కృతి-రష్మిక.. దోస్తానా తరహా ప్రయోగమా?
ఏదైనా ఒక కథను అడ్వాన్స్ డ్ గా థింక్ చేసి దానిని ప్రజలకు పరిచయం చేయాలనుకుంటే, కచ్ఛితంగా ఇదే సరైన సమయం.;
ఏదైనా ఒక కథను అడ్వాన్స్ డ్ గా థింక్ చేసి దానిని ప్రజలకు పరిచయం చేయాలనుకుంటే, కచ్ఛితంగా ఇదే సరైన సమయం. ప్రజలు ఇప్పుడు వినోదంలో వైవిధ్యం కోరుకుంటున్నారు. రెగ్యులర్ స్ట్రీరియో టైపిక్ మాస్ కథలు లేదా ఫ్యాక్షన్ కథలతో సినిమాలు తీస్తే చూసేందుకు తెలుగు ప్రజలు కూడా సిద్ధంగా లేరు. ఉత్తరాది, దక్షిణాదిన ప్రయోగాత్మక కథలకు, భారీతనం నిండిన విజువల్ వండర్స్ ని వీక్షించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
ఇలాంటి సమయంలో ప్రయోగాత్మక కంటెంట్ తో ముందుకు వచ్చే ఫిలింమేకర్స్ కి మంచి అవకాశాలు లభిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు రష్మిక మందన్న- కృతి సనోన్ స్వలింగ సంపర్క (ఎట్జీబీటీక్యూ) జంటగా నటిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అమ్మాయి- అమ్మాయి మధ్య ప్రేమకథతో సినిమా తెరకెక్కనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది విజయవంతమైన కాక్ టైల్ చిత్రానికి సీక్వెల్ కథతో రూపొందుతోంది. దీనికి హోమీ అదజానియా దర్శకుడు.
అయితే ఈ సినిమా కథాంశం గురించి వినోదప్రియుల్లో ఎక్కువగా చర్చ సాగుతోంది. ఇది కరణ్ జోహార్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ `దోస్తానా` తరహా స్వలింగసంపర్కుల కథతో రూపొందుతోందా? అంటే ఇంచుమించు అదే తరహాలో సాగేందుకు ఆస్కారం ఉందని చెబుతున్నారు. దోస్తానా కథాంశాన్ని పరిశీలిస్తే, ఒక అద్దె గదిలో దిగేందుకు ప్రయత్నించే ఇద్దరు స్నేహితులు అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం ఆ ఇంటి ఓనర్ నుంచి సమస్యల్ని ఎదుర్కొంటారు. యజమానికి ఒక కూతురు ఉంది.. ఒంటరిగా అదే భవంతిలో ఉంటోంది. అందువల్ల బ్యాచిలర్స్ కి గదిని అద్దెకు ఇచ్చేందుకు ఓనర్ నిరాకరిస్తాడు. అయితే ఎలాగైనా ఆ ఇంటిలోనే ఉండాలనే పంతంతో ఆ ఇద్దరూ తాము నపుంసకుల(లెస్బియన్స్)మని, అమ్మాయికి సమస్యలేవీ ఉండవని ఓనర్ కి చెప్పి ఒప్పిస్తారు. ఆ తర్వాత ఆ ఇంటి ఓనర్ కుమార్తె అయిన ప్రియాంక చోప్రాతో ఆ ఇద్దరి స్నేహం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే దోస్తానా కథాంశం.
ఇద్దరు సాధారణ యువకులు స్వలింగసంపర్కులుగా లేదా నపుంసకులుగా నటించడం అంటే అది సవాల్ తో కూడుకున్నది. కానీ అభిషేక్, జాన్ అబ్రహాం దోస్తానా చిత్రంలో అద్భుతంగా నటించారు. ఆ ఇద్దరూ తమ పాత్రల్లోకి ఎంతగా ఒదిగిపోయారంటే, ఆ తర్వాత ఈ ఇద్దరూ బహిరంగంగా కనిపిస్తే నిజమైన `గే`లు అంటూ ప్రజలు అనుమానించారు. చాలా మంది క్రిటిక్స్ కూడా ఇద్దరూ నిజంగానే స్వలింగసంపర్కులు అంటూ ముద్ర వేసి ఆ తర్వాతి కాలంలో వార్తా కథనాలు రాసారంటే ఆ పాత్రల ప్రభావం ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సినిమాని నిర్మించిన కరణ్ జోహార్ అప్పటికే బ్యాచిలర్ గా మిగిలిపోవడంతో అతడిని కూడా నపుంసకుడు (గే) అంటూ ప్రచారం సాగించారు. ఓవరాల్ గా దోస్తానా ప్రభావం చాలా మెదళ్లపై బలమైన ప్రభావం చూపించింది.
ఇప్పుడు కృతి - రష్మిక మందనల స్వలింగ సంపర్క సినిమా నిజమేనా? అంటే .. దోస్తానాలో ఇద్దరు అబ్బాయిల ప్రేమకథను చూపిస్తే, ఈ కొత్త సినిమాలో రష్మిక - కృతి మధ్య ఉండే బాండింగ్ లేదా వారి మధ్య సాగే ప్రేమకథ చుట్టూ కథ తిరుగుతుందని టాక్. అయితే ఇది ప్యూర్ గే తరహా కథాంశమా? లేక కామెడీతో వినోదాన్ని అందించే సినిమానా? అన్నది దర్శకనిర్మాతలు వెల్లడించాల్సి ఉంటుంది.
గతంలో వచ్చిన అమ్మాయి - అమ్మాయి (లెస్బియన్) ప్రేమకథలను పరిశీలిస్తే, దీపా మెహతా రూపొందించిన ఫైర్ చిత్రంలో షబానా ఆజ్మీ, నందితా దాస్ ప్రేమకథ సంచలనాలు సృష్టించింది. ఇద్దరు తోడికోడళ్ల నడుమ శృంగారం, ప్రేమానుబంధం నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించగా క్రిటిక్స్ ప్రశంసలతో పాటు గొప్ప ప్రజాదరణ పొందింది. ఈ సినిమా ఎన్నో అవార్డులు రివార్డులను సాధించింది. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా (2019) కమర్షియల్ అంశాలతో రూపొందించిన డీసెంట్ లెస్బియన్ సినిమా. అప్పట్లో దీనిపై చాలా చర్చ సాగింది. షబానా అజ్మీ, దివ్య దత్తా, స్వరా భాస్కర్ ప్రధాన పాతరల్లో నటించిన `షీర్ కోర్మా` చిత్రం కూడా మహిళల మధ్య ప్రేమ, సామాజిక ఆమోదం గురించిన సినిమా.
రష్మిక మందన్న- కృతి స్వలింగ సంపర్కుల కథ (కాక్‌టైల్ 2)లో నటిస్తున్నారా లేదా? అనేది ఇంకా నిర్మాతలు వెల్లడించాల్సి ఉంది. ఇది అర్బన్ రోమ్ కామ్. ఇందులో ఆ ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోయే యువకుడిగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడు.