సింగిల్ స్క్రీన్స్‌లో తక్కువ ధరలో అమర్దీప్ 'సుమతీ శతకం'
హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ.. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి తనను నిరూపించుకోనివ్వాలని కోరారు.;
సినిమా టికెట్ ధరలు మండిపోతున్న ఈ రోజుల్లో ఒక చిన్న సినిమా చేస్తున్న సాహసం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన 'సుమతీ శతకం' విడుదలకు సిద్ధమైంది. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ రీసెంట్ గా ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేదికపై మేకర్స్ ప్రకటించిన టికెట్ రేట్లు సామాన్య ప్రేక్షకులకు ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పాలి.
ఈ సినిమా టికెట్ ధర అందరికీ అందుబాటులో ఉండేలా సింగిల్ థియేటర్లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 150 రూపాయలుగా ఫిక్స్ చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుండటం సినిమాకు ఒక పెద్ద బూస్ట్‌ని ఇస్తోంది. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి సుధాకర్ కొమ్మాలపాటి నిర్మించిన ఈ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పై ఇప్పటికే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. చిన్న సినిమా అయినా కంటెంట్ లో దమ్ము ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో టీమ్ ఉంది.
హీరో అమర్దీప్ చౌదరి మాట్లాడుతూ.. ఒకే ఒక్క ఛాన్స్ ఇచ్చి తనను నిరూపించుకోనివ్వాలని కోరారు. మాస్ మహారాజ్ రవితేజను ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఈ స్థాయి వరకు వచ్చానని, ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. షూటింగ్ సమయంలో గాయపడినా వెనక్కి తగ్గకుండా కష్టపడి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ చెబుతూనే, స్టార్ మా సపోర్ట్ మరువలేనిదని గుర్తు చేసుకున్నారు.
దర్శకుడు ఎం.ఎం. నాయుడు ఈ సినిమాను ఒక కంప్లీట్ ఫ్యామిలీ ప్యాకేజీలా తీర్చిదిద్ధినట్లు చెప్పారు. నిర్మాత సాయి సుధాకర్ గారు ఇచ్చిన ఇన్పుట్స్ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని, అమర్దీప్ తన పాత్రలో ఒదిగిపోయారని చెప్పారు. హీరోయిన్ శైలి చౌదరి తెలుగు రాకపోయినా ఎంతో కష్టపడి తన పాత్రకు న్యాయం చేసిందని తెలిపారు. సుభాష్ ఆనంద్ సంగీతం సినిమాకు మరో ఎసెట్ కానుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాటల్లో అమర్దీప్ వేసిన స్టెప్పులకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చిందని టీమ్ అంతా వివరించింది.
సినిమాలో కామెడీ కోసం టేస్టీ తేజ, మహేష్ విట్టా వంటి వారు తమ వంతు సపోర్ట్ అందించారని కూడా తెలిపారు. నిర్మాత సాయి సుధాకర్ మాట్లాడుతూ.. సెన్సార్ నుండి వచ్చిన ఫీడ్ బ్యాక్ తమకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చిందని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో మైత్రీ మూవీస్ తో పాటు కన్నడలో కెవిఎన్, తమిళంలో జికె డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారని అన్నారు. సంక్రాంతి తర్వాత వస్తున్న ఒక మంచి ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా నిలుస్తుందని మేకర్స్ ఆశిస్తున్నారు.
తక్కువ ధరకే క్వాలిటీ సినిమాని అందించాలనే ఈ టీమ్ ప్రయత్నం మెచ్చుకోదగ్గది. ఫిబ్రవరి 6న థియేటర్లలోకి వస్తున్న సుమతీ శతకం ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. అమర్దీప్ కోరుకున్న ఆ ఒక్క ఛాన్స్ ఆడియన్స్ ఇస్తారో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.