వివాదాస్పద నటుడిపై `అమ్మా` నిర్ణయం?
కొచ్చిలోని ఒక లగ్జరీ హోటల్‌లో నటుడు షైన్ టామ్ చాకోపై నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించగా, అతడు చాకచక్యంగా రూమ్ నుంచి పరారయ్యాడని కథనాలొచ్చాయి.;
కొచ్చిలోని ఒక లగ్జరీ హోటల్‌లో నటుడు షైన్ టామ్ చాకోపై నార్కోటిక్స్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించగా, అతడు చాకచక్యంగా రూమ్ నుంచి పరారయ్యాడని కథనాలొచ్చాయి. అయితే డ్రగ్స్ కు సంబంధించి మలయాళ నటుడు షైన్ టామ్ చాకోకు నోటీసు అందించాలని కేరళ పోలీసులు నిర్ణయించారు. అకస్మాత్తుగా అతడు తప్పించుకోవడం, రాష్ట్రం విడిచి అనుమానాస్పదంగా వెళ్ళిపోవడంపై అధికారులు వివరణ కోరుతున్నారు.
నార్కోటిక్స్ ఎసిపి అబ్దుల్ సలాం మీడియాతో మాట్లాడుతూ.. టామ్ పై ఇంకా అధికారిక కేసు నమోదు కానందున, రాష్ట్రం ఆవల అతన్ని వెంటనే అరెస్టు చేయవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీనియర్ అధికారులతో సంప్రదించిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు.
తాజాగా అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) , ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసాయి. నటి విన్సీ అలోషియస్ అధికారిక ఫిర్యాదు తర్వాత సినీ సోదరులపై ఒత్తిడి పెరిగిందని సమాచారం. సూత్రవాక్యం` చిత్ర బృందం కూడా దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది.
షైన్ మొబైల్ ఫోన్ చివరి టవర్ లొకేషన్ ఆధారంగా దర్యాప్తు అధికారులు అతడు తమిళనాడులోని పొల్లాచ్చిలో ఉన్నాడని గుర్తించారు. ఇంతకుముందు కోచ్చి, త్రిస్సూర్‌లలో పోలీసులు వివరాలు సేకరించారు. కానీ అతడిని పట్టుకోలేకపోయారు. దాడి సమయంలో మొదటి హోటల్ నుండి పారిపోయిన తర్వాత, షైన్ కొచ్చిలోని మరొక లగ్జరీ హోటల్‌లో చెక్ ఇన్ చేసి, ఆ తర్వాత టాక్సీలో ఆ హోటల్ నుండి వెళ్లిపోయాడని తెలుస్తోంది. నిఘా ఫుటేజ్, సాక్షుల ఖాతాల ద్వారా ఈ కదలికలు నిర్ధారించారు.
ఆసక్తికరంగా ఈ ఘటనలో టామ్ కి ఎవరో సహకరిస్తున్నారని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. షైన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సినిమా పోస్టర్లు, మీమ్స్, ఘటనకు సంబంధించిన వార్తలను పోస్ట్ చేస్తూనే ఉన్నాడు.