ముందే నోరు జారి అడ్డంగా బుక్కైన డైరెక్టర్లు!
పార్ట్-2 లేనట్లే అనే పరిస్థితి తెచ్చుకున్న ఇద్దరు ప్రముఖ దర్శకులు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఎక్కడ చూసినా ఫ్రాంచైజీ లేదా రెండు భాగాలు అనే ట్రెండ్ నడుస్తోంది. `బాహుబలి`, `కేజీఎఫ్`, `పుష్ప` సాధించిన భారీ విజయాలను చూసి ఇండస్ట్రీలోని చాలా మంది దర్శకులు తమ చిత్రాలను ముందే రెండు భాగాలుగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే కథపై పూర్తి పట్టు లేకుండా మార్కెట్ క్రేజ్ - హైప్ కోసం సినిమా విడుదలకు ముందే పార్ట్-2 ఉంది అని ప్రకటించి ఆ తర్వాత అడ్డంగా బుక్కవుతున్న దర్శకుల సంఖ్య కూడా తక్కువ లేదు. ముందే నోరు జారి రెండు భాగాలు అని ధైర్యంగా ప్రకటించినప్పటికీ అటుపై ప్రాజెక్టులు కేవలం ప్రకటనలకే పరిమితవుతున్నాయి. పార్ట్-2 లేనట్లే అనే పరిస్థితి తెచ్చుకున్న ఇద్దరు ప్రముఖ దర్శకులు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారారు.
ఈ జాబితాలో ముందుగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గురించి చెప్పుకోవాలి. రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా ఆయన తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా `బ్రహ్మాస్త్ర`. ఈ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ అస్త్రావర్స్ పేరుతో భారీ ట్రైలాజీగా (మూడు భాగాలుగా) ముందే అనౌన్స్ చేశారు. మొదటి భాగం ముగింపులోనే పార్ట్-2 గా దేవ్ పాత్రను పరిచయం చేస్తూ భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే మొదటి భాగానికి పెట్టిన భారీ బడ్జెట్, వచ్చిన మిశ్రమ టాక్ ,విఎఫ్ఎక్స్ పరంగా జరిగిన ఆలస్యం వల్ల ఈ ఫ్రాంచైజీ ముందుకు కదలలేదు.ఆయాన్ ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంటున్నాడు తప్ప బ్రహ్మాస్త్ర పార్ట్ 2 గురించి మళ్లీ ఎలాంటి ఊసు లేదు. దీంతో రెండవ భౄగం దాదాపు పక్కనబెట్టేసినట్లేనని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు నిర్ధారించేశాయి.
ఇదే తరహాలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ కూడా `దేవర` చిత్రంతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన `దేవర` చిత్రాన్ని షూటింగ్ మధ్యలో ఉండగానే హఠాత్తుగా రెండు భాగాలుగా రిలీజ్ చేయబోతున్నట్లు కొరటాల శివ అత్యంత ధైర్యంగా ప్రకటించారు. కథ పరిధి పెరిగిందని, అందుకే రెండు భాగాలు చేస్తున్నామని చెప్పినప్పటికీ.. థియేటర్లలో విడుదలైన మొదటి భాగం స్క్రిప్ట్ పరంగా, ముగింపు పరంగా ప్రేక్షకులను వంద శాతం మెప్పించలేకపోయింది. క్లైమాక్స్‌లో పార్ట్-2 కోసం ఇచ్చిన లీడ్ చాలా బలహీనంగా ఉందనే టాక్ రావడంతో పాటు ఎన్టీఆర్ తదుపరి చిత్రమైన ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులతో బిజీ అయిపోయారు. ఇంతకాలం కొరటాల కూడా కొంత ఆశతో ఉండేవారు. కానీ ఆయన కూడా ఆశ వదిలేసి బాలయ్యతో కొత్త సినిమా మొదలు పెట్టడంతో `దేవర పార్ట్ 2` ప్రకటనకే పరిమితమనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
ఒక సినిమాను రెండు భాగాలుగా మార్చడం వెనుక పక్కా కథా బలం ఉండాలి. కేవలం మొదటి భాగం బిజినెస్ పెంచడానికో, లేదా ఓటీటీ రేట్లను క్యాష్ చేసుకోవడానికో పార్ట్-2 అని ముందే అనౌన్స్ చేస్తే అది దర్శకులపైనే తీవ్రమైన ఒత్తిడిని పెంచుతుంది. మొదటి భాగానికి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ రానప్పుడు నిర్మాతలు కానీ, హీరోలు కానీ పార్ట్-2 పై ఇన్వెస్ట్ చేయడానికి సాహసించరు. అయాన్ ముఖర్జీ, కొరటాల శివ ఇద్దరి విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. కథ పూర్తిగా సిద్ధం కాకుండానే రెండు భాగాలు అని నోరు జారడం వల్ల ఆ ప్రాజెక్టులు హోల్డ్‌లో పడి దర్శకులు ఇండస్ట్రీలో డిఫెన్స్‌లో పడాల్సి వచ్చింది.
ఈ ట్రెండ్ వల్ల హీరోల డేట్స్ కూడా వృధా అవుతున్నాయని ఇండస్ట్రీ ఇన్‌సైడర్స్ చెప్తున్నారు. ఒక సినిమా రెండు భాగాలుగా వస్తుందంటే హీరోలు కూడా లాంగ్ కమిట్‌మెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తీరా మొదటి భాగం ఫలితం తేడా కొట్టాక పార్ట్-2 ని క్యాన్సిల్ చేయడం లేదా హోల్డ్‌లో పెట్టడం వల్ల హీరోల కెరీర్ ప్లానింగ్ కూడా దెబ్బతింటుంది. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది అగ్ర హీరోలు.. మొదటి భాగం పూర్తిగా పూర్తయి, బాక్సాఫీస్ వద్ద దాని రిజల్ట్ చూసిన తర్వాతే పార్ట్-2 అనౌన్స్ చేద్దామని దర్శకులకు కండిషన్స్ పెడుతున్నారు. ముందే అతిగా ఊహించుకుని స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఎంత ప్రమాదకరమో ఈ ఇద్దరు దర్శకుల లైనప్ నిరూపించింది.