ఇప్పటికైనా నేచురల్ స్టార్‌ని ఫాలో అవుతారా?
ఈగోలే రాజ్యమేలే ఇండస్ట్రీ.. అఫ్ కోర్స్ ఎక్కడైనా ఈగో హర్ట్ అయితే అవతలివాడి కెరీర్‌కు మూడినట్టే.;
ఈగోలే రాజ్యమేలే ఇండస్ట్రీ.. అఫ్ కోర్స్ ఎక్కడైనా ఈగో హర్ట్ అయితే అవతలివాడి కెరీర్‌కు మూడినట్టే. అయితే ఇది మన ఇండస్ట్రీలో మాత్రం ఎక్కువగా వర్కవుట్ అవుతూ ఉంటుంది. కెరీర్‌లో మెట్లు ఎక్కుతున్న క్రమంలో ఎవరి ఈగో అయినా హర్ట్ అయిందా కెరీర్ గోవిందా. ఈగోలే ప్రధానంగా సాగే ఈ ఇండస్ట్రీలో హీరోగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నిలడటం, అందులోనూ నలుగురికి ఆదర్శంగా నిలవడం మామూలు విషయం కాదు. అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు నేచురల్ స్టార్ నాని.
ఇంతింతై వటుడింతై అన్నట్టుగా క్లాప్ బాయ్‌గా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి యాక్సిడెంటల్‌గా హీరోగా మారి టాలీవుడ్ తెరపై అద్భుతాలు సృష్టిస్తున్నారు. `జెండాపై కపిరాజు` సమయంలో వరుస ఫ్లాపులతో కాస్త తడబడినా తేరుకుని మళ్లీ ట్రాక్‌లోకి వచ్చారు. ఆ సమయంలో ఇక నాని పని అయిపోయిందనే కామెంట్‌లు వినిపించినా తనపై తనకున్న గట్టి నమ్మకంతో విభిన్నమైన కథలని ఎంచుకుని మళ్లీ సక్సెస్ బాట పట్టాడు.
మారుతి తెరకెక్కించిన `భలే భలే మగాడివోయ్` సినిమాతో యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ మార్కు వసూళ్లని రాబట్టి ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరచడమే కాకుండా ఈ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్‌లో చేరి అందరిని విస్మయానికి గురి చేయడం తెలిసిందే. అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోని నాని అదే ఫార్ములాని పాటిస్తూ విభిన్నమైన కథలతో వరుసగా విజయాల్ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. ఎవరూ టచ్ చేయని కథలని, పాత్రలని ఎంచుకుంటూ వాటితో బ్లాక్ బస్టర్లని దక్కించుకుంటూ హీరోగా, నిర్మాతగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటున్నాడు.
ఇండస్ట్రీలో ఎవరి అండలేకుండానే ప్రవేశించిన నాని ఇండస్ట్రీలో స్వతహాగా ఎదగాలనుకున్న వారికి ఓ రోల్ మోడల్‌గా నిలుస్తున్నారు. `దసరా`తో వంద కోట్ల మార్కుని టచ్ చేసిన నాని తాజాగా `హిట్ 3`తో ఆ మార్కుని మరో సారి టచ్ చేయబోతున్నాడు. రీసెంట్‌గా విడుదలైన `హిట్ 3` ఇప్పటి వరకు వరల్డ్ వైడ్‌గా రూ.62 కోట్ల మార్కుని టచ్ చేసింది. దీంతో హీరోగా మిరాకిల్స్ చేయాలనుకున్న వారు ఇప్పటికైనా నానిని ఫాలో అయితే బెటర్ అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.