'రెట్రో'.. అది అవసరమా సూర్య?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. రీసెంట్ గా రెట్రో మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య, జ్యోతిక నిర్మించిన ఆ మూవీ.. అనుకున్న స్థాయిలో తెలుగులో మాత్రం మెప్పించలేకపోయింది.
తమిళలంలో మంచి వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు రెట్రో మూవీ వసూళ్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. నిజానికి.. సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లు కూడా రాబట్టలేదని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కానీ మేకర్స్ మాత్రం.. అఫీషియల్ గా రూ.235 కోట్లు వసూలు చేసినట్లు అనౌన్స్ చేశారు.
అంతే కాదు.. పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. దీంతో మూవీ లవర్స్ ఒక్కసారిగా అంతా షాకయ్యారు. సోషల్ మీడియాలో డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. అనేక మంది పోస్టర్ ను ట్రోల్ కూడా చేశారు. రూ.235 కోట్లు ఎలా వసూలు చేసిందోనని మాట్లాడుకుంటున్నారు. అయితే పోస్టర్ పై కనపడి కనపడనట్టు.. మేకర్స్ ఒక చిన్న డిస్క్లైమర్ వేశారు.
నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చిన డబ్బులతో కలిపి రూ.235 కోట్లు అని మెన్షన్ చేశారు. పెద్ద లెటెర్స్ లో కలెక్షన్స్ ఫిగర్ వేశారు. దీంతో ఇప్పుడు నెటిజన్లు స్పందిస్తున్నారు. చిన్న లెటెర్స్ లో వేయాల్సిన అవసరమేంటని క్వశ్చన్ చేస్తున్నారు. నాన్ థియేట్రికల్ ఆదాయం కలిపినా తక్కువే వచ్చినట్లు కదా అని పలు సినిమాలతో కంపేర్ చేస్తున్నారు.
ఇప్పటికే రెట్రో మూవీ థియేట్రికల్ రన్ ముగిసిన విషయం తెలిసిందే. ఇలాంటి టైమ్ లో పోస్టర్స్ రిలీజ్ చేసి ఎందుకు ట్రోల్స్ వేయించుకోవడమని అంటున్నారు. అనవసరంగా ట్రోల్స్ కు ఫీడ్ ఇచ్చేందుకు పోస్టర్ విడుదల చేసినట్లు ఉందని ఎద్దేవా చేస్తున్నారు. కలెక్షన్స్ పోస్టర్ తో ఇప్పుడు సాధించిందేంలేదని నెటిజన్లు, సినీ ప్రియులు విమర్శిస్తున్నారు.
అయితే రీసెంట్ గా గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ డే వసూళ్ల విషయంలో అదే జరిగింది. తొలి రోజు భారీ వసూళ్లు రాబట్టినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఫుల్ రన్ లో కూడా అంత రాబట్టలేదని తర్వాత తెలిసింది. అంతకు ముందు పలు సినిమాల విషయంలో కూడా కలెక్షన్ల పోస్టర్లు ట్రోల్స్ కు గురయ్యాయి. ఇప్పుడు రెట్రో మూవీకి కూడా సేమ్ సీన్ రిపీటైంది. ఇదంతా అవసరమా సూర్య అండ్ కో అని క్వశ్చన్ చేస్తున్నారు నెటిజన్లు.