బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్యామిలీ జానర్ మ్యాజిక్!

ఈ విజయాల పరంపరను గమనిస్తున్న నేటి తరం దర్శకులు, నిర్మాతలు మళ్లీ రూటెడ్ ఫ్యామిలీ డ్రామాల వైపు అడుగులు వేస్తున్నారు.

Update: 2026-06-28 13:30 GMT

కాలంతో పాటు ఎన్ని రకాల యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్, లేదా సైన్స్ ఫిక్షన్ సినిమాలు వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద కుటుంబ కథా చిత్రాలకు ఉండే క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. లార్జర్-ద్యాన్-లైఫ్ యాక్షన్ సీక్వెన్సులు ఆరంభంలో భారీ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టొచ్చు. కానీ సినిమాను సుదీర్ఘ కాలం పాటు థియేటర్లలో రన్ చేసి, డిస్ట్రిబ్యూటర్లను లాభాల బాట పట్టించేది మాత్రం కుటుంబ ప్రేక్షకులే. అమ్మ, నాన్న, పిల్లలు, తాతయ్యలతో కూడిన హోమ్‌లీ ఆడియన్స్ థియేటర్లకు కదిలివస్తే ఆ చిత్రం సృష్టించే బాక్సాఫీస్ విద్వంసం ఏ రేంజ్‌లో ఉంటుందో? టాలీవుడ్ చరిత్ర అనేకసార్లు నిరూపించింది.

ఇటీవలి కాలంలో ఈ ఫ్యామిలీ జానర్ పవర్‌ను అక్షరాలా నిరూపించిన చిత్రం `మన శంకర వరప్రసాద్ గారు`. క్లాస్ ఎలిమెంట్స్, ఎమోషన్లతో కూడిన క్లీన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 300 కోట్ల రూపాయల అసాధారణ వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. మాస్ హంగులు, భారీ ఫైట్లు లేకపోయినప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడం వల్లే ఈ స్థాయి మైలురాయి సాధ్యమైంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రాలకు ఎప్పుడూ రిపీట్ ఆడియన్స్ విలువ తోడవుతుందని ఈ సినిమా వసూళ్ల ప్రభంజనమే పక్కా ఉదాహరణ.

ఇదే పంథాలో వైవిధ్యమైన కుటుంబ నేపథ్యంతో వచ్చిన `నారీ నారీ నడుమ మురారి` చిత్రం కూడా ఫ్యామిలీ ప్రేక్షకుల అండతో సులువుగా సేఫ్ జోన్‌లోకి వెళ్ళిపోయింది. మరోవైపు స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన `మా ఇంటి బంగారం` చిత్రం బాక్సాఫీస్ వద్ద లేడీస్ అండ్ ఫ్యామిలీస్ ఆడియన్స్‌ను అమితంగా ఆకట్టుకుంటోంది. ఉమ్మడి కుటుంబం నేపథ్యంలో సాగే ఈ కథలో కేవలం భావోద్వేగాలనే కాకుండా నేటి తరం మహిళల ఆత్మగౌరవాన్ని ఆవిష్కరించడం వల్ల మహిళా ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. కమర్షియల్ హంగులను పక్కన పెట్టి పక్కా గృహిణి పాత్రలో సమంత చూపిన నటన ఈ చిత్ర విజయానికి ప్రధాన బలమై నిలిచింది.

ఈ విజయాల పరంపరను గమనిస్తున్న నేటి తరం దర్శకులు, నిర్మాతలు మళ్లీ రూటెడ్ ఫ్యామిలీ డ్రామాల వైపు అడుగులు వేస్తున్నారు. రాబోయే రోజుల్లో పూర్తి స్థాయి కుటుంబ విలువలతో కూడిన మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది విక్టరీ వెంకటేష్ నటిస్తున్న`ఆదర్శ కుటుంబం`. ఫ్యామిలీ జానర్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన వెంకీ నుంచి వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దీంతో పాటు `ఇరుముడి`, `విశ్వనాథ్ అండ్ సన్స్` వంటి చిత్రాలు కూడా కుటుంబ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ థియేట్రికల్ విడుదలకు పక్కా ప్లానింగ్ చేసుకుంటున్నాయి.

యాక్షన్ సినిమాకు యువత మాత్రమే సింగిల్ టికెట్లతో థియేటర్లకు వస్తే.. ఫ్యామిలీ సినిమాకు కనీసం నలుగురైదుగురు కలిసి గ్రూపులుగా వస్తుంటారు. దీనివల్ల మల్టీప్లెక్స్‌లతో పాటు సింగిల్ స్క్రీన్లలోనూ టికెట్ అమ్మకాలతో పాటు ఫుడ్ అండ్ బెవరేజెస్ ద్వారా వచ్చే ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. చిత్ర పరిశ్రమకు పండుగ సీజన్లలో సమ్మర్ విండోస్‌లో ఇలాంటి భారీ ఫుట్‌ఫాల్స్ అత్యంత కీలకంగా మారుతాయి. అందుకే ఇండస్ట్రీలో ఎంతటి విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు నడుస్తున్నా? ప్రొడ్యూసర్లకు అత్యంత సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌గా కుటుంబ కథా చిత్రాలే నిలుస్తున్నాయన్న‌ది కాద‌న‌లేని నిజం.

Tags:    

Similar News