సత్యం సుందరం.. వాళ్ళు రీమేక్ చేస్తున్నారా?

కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.;

Update: 2025-05-20 23:30 GMT

కోలీవుడ్ స్టార్ నటులు కార్తీ, అరవింద్ స్వామి నటించిన సత్యం సుందరం మూవీ ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. 1996-2018 రెండు టైమ్‌ పీరియ‌డ్స్‌ లో సాగే విలేజ్ బ్యాక్‌ డ్రాప్‌ తో రూపొందిన ఆ మూవీకి 96 మూవీ ఫేమ్ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. అటు తమిళంలో.. ఇటు తెలుగులో సినిమా మంచి రెస్పాన్స్ అందుకుంది.

బాక్సాఫీస్ వద్ద రూ.50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఐఎండీబీలో 8.4 రేటింగ్ సాధించింది. ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చి అలరించింది. అయితే సత్యం సుందరం మూవీ రూటే సెపరేట్. ఫైట్లు, కామెడీ, ల‌వ్ ట్రాక్ లు ఉండవు. ఇద్ద‌రు వ్య‌క్తులు క‌లిసి సాగించిన జ‌ర్నీ నేప‌థ్యంలో ఫీల్‌ గుడ్ ఎమోష‌న‌ల్ ఎంట‌ర్ టైన‌ర్‌ గా సాగుతుంది.

సినిమా స్టోరీ చెప్పాలంటే రెండు లైన్లలో కంప్లీట్ అవుతుంది. కానీ మనసును హత్తుకునేలా సినిమాను తీశారు మేకర్స్. కార్తీ, అర‌వింద్ స్వామి ఇద్ద‌రు పోటీప‌డి యాక్ట్ చేశారు. ఇద్దరూ తమ పాత్రలకు ప్రాణం పోశారు. అలా 2024లో అందరికీ గుర్తుండిపోయేలా.. హృదయాన్ని కదిలించిన మూవీల్లో ఒకటిగా నిలిచింది సత్యం సుందరం.

కల్ట్ క్లాసిక్ గా నిలిచిన ఆ సినిమాను ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షాహిద్ కపూర్, ఇషాన్ ఖట్టర్ లీడ్ రోల్స్ పోషిస్తారని టాక్ వినిపిస్తోంది. అలా ఇప్పుడు నెటిజన్లు.. మరో సూపర్ హిట్ మూవీని రీమేక్ చేసి కళాఖండం క్రియేట్ చేయొద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు.

అయితే సౌత్ కు చెందిన అనేక సినిమాలు బాలీవుడ్ ఇప్పటికే రీమేక్ చేసింది. కానీ కొంతకాలంగా అవి వర్కౌట్ అవ్వడం లేదు. ముఖ్యంగా ఒరిజినల్ సినిమాలు సబ్ టైటిల్స్, డబ్బింగ్ ఆడియోస్ తో స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో అందుబాటులో ఉంటున్నాయి. దీంతో వాటి వైపే బీటౌన్ మూవీ లవర్స్ ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు.

రీమేక్స్ కాకుండా.. ఒరిజినల్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ మేకర్స్ రీమేక్ చేసిన కట్‌ పుట్లి , విక్రమ్ వేద, భోలా, దేవా సహా పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద విఫలమయ్యాయి. విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి. అయినా బాలీవుడ్ కు ఇంకా గుణపాఠం రాలేదని కొందరు ఎద్దేవా చేస్తున్నారు. అయితే సత్యం సుందరం రీమేక్ విషయంలో ఇంకా అధికారికంగా ప్రకటన లేనప్పటికీ.. సోషల్ మీడియాలో యూజర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఫిక్స్ అయితే ఇంకేం చేస్తారో వేచి చూడాలి.

Tags:    

Similar News