భార‌త్ నుంచి ఆస్కార్‌కు.. రాజ‌మౌళి-విశాల్ భ‌ర‌ద్వాజ్ ఓట్లు కీల‌కమే!

ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత ఈ అస్కార్స్ కమిటీ గౌరవాన్ని దక్కించుకున్న భారతీయ దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ నిలిచారు.

Update: 2026-06-26 10:44 GMT

ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించే ప్రతిష్టాత్మక `అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్` (AMPAS) కమిటీలో చేరాల్సిందిగా ప్రముఖ భారతీయ దర్శకుడు విశాల్ భరద్వాజ్‌కు ఆహ్వానం అందింది. ఇటీవ‌లి కాలంలో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత ఈ అస్కార్స్ కమిటీ గౌరవాన్ని దక్కించుకున్న భారతీయ దర్శకుడిగా విశాల్ భరద్వాజ్ నిలిచారు. ఈ ఆహ్వానంపై ఆయన స్పందిస్తూ.. అకాడమీలో సభ్యుడిగా మారే అవకాశం రావడంపై తాను ఎంతో ఉత్సాహంగా, గర్వంగా ఉన్నానని హర్షం వ్యక్తం చేశారు. గ్లోబల్ సినిమాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ వేదిక‌లో భాగం కావడం ఒక విశేష గౌరవమని... ఇకపై ఆస్కార్ అవార్డుల ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడానికి తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన పేర్కొన్నారు.

విశాల్ భరద్వాజ్ భారతీయ చలనచిత్ర రంగానికి అందించిన సేవలు ఎంతో ప్రత్యేకమైనవి. ముఖ్యంగా ప్రఖ్యాత ఆంగ్ల నాటకకర్త విలియం షేక్‌స్పియర్ రాసిన నాటకాల నుండి స్ఫూర్తి పొంది... వాటిని భారతీయ నేటివిటీకి తగినట్లుగా మార్చి అద్భుతమైన క్లాసిక్స్ చిత్రాలుగా మలిచిన ఘనత ఆయనది. షేక్‌స్పియర్ రాసిన `మెక్‌బెత్`, `ఒథెల్లో`, `హామ్లెట్` నాటకాల ఆధారంగా ఆయన తెరకెక్కించిన `మక్బూల్` (2004), `ఓంకార` (2006), `హైదర్` (2014) చిత్రాలు ఇండియన్ సినిమా చరిత్రలో బ్లాక్‌బస్టర్లుగా, విమర్శకుల ప్రశంసలు పొందిన క్లాసిక్స్‌గా నిలిచాయి. ఇటీవలే ఆయన బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్‌తో కలిసి ఒక పవర్‌ఫుల్ యాక్షన్ చిత్రం `ఓ రోమియో`ను రూపొందించారు.

ఈ ఏడాది (2026) అకాడమీ ప్రకటించిన ఆహ్వానితుల జాబితాలో కేవలం విశాల్ భరద్వాజ్ మాత్రమే కాకుండా.. భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన మరికొంద‌రు ప్రతిభావంతులకు కూడా చోటు దక్కడం విశేషం. భారత సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన చిత్రాలకు కూర్పు అందించిన ప్రముఖ ఎడిటర్లు శ్రీకర్ ప్రసాద్, దీపా భాటియాలు కూడా ఈ ఆస్కార్స్ ఓటింగ్ ప్యానెల్ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు కాస్ట్యూమ్ డిజైనర్ ఏకా లఖానీ, కాస్టింగ్ డైరెక్టర్ దిలీప్ శంకర్, యానిమేషన్ ఆర్టిస్ట్ అవ్నీత్ కౌర్ (న‌టి అవ్‌నీత్ కౌర్ కాదు), ప్రొడక్షన్-టెక్నాలజీ రంగ నిపుణులు ఫరా ఖాన్, రాజేష్ రామచంద్రన్ వంటి వారు ఈ ప్రతిష్టాత్మక AMPAS లో సభ్యులుగా ఆహ్వానం అందుకున్నారు.

ఈ ఆహ్వానం ద్వారా భారతదేశానికి చెందిన ఈ సాంకేతిక నిపుణులు, క్రియేటర్లు అందరూ కూడా అకాడమీ (AMPAS) లో ఓటింగ్ హక్కును పొందుతారు. అంటే భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉత్తమ చిత్రాలకు ఆస్కార్ అవార్డులను నిర్ణయించే ప్రక్రియలో వీరంతా తమ ఓటు ద్వారా కీలక పాత్ర పోషించనున్నారు. గతంలో `ఆల్ దట్ బ్రీత్స్` డాక్యుమెంటరీతో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న శౌనక్ సేన్‌తో పాటు విశాల్ భరద్వాజ్ వంటి అగ్ర దర్శకులు ఈ ప్యానెల్‌లోకి రావడం గ్లోబల్ స్క్రీన్‌పై భారతీయ సినిమా ప్రాముఖ్యతను - గౌరవాన్ని మరింత పెంచిందని చెప్పవచ్చు.

ఎస్.ఎస్. రాజమౌళి తర్వాత ఆస్కార్స్ కమిటీ నుండి మ‌రో సీనియ‌ర్ దర్శ‌క‌ర‌చ‌యిత‌ విశాల్ భరద్వాజ్‌కు ఈ స్థాయి గుర్తింపు రావడం భారతీయ సినిమా సాధిస్తున్న అంతర్జాతీయ పురోగతికి అద్దం పడుతోంది. షేక్‌స్పియర్ సాహిత్యాన్ని వెండితెరపై విజువల్ వండర్స్‌గా మార్చిన విశాల్ స‌ర్ ప్రతిభను ఆస్కార్ అకాడమీ గుర్తించడంపై దేశవ్యాప్తంగా సినీ ప్రముఖులు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ 2026 ఆహ్వానితుల జాబితాలోని భారతీయ సభ్యులంతా భవిష్యత్ అంతర్జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపికలో మన దేశ ప్రతినిధులుగా వ్యవహరించడం విశేషం. భార‌త్ నుంచి ఆస్కార్ పోటీబ‌రికి వెళ్లే సినిమాల‌కు నాటి కాలంలో దివంగ‌త‌ సినీలెజెండ్స్ స‌త్య‌జిత్ రే, మృణాల్ సేన్ వంటి ప్ర‌ముఖుల ఓట్లు ఇతోధికంగా స‌హ‌క‌రించాయి. ఇప్పుడు అమీర్ ఖాన్ స‌హా రాజ‌మౌళి-విశాల్ భ‌ర‌ద్వాజ్, శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ ఓట్లు కీల‌కమైన‌విగా మారాయి.

Tags:    

Similar News