లెజెండ్స్ ఎందరు ఉన్నా తళా బయోపిక్ ఒక్కటే!
ప్రముఖుల జీవిత కథలతో సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. వారి స్ఫూర్తివంతమైన జీవితాలను తెరకెక్కించేందుకు మేకర్స్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు.;
ప్రముఖుల జీవిత కథలతో సినిమాలు ఎప్పుడూ ఆసక్తిని కలిగిస్తున్నాయి. వారి స్ఫూర్తివంతమైన జీవితాలను తెరకెక్కించేందుకు మేకర్స్ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇందులో క్రీడలు, రాజకీయాలు, సైన్స్ తదితర రంగాలకు చెందిన ప్రముఖులపై బయోపిక్స్ ఎక్కువ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అతి పెద్ద స్కామర్లపై బయోపిక్ లు ఉత్కంఠ కలిగించాయి. అలాగే వినోద పరిశ్రమ లెజెండ్స్ పైనా అడపాదడపా బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. కొందరిపై డాక్యు సిరీస్ లు ఆసక్తిని కలిగిస్తున్నాయి. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దిగ్గజాలైన కపూర్‌లు, రోషన్‌లపై డాక్యు సిరీస్ లు తెరకెక్కాయి.
అయితే ఉత్తరాది, దక్షిణాదిన చాలామంది లెజెండరీ స్టార్లు ఉన్నా కానీ, ఇప్పుడు తళా అజిత్ బయోపిక్ తెరకెక్కిస్తుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. అమితాబ్ బచ్చన్, చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్ వంటి ఎందరో లివింగ్ లెజెండ్స్ స్ఫూర్తివంతమైన జీవితాల గురించి నిరంతరం చర్చ సాగుతూనే ఉంది. వారిపై కొందరు పుస్తకాలు రాసారు. అవన్నీ జనబాహుళ్యంలోకి విస్త్రతంగా దూసుకెళ్లాయి. కానీ ఆ నలుగురి జీవితాలపై ఇప్పటివరకూ కనీసం డాక్యు సిరీస్ అయినా తెరకెక్కించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఇంతమంది దిగ్గజ హీరోలను కాదని తళా అజిత్ జీవితకథనే సబ్జెక్ట్ గా ఎంపిక చేయడం వెనక మతలబు ఏమిటో విశ్లేషిస్తే, నిజానికి అజిత్ లో ఏ ఇతర హీరోతో పోల్చినా చాలా వైవిధ్యమైన లక్షణాలున్నాయి. అతడు సినిమా స్టార్ గా ఓవైపు తమిళనాడులోని మాస్ ప్రేక్షకుల నుంచి అసాధారణ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నా కానీ, దీనికి సమాంతరంగా క్రీడల్లోను రాణిస్తున్నాడు. తళా నటుడు కం క్రీడాకారుడు.. ఈ ఎలిమెంట్ అతడి జీవితకథలో ఉత్కంఠను కలిగిస్తోంది. అతడిలోని నటుడిని ఇటీవలి కాలంలో రేసర్ (ఫార్ములా వన్ రేస్ కోర్స్ క్రీడాకారుడు) డామినేట్ చేస్తున్నాడు. అతడు ఫార్ములా వన్ రేసర్ గా ప్రపంచవ్యాప్త గుర్తింపును సంపాదించాడు. ఎదురేలేని విన్నింగ్ టీమ్ సభ్యుడిగా ప్రపంచవ్యాప్తంగా తళా ఆరాధ్యుడు అయ్యాడు. అతడి రేసింగ్ ప్రతిభను, దూకుడును ప్రపంచవ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. అందుకే ఇప్పుడు అజిత్ జీవితకథను వెండితెరపై వెలిగించాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు.
ఓ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అజిత్ రేసింగ్ ప్రయాణంపై ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందిస్తోంది. నటి కం నిర్మాత అమలా పాల్ మాజీ భర్త ఏ.ఎల్ విజయ్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్‌కు తాత్కాలికంగా `అజిత్స్ రేసింగ్ లైఫ్` అని పేరు పెట్టారు. దీనిని మూడు భాగాల డాక్యుమెంటరీగా రూపొందించనున్నారు.
ఫార్ములా వన్ రేసింగ్ ట్రాక్ పై తళా అజిత్ విక్టరీని పరిశీలిస్తే, దుబాయ్ 24H కార్ రేసులో అజిత్ టీమ్ మూడవ స్థానం సాధించడం, ఇటలీ 12H రేసులో మూడవ స్థానం దక్కించుకోవడం, బెల్జియంలోని స్పా-ఫ్రాంకోర్చాంప్స్ సర్క్యూట్‌లో రెండవ స్థానం గెలుచుకోవడం వంటి కొన్ని ఆసక్తికరమైన విషయాలున్నాయి. వీటన్నిటినీ డాక్యు సిరీస్‌లో చూపిస్తే అవి అభిమానులనే కాకుండా, ప్రజలందరినీ ఎగ్జయిట్ చేస్తాయని భావిస్తున్నారు. ఓవైపు ప్రమాదాలు గగుర్పాటుకు గురి చేస్తున్నా అతడు రేస్ ట్రాక్ ని విడిచిపెట్టడు. అతడు ఆటను ఆపడు. దేశ విదేశాలలో తన టీమ్‌తో 55 వయసులోను అతడు ప్రదర్శిస్తున్న దూకుడు మతులు చెడగొడుతోంది. అతడు చాలాసార్లు ప్రమాదాలకు గురై గాయాలపాలయ్యాడు. 160 కిలోమీటర్ల వేగంతో రేస్ కార్ ని నడిపిస్తూ అతడు రియల్ హీరోని తలపిస్తున్నాడు. అందుకే ఇప్పుడు అతడిపై డాక్యు సిరీస్ ని తెరకెక్కిస్తుంటే, అది విచిత్రంగా లేదా వింతగా అనిపించడం లేదు. దీనికి తళా అర్హుడు! అని అంగీకరించాల్సిందే. ఓవైపు సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అతడు కార్ రేసింగుని విడిచిపెట్టకుండా ఒక పట్టు పడుతున్నాడు.