టికెట్ ధరల పెంపును బిజినెస్ చేసారు.. దిల్ రాజు షాకింగ్ కామెంట్!

ఇటీవ‌లి కాలంలో టికెట్ ధ‌రల పెంపు ఎగ్జిబిష‌న్(థియేట‌ర్ల‌) రంగాన్ని ఎలా నాశ‌నం చేస్తోందో ప‌రిశ్ర‌మ విశ్లేషిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Update: 2026-06-28 13:43 GMT

ఇటీవ‌లి కాలంలో టికెట్ ధ‌రల పెంపు ఎగ్జిబిష‌న్(థియేట‌ర్ల‌) రంగాన్ని ఎలా నాశ‌నం చేస్తోందో ప‌రిశ్ర‌మ విశ్లేషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలాంటి స‌మ‌యంలో టికెట్ ధ‌ర‌ల పెంపు ఎలా బిజినెస్ గా మారిందో.. దీనివెన‌క‌ అస‌లు గుట్టు ఏమిటో ఇప్పుడు ప‌రిశ్ర‌మ అగ్ర‌నిర్మాత‌, ఎగ్జిబిట‌ర్ దిల్ రాజు రివీల్ చేసారు. పూర్తి వివ‌రాల్లోకి వెళితే...

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సినిమాల బడ్జెట్ మేనేజ్‌మెంట్- టికెట్ ధరల పెంపు వెనుక ఉన్న కల్చర్ గురించి ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసారు. బాహుబలి సినిమా సమయంలో ఈ ట్రెండ్ ఎలా మొదలైంది? ఆ తర్వాత అది ఒక బిజినెస్ మోడల్‌గా ఎలా మారిపోయింది? అనే అంశాలను ఆయన వివరించారు.

దిల్ రాజు మాట్లాడుతూ- ``ఒక పెద్ద సినిమా కెపాసిటీ రూ.200 కోట్లు ఉన్నప్పుడు.. ఆ సినిమా బడ్జెట్ ని 300 కోట్లకు పెంచి సినిమాను `వావ్` అనేలాగా చేయాలని రాజమౌళి ప్రయత్నించారు. అప్పుడు ఆయన గవర్నమెంట్స్‌ను అప్రోచ్ అయ్యి.. ఇదొక భారీ సినిమా... పాన్ ఇండియా ప్రాజెక్ట్ కాబట్టి మాకు కొంచెం టికెట్ హైక్ (ధరల పెంపు) కావాలని అడిగారు. దీనికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి... సినిమా కోసం వారు చేసిన ప్రయత్నాన్ని గుర్తించి రూ.25 వరకు టికెట్ ధరను పెంచుకోవడానికి సపోర్ట్ చేసిందని దిల్ రాజు తెలిపారు.

అయితే బాహుబలి సినిమా బడ్జెట్‌ను రికవర్ చేయడానికి మొదలైన ఈ విధానం.. మెల్లిగా ఇండస్ట్రీలో ఒక `కల్చర్` (ఆనవాయితీ)గా మారిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం స్టార్ హీరోల‌ సినిమాలకు బడ్జెట్ పెరిగిపోతుండటంతో మొదటి వారంలోనే పెట్టిన పెట్టుబడిని (రెవెన్యూ) రాబట్టాలనే ధోరణి పెరిగిపోయిందని అన్నారు. అందుకోసం మొదటి మూడు నాలుగు రోజులు లేదా ఒక వారం రోజుల పాటు వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో సినిమాను ప్రదర్శించి డబ్బులు వసూలు చేయాలని చూస్తున్నారని చెప్పారు.

సినిమా విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుండటంతో జనాలు థియేటర్లకు రావడం తగ్గించేశారని... అందుకే ఫస్ట్ వీక్‌లోనే కలెక్షన్లు లాగేయాలనే ఒత్తిడి నిర్మాతలపై ఉంటోందని దిల్ రాజు అభిప్రాయపడ్డారు. సినిమా టాక్ ఎలా ఉందో బయటకు వచ్చేలోపే (మూడు నాలుగు వారాల్లో) రెవెన్యూ సాధించాలనే ప్లాన్ నడుస్తోందని అన్నారు. బాహుబలి సినిమాకు పెట్టిన బడ్జెట్‌ను ఎలా తిరిగి తీసుకురావాలనే ఆలోచనతో మొదలైన ఈ టికెట్ ధరల పెంపు విధానం, ఇప్పుడు పూర్తిగా ఒక బిజినెస్ అయిపోయిందని దిల్ రాజు స్పష్టం చేశారు. దిల్ రాజు లాంటి అనుభ‌వ‌జ్ఞుడైన ఎగ్జిబిట‌ర్ ఈ మాట అన్నాక జ‌నాల‌కు చాలా స్ప‌ష్ఠ‌త వ‌చ్చింది. ఇటీవ‌లి కాలంలో చాలా క్రేజ్ ఉన్న‌ సినిమాలను కూడా ఎక్కువ శాతం జ‌నం థియేట‌ర్ల‌లో వీక్షించ‌క‌పోవ‌డానికి కార‌ణం ఏమిటో ఇప్పుడు అంద‌రికీ అర్థ‌మైంది.

Tags:    

Similar News