వంగవీటికి పెద్ద ఆఫర్.. ఈసారైనా లక్ ఆయన వైపుందా?

అప్పటి సీఎం వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాధాకు మంచి ప్రాధాన్యమే దక్కిందని చెప్పాలి.

Update: 2024-05-08 02:30 GMT

ఏపీ రాజకీయాల్లో వంగవీటి మోహన రంగా పేరు ఇప్పటికీ వైబ్రేషనే. ఎమ్మెల్యేగా నాలుగేళ్లు కూడా పనిచేయనప్పటికీ నాలుగు తరాలుగా నిలిచిపోయే పోరాట స్ఫూర్తి ఆయనది. చనిపోయి 35 ఏళ్లుదాటినా అన్ని పార్టీల వారు పేదల పెన్నిధిగా కొనియాడుతున్నారంటేనే రంగా గురించి తెలిసిపోతుంది. అయితే, విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉంటూ 1988లో ఆయన హత్యకు గురయ్యారు. ఈ తర్వాత కొంత కాలానికే 1989లో జరిగిన ఎన్నికల్లో రంగా సతీమణి రత్నకుమారి విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక 2004 అదే స్థానంలో రంగా కుమారుడు రాధాక్రిష్ణ 26 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి సీఎం వైఎస్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో రాధాకు మంచి ప్రాధాన్యమే దక్కిందని చెప్పాలి.

పార్టీలు మారి.. త్రుటిలో పరాజయం పాలై

2009లో ఎన్నికల సమయానికి వచ్చిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన రాధాక్రిష్ణ.. నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన విజయవాడ సెంట్రల్ కు మారారు. అయితే, రంగా ప్రధాన అనుచరుడైన మల్లాది విష్ణు చేతిలో 848 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. 2014 ఎన్నికల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు చేతిలో 15 వేల ఓట్లతో ఓడిపోయారు. సెంట్రల్ టికెట్ కోసం పట్టుబట్టి, అది దక్కే చాన్స్ లేకపోవడంతో 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీసీని వీడి ఎవరూ ఊహించని విధంగా టీడీపీలో చేరారు. దీనిపై ఎంతటి విమర్శలు వచ్చినా రాధా లెక్క చేయలేదు. ఆ పార్టీ ఎన్నికల్లో అత్యంత దారుణ పరాజయం పాలైనా ఐదేళ్లుగా అంటిపెట్టుకుని ఉన్నారు. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్రలోనూ పాల్గొన్నారు. టీడీపీ మహానాడుకూ హాజరయ్యారు.

Read more!

ఈ సారీ టికెట్ లేదు.. బాబు హామీ ఉంది

ప్రస్తుత ఎన్నికల్లోనూ రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ దక్కలేదు. రంగా అనుచరుడైన టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఆ పార్టీ మళ్లీ టికెట్ ఇచ్చింది. దీంతో రాధా పరిస్థితి ఏమిటనే ప్రశ్న తలెత్తింది. పదేళ్లుగా ప్రత్యక్ష పోటీకి దూరం అవుతున్నప్పటికీ రాధా నిబ్బరంగానే ఉన్నారు. వాస్తవానికి గత ఎన్నికల్లో టీడీపీ గెలిచి ఉంటే రాధాకు ఎమ్మెల్సీ ఇస్తారనే ప్రచారం జరిగింది. ఎన్నికలకు నాలుగు నెలలున్నందున 2019లో టీడీపీ ప్రభుత్వంలోకి తీసుకుంటారనే కథనాలూ వచ్చాయి. అవేమీ జరగలేదు. రాధా ప్రతిపక్షంలోనే ఉండిపోయారు. కాగా, ప్రస్తుత ఎన్నికల వేళ రాధాక్రిష్ణ టీడీపీ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఆరు రోజుల కిందట దెందులూరులో చింతమనేని ప్రభాకర్ తరఫున టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్న బహిరంగ సభలో రాధా కనిపించారు. అదే సమయంలో రాధాను బాబు బాగా పొగిడారు. ఆయనకు మంచి భవిష్యత్ ఉందన్నారు. రాధా సేవలను వినియోగించుకుంటామన్నారు. దీంతోొ రాధాకు టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడితే ఎమ్మెల్సీ దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

Tags:    

Similar News