మురళిమోహన్ `పద్మభూషణ్`కు అర్హులు.. ఫిలింక్రిటిక్స్ అభినందన!
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా -మాజీ పార్లమెంట్ సభ్యులుగా విశేష సేవలు అందించిన ప్రముఖ నాయకుడు మురళీమోహన్ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక `పద్మశ్రీ` పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా -మాజీ పార్లమెంట్ సభ్యులుగా విశేష సేవలు అందించిన ప్రముఖ నాయకుడు మురళీమోహన్ కేంద్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక `పద్మశ్రీ` పురస్కారాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆయనను ప్రత్యేకంగా కలిసి ఘనంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మురళీమోహన్ సినీ రంగానికి చేసిన సేవలు అనితరసాధ్యమైనవని.. ఆయన కేవలం పద్మశ్రీకే కాకుండా భవిష్యత్తులో `పద్మభూషణ్` పురస్కారానికి కూడా పూర్తిగా అర్హులని ప్రశంసించారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు ఆయనకు కాస్త ఆలస్యంగా వచ్చినా.. సరైన సమర్థుడికే దక్కిందని అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జనార్ధన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సురేష్ కొండేటి అభిప్రాయపడ్డారు.
ఈ అభినందన సభలో ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల ప్రసాదరావు మాట్లాడుతూ.. దాదాపు 58 ఏళ్ల ఘన చరిత్ర గలిగిన ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌ను తొలితరం జర్నలిస్టులు పి.యస్. ఆర్. ఆంజనేయశాస్త్రి, గుడిపూడి శ్రీహరి తదితరులు స్థాపించారని గుర్తుచేశారు. కొంతకాలంగా స్థబ్దుగా ఉన్న అసోసియేషన్ ఇటీవల పునఃప్రారంభమై ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని, ఇందులో భాగంగా నిర్వహించిన `మీట్ ద ప్రెస్` కార్యక్రమంలో పాల్గొనేందుకు సినీదిగ్గజం మురళీమోహన్ సుముఖత వ్యక్తం చేయడం ఆనందంగా ఉందన్నారు. అలాగే గౌరవాధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ.. సౌమ్యుడు, అజాతశత్రువు అయిన మురళీమోహన్ గారికి ఆయన పుట్టినరోజుకు ఒక రోజు ముందు పద్మశ్రీ అవార్డు రావడం నిజమైన బర్త్‌డే గిఫ్ట్ అని కొనియాడారు.
సత్కారం అనంతరం మురళీమోహన్ మాట్లాడుతూ.. తనను పద్మశ్రీ పురస్కారానికి సిఫార్సు చేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తెలుగు సినీ రంగ అభివృద్ధి కోసం ఎంతో శ్రద్ధ వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని ఆయన అభినందించారు. తెలుగు ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌తో తనకు ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని ఈ సందర్భంగా ఆయన నెమరువేసుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్.వి. కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కూడా పాల్గొన్న ఈ వేడుకలో.. యావత్ చిత్ర పరిశ్రమ మురళీమోహన్ గారిని ఘనంగా సత్కరిస్తే బాగుంటుందని సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొండేటి అభిప్రాయపడ్డారు.
మురళిమోహనుడి కెరీర్ ప్రస్థానం:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయకుడిగా, నిర్మాతగా.. రాజకీయ, వ్యాపార రంగాలలో విశిష్ట గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి మాగంటి మురళీమోహన్. 1940 జూన్ 24న పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించిన ఆయన అసలు పేరు మాగంటి రాజబాబు. స్వాతంత్య్ర సమరయోధుడైన తండ్రి మాగంటి మాధవరావు అడుగుజాడల్లో ఏలూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆయన... తొలుత వ్యాపార రంగంలో అడుగుపెట్టి ఆపై విజయవాడలో నాటకాల ద్వారా నటన వైపు మళ్లారు. మురళీమోహన్ భార్య విజయలక్ష్మి .. వారికి మధుబిందు అనే కుమార్తె, రామమోహన్ అనే కుమారుడు, రూప అనే కోడలు ఉన్నారు. ఇటీవల సినిమా రంగానికి ఆయన చేసిన అనితరసాధ్యమైన సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించగా 2026 జూన్ 23న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు.
మురళీమోహన్ సినీ ప్రస్థానం 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు నిర్మించిన `జగమేమాయ` చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత 1974లో దర్శకరత్న దాసరి నారాయణరావు తెరకెక్కించిన `తిరుపతి` సినిమాతో నటుడిగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. తన సుదీర్ఘ కెరీర్‌లో సుమారు 350 తెలుగు చలనచిత్రాలలో నటించిన ఆయన, తన సోదరుడు కిశోర్‌తో కలిసి `జయభేరి ఆర్ట్స్` అనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థను స్థాపించి 25 చిత్రాలను నిర్మించారు. కేవలం నటుడిగానే కాకుండా నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ కీలక హోదాలలో సేవలందించిన ఆయన 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA)కు గౌరవాధ్యక్షునిగా కూడా బాధ్యతలు నిర్వహించి పరిశ్రమ పెద్దగా నిలిచారు.
సినిమాలతో పాటు వ్యాపార, రాజకీయ రంగాలలోనూ మురళీమోహన్ తనదైన ముద్ర వేశారు. రియల్ ఎస్టేట్ రంగంలో అడుగుపెట్టి సుప్రసిద్ధ `జయభేరి గ్రూప్` సంస్థను స్థాపించిన ఆయన, దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తూ వ్యాపారవేత్తగా అద్భుత విజయాలను అందుకున్నారు. అదే సమయంలో రాజకీయాలపై ఆసక్తితో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన, 2009 లోక్‌సభ ఎన్నికలలో రాజమండ్రి నియోజకవర్గం నుండి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అయినా పట్టువదలకుండా 2014 లోక్‌సభ ఎన్నికలలో అదే రాజమండ్రి నియోజకవర్గం నుండి భారీ మెజారిటీతో విజయం సాధించి పార్లమెంటు సభ్యుడిగా (MP) ప్రజలకు సేవలందించారు. ఇలా మురళీమోహన్ ఎంచుకున్న ప్రతి రంగంలోనూ అపారమైన కీర్తి ప్రతిష్టలను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తన సహనటుడు, సీనియర్ అయిన శోభన్ బాబు సూచనలను తూ.చ తప్పక పాటిస్తూ భూమి విలువ తెలుసుకుని, దానిపై పెట్టుబడులు పెడుతూ అపారమైన సంపదల్ని కూడగట్టిన ప్రముఖుడిగా మురళిమోహన్ కీర్తి శిఖరాన్ని చేరుకుంది.