బడా హీరోల సినిమాలు.. ప్రొడక్షన్ విషయంలో అందరిదీ సేమ్ ప్లాన్?

ఒకప్పుడు భారీ సినిమా అంటే ఒక నిర్మాత పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది.

Update: 2026-06-26 11:30 GMT

ఒకప్పుడు భారీ సినిమా అంటే ఒక నిర్మాత పేరు మాత్రమే వినిపించేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. స్టార్ హీరోలతో వందల కోట్ల బడ్జెట్‌ లో సినిమాలు తెరకెక్కుతుండడంతో ఇద్దరు, ముగ్గురు.. కొన్నిసార్లు అంతకంటే ఎక్కువ మంది నిర్మాతలు ఒకే ప్రాజెక్ట్ కోసం చేతులు కలుపుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అదే ట్రెండ్ కనిపిస్తోంది. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా కూడా అదే మార్గంలో ముందుకెళ్తుండటంతో.. భారీ చిత్రాల నిర్మాణంలో ఎందుకు ఎక్కువ మంది నిర్మాతలు రంగంలో దిగుతున్నారనే చర్చ మరోసారి మొదలైంది.

ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల బడ్జెట్లు రూ.200 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు చేరుతున్నాయి. ఇలాంటి ప్రాజెక్టును ఒక్క నిర్మాత మాత్రమే డీల్ చేయడం అంత ఈజీ కాదు. సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోతే భారీ నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది నిర్మాతలు కలిసి వర్క్ చేయడం ద్వారా ఆర్థిక భారం పంచుకుంటున్నారు. దీంతో రిస్క్ తగ్గుతుంది.

అదే సమయంలో సినిమాకు ఒకేసారి వందల కోట్ల రూపాయలు సమకూర్చడం ప్రతి నిర్మాతకు సాధ్యం కాదు. పలువురు కలిసి నిర్మించడం వల్ల అవసరమైన డబ్బులు ఈజీగా అందుబాటులోకి వస్తాయి. దీంతో నిర్మాణ పనులు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కూడా ఇందులో కీలక పాత్ర పోషిస్తోంది. వేర్వేరు నిర్మాతలకు వేర్వేరు ప్రాంతాల్లో స్ట్రాంగ్ నెట్వర్క్ ఉంటుంది. వారి ఎక్స్పరీయన్స్, పరిచయాలతో సినిమాను మరింత గ్రాండ్ గా విడుదల చేసే అవకాశం ఉంటుంది.

మరోవైపు నిర్మాణ బాధ్యతలు పంచుకోవడం కూడా మెయిన్ బెనిఫిట్. ఒక నిర్మాత ఫైనాన్సియల్ ట్రాన్సక్షన్స్ ను పర్యవేక్షిస్తే.. మరో నిర్మాత షూటింగ్, షెడ్యూల్స్, నిర్మాణ నిర్వహణ వంటి అంశాలను చూసుకుంటారు. దీంతో ప్లాన్ ప్రకారం సినిమాను పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఇటీవల కార్పొరేట్ సంస్థలూ సినిమా నిర్మాణంలో భాగస్వాములు అవుతున్నాయి. స్థానిక నిర్మాణ సంస్థలతో కలిసి పనిచేయడం వల్ల మార్కెటింగ్, విడుదల, బిజినెస్ వంటి అంశాల్లో బలం చేకూరుతోంది.

ఇప్పుడు బాలకృష్ణ కొత్త సినిమా కూడా ఇదే ఫార్ములాను ఫాలో అవుతోంది. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించనున్న ఆ చిత్రాన్ని యువ సుధా ఆర్ట్స్ బ్యానర్‌ పై సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తుండగా.. సహ నిర్మాతగా సుధాకర్ చెరుకూరి తోడయ్యారు. ఇప్పటికే ఆ మూవీ ప్రారంభం కాగా.. సెప్టెంబర్‌ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 2027 వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అలా భారీ బడ్జెట్ సినిమాల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నిర్మాతల పార్టనర్ మోడల్ కూడా పెరుగుతోంది. పైనాన్సియల్ సెక్యూరిటీ, ఇన్వెస్ట్మెంట్, నిర్మాణ నిర్వహణ, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకుని స్టార్ హీరోల సినిమాలు ఇప్పుడు మల్టీ ప్రొడ్యూసర్ విధానాన్నే ఎక్కువగా ఎంచుకుంటున్నాయి. ఇప్పుడు బాలయ్య మూవీ కూడా అదే దారిలో అడుగులు వేయడం.. ఆ ట్రెండ్ మరింత పెరుగుతుందని అర్థమవుతోంది.

Tags:    

Similar News