కన్నప్ప- బ్రాహ్మణుల కాంట్రవర్సీ.. డైలాగ్ రైటర్ కీలక నోట్ రిలీజ్..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.;

Update: 2025-06-19 08:22 GMT
కన్నప్ప- బ్రాహ్మణుల కాంట్రవర్సీ.. డైలాగ్ రైటర్ కీలక  నోట్ రిలీజ్..

టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మైథలాజికల్ డ్రామాగా రూపొందుతున్న ఆ సినిమాకు మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా.. స్టార్ క్యాస్టింగ్ కనిపించనుంది.


జూన్ 27వ తేదీన సినిమా రిలీజ్ కానుండగా.. ఇటీవల కొన్ని బ్రాహ్మణుల సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి విదితమే. బ్రహ్మానందం, సప్తగిరి పోషించిన పిలక, గిలక రోల్స్ పై మండిపడ్డాయి. ఆ రోల్స్ బ్రాహ్మణుల పట్ల అగౌరవంగా ఉన్నాయని విమర్శించాయి. ఈ నేపథ్యంలో మూవీ డైలాగ్ రైటర్ అకెళ్ళ శివప్రసాద్.. కీలకమైన నోట్ విడుదల చేశారు.

తాను బ్రాహ్మణ వర్గానికి చెందిన వ్యక్తినని తెలిపారు శివప్రసాద్. దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ కూడా ఉత్తర భారతదేశానికి చెందిన బ్రాహ్మణుడేనని చెప్పారు. కన్నప్పలో బ్రాహ్మణులను లేదా మరే ఇతర సమాజాన్ని అవమానించే ఒక్క సన్నివేశం కూడా లేదని క్లారిటీ ఇచ్చారు. చాలా మంది బ్రాహ్మణులు వివిధ విభాగాల్లో వర్క్ చేశారని తెలిపారు.

"గత కొద్ది కాలంగా కన్నప్ప చిత్రం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని చూసి సినిమాకు మాటల రచయితగా పనిచేసిన నా మనసుకు ఆవేదన కలిగి, కొన్ని విషయాలు మీతో చెప్పదల్చుకున్నాను. ముఖేష్ కుమార్ సింగ్ గారు టీవీ సీరియల్ ను మహాభారతాన్ని అత్యద్భుతంగా తీశారు. ఆయన కన్నప్పలో బ్రాహ్మణులతోపాటు ఎవరినీ కించపరచలేదు" అని చెప్పారు.

"ఇదివరకు కన్నప్ప చరిత్ర మీద వచ్చిన ప్రధాన పూజారి మహదేవ శాస్త్రి పాత్రను గుడిలో దేవుడి నగలు తీసుకెళ్ళి తన ఉంపుడుగత్తెకు ఇచ్చినట్టుగా చూపించారు. కానీ కన్నప్ప చిత్రంలో కథానాయకుడిగా నటించడమే గాక, కథా రచన చేసిన శ్రీ మంచు విష్ణు గారు ధూర్జటి 16వ శతాబ్దంలో రచించిన శ్రీ కాళహస్తీ మహత్యం గ్రంధం ఆధారంగా తీశారు" అని తెలిపారు.

"మోహన్ బాబు గారు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడు పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. రేపు సినిమా చూశాక, ప్రేక్షకులందరికీ ఆ విషయం అర్థమవుతుంది. మరో విషయం ఏమిటంటే సినిమా పూర్తి చేశాక కూడా పరమ పవిత్రమైన శ్రీ కాళహస్తి దేవస్థానం ప్రధాన అర్చకులకు చూపించారు" అని శివప్రసాద్ వెల్లడించారు.

"సినిమా ఎంతో ఉన్నతంగా ఉందని ప్రశంసించి మోహన్ బాబు గారిని, విష్ణు గారిని వేదమంత్రాలతో వారు ఆశీర్వదించారు. సినిమాకు పాట రాసిన శ్రీ రామజోగయ్య శాస్త్రి గారితో పాటు ఎందరో బ్రాహ్మణులు వివిధ శాఖలలో పనిచేశారు. ఏ వర్గం వారిని కించపరచడానికి, కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి, ఎన్నో వ్యయ ప్రయాసలు భరించి చిత్రాన్ని నిర్మించవలసిన అవసరం ఎవరికీ లేదు. చివరగా, కన్నప్ప చిత్రం ఇంకా విడుదల కాకుండానే ఏవేవో వదంతులు పుట్టించి, దుష్ప్రచారం చేస్తున్న వారి విషయం ఆ పరమేశ్వరుడే చూసుకుంటారు" అంటూ శివప్రసాద్ రాసుకొచ్చారు.

Similar News