు వస్తున్నాయని పూర్తిగా విశ్వసించారు.

అయితే, కొన్ని రోజులకు యాప్‌ నిర్వహకులు తమ కాల్స్‌కు సమాధానం ఇవ్వడం మానేశారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ మోసంపై విచారణ చేపట్టిన సైబర్‌ క్రైం పోలీసులు, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 150 మంది కోటి రూపాయలకు పైగా విలువైన డబ్బు పోగొట్టుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

ఇటువంటి నకిలీ యాప్‌లు, కంపెనీల విషయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, సైబర్‌ మోసగాళ్ల వలలో పడొద్దని పోలీసులు సూచించారు. తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, సులభంగా అధిక లాభాలను ఆశపెట్టే పెట్టుబడి పథకాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏఐ సాంకేతికతను ఉపయోగించి జరుగుతున్న మోసాలకు ఈ ఘటన ఒక తాజా ఉదాహరణ. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండి, తమ ఆర్థిక భద్రతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News