'కరుప్పు'.. సూర్య కమ్ బ్యాక్ పక్కానా?
సక్సెస్ కోసం ఆర్జే బాలాజీ చెప్పిన `కరుప్పు` కథని నమ్మి రూటెడ్ స్టోరీతో సినిమా చేశారు.;
కోలీవుడ్ స్టార్ హీరోల్లో సూర్య స్టైల్ ప్రత్యేకం. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు పూర్తి భిన్నంగా కథాబలమున్న సినిమాలతో పాటు సరికొత్త కథలు, క్యారెక్టర్లతో ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న సూర్య గత కొంత కాలంగా వరుస ఫ్లాపులు, డిజాస్టర్లతో సతమతమవుతూ రేసులో వెనబడిపోయారు. ఒక దశలో వరుస బ్లాక్ బస్టర్లని సొంతం చేసుకున్న సూర్య ఇప్పుడు సరైన హిట్ల కోసం ఎదురు చూస్తున్నాడు. `జైభీమ్` తరువాత సూర్య హిట్టు మాట విని ఏళ్లు గడుస్తున్నాయి. సామాజిక సమస్య నేపథ్యంలో చేసిన `ఈటీ` ఫలితాన్ని ఇవ్వలేదు.
భారీ అంచనాలతో పాన్ ఇండియా వైడ్‌గా సంచలనాలు సృష్టించాలని చేసిన ఫాంటసీ యాక్షన్ మూవీ `కంగువా` బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచి షాక్ ఇచ్చింది. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తే అందులో రూ.100 కోట్లు మాత్రమే తిరిగి రాబట్టి డిజాస్టర్‌గా బాప్ అనిపించుకుంది. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా చేసిన `రెట్రో` కూడా ఇదే ఫలితాన్ని అందించి సూర్యని ఆలోచనలో పడేసింది. దీంతో కంగారుపడిన సూర్య ఆలోచించి అడుగులు వేయడం మొదలు పెట్టారు.
సక్సెస్ కోసం ఆర్జే బాలాజీ చెప్పిన `కరుప్పు` కథని నమ్మి రూటెడ్ స్టోరీతో సినిమా చేశారు. త్రిష కథానాయికగా నటించిన ఈ మూవీ రిలీజ్‌కు రెడీ అయినా ప్రస్తుతం ఉన్న పోటీ దృష్ట్య మేకర్స్ ఈ మూవీ రిలీజ్‌ని మే 14కు వాయిదా వేశారు. దీనితో పాటు తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి తెలుగు స్ట్రెయిట్ ఫిల్మ్ `విశ్వనాథ్ అండ్ సన్స్` చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది.
గత కొంత కాలంగా వరుస ఫ్లాపుల్లో ఉన్న సూర్య స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు. పక్కా రూటెడ్ స్టోరీతో చేసిన `కరుప్పు`తో సూర్య కమ్ బ్యాక్ ఇస్తాడనే చర్చ కోలీవుడ్‌లో నడుస్తోంది. దానికి ప్రధాన కారణం ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ఇప్పటికే రూ.110 కోట్లు దాటింది. ఇందులో మ్యూజిక్ రైట్స్‌ని థింక్ మ్యూజిక్ ఇండియాకు ఇచ్చేశారు. ఇక సౌత్ శాటిలైట్ హక్కుల్ని జీ నెట్ వర్క్‌కి భారీ మొత్తాన్ని అమ్మేశారు. అంతే కాకుండా హిందీ శాటిలైట్ రైట్స్ అండ్ డిజిటల్ హక్కుల్ని జయంతి లాల గడకు చెందిన పెన్ స్టూడియో సొంతం చేసుకుంది.
ఓటీటీ స్ట్రీమింగ్ హక్కుల్ని భారీ మొత్తానికి అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. సినిమా మే 14న వస్తుందని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ వారు అధికారికంగా ప్రకటించడంతో థియేట్రికల్ బిజినెస్‌కు సంబంధించిన ఎంక్వైరీలు తమిళనాడు , ఏపీ, తెలంగాణ, కర్ణాటక అండ్ ఓవర్సీస్ నుంచి భారీ స్థాయిలో మొదలైనట్టుగా కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. త్వరలోనే థియేట్రికల్ బిజినెస్ కూడా పూర్తి చేసి టీమ్ ఏప్రిల్ నుంచి ప్రమోషన్స్‌ని గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. బిజినెస్ ప్లాన్ చూస్తుంటే సూర్య `కరుప్పు`తో గట్టిగానే కమ్ బ్యాక్ ఇచ్చేలా ఉన్నాడని తెలుస్తోంది.