కలెక్షన్ల పోస్టర్లు రిలీజ్ చేయడం ఆపేస్తే..!

బాక్సాఫీస్‌ నంబర్ల కంటే సినిమా గురించి మళ్లీ మూవీ లవర్స్ అంతా మాట్లాడుకునే రోజులు మళ్లీ వస్తాయా? ఒకప్పుడు ఆడియన్స్ కేవలం సినిమా కథ, యాక్టింగ్, సాంగ్స్, దర్శకత్వం గురించి చర్చించుకునేవారు.

Update: 2026-06-26 07:49 GMT

బాక్సాఫీస్‌ నంబర్ల కంటే సినిమా గురించి మళ్లీ మూవీ లవర్స్ అంతా మాట్లాడుకునే రోజులు మళ్లీ వస్తాయా? ఒకప్పుడు ఆడియన్స్ కేవలం సినిమా కథ, యాక్టింగ్, సాంగ్స్, దర్శకత్వం గురించి చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే కలెక్షన్ల పోస్టర్లు సోషల్ మీడియాలో రిలీజ్ అవుతున్నాయి. ఆ పోస్టర్లతో మొదలయ్యే చర్చలు చివరకు అభిమానుల మధ్య కామెంట్స్ వార్స్ కు దారి తీస్తున్నాయి. దీంతో కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేసే విధానంపై కంట్రోలింగ్ అవసరమనే అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది.

అయితే ఏ సినిమా అయినా ఎంత పెద్ద విజయం సాధించిందో నిర్ణయించేది కేవలం వసూళ్లు మాత్రమే కావు. సినిమా కోసం పెట్టిన బడ్జెట్, వచ్చిన ఆదాయం, నిర్మాతకు దక్కిన లాభాలు వంటి అంశాలే అసలు మెజెర్మెంట్స్. అయితే ఆ లెక్కలు పూర్తిగా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, బిజినెస్ వర్గాలకు సంబంధించినవి మాత్రమే. కానీ సోషల్ మీడియా జెనరేషన్ లో ఆ నెంబర్స్ పైనే అభిమానులు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు.

ఒక సినిమా రూ.100 కోట్లు, రూ.200 కోట్లు వసూలు చేసిందనే పోస్టర్ విడుదలైతే, వెంటనే మరో హీరో అభిమానులు ఆ లెక్కలను ప్రశ్నించడం, తమ హీరో సినిమాతో పోల్చడం, ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం కామన్ అయిపోయింది. దీంతో సినిమా గురించి చర్చ జరగాల్సిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో అభిమానుల గొడవలకు సెంటర్ గా మారుతున్నాయి. దీంతో నెట్టింట ఫ్యాన్ వార్స్‌ రోజురోజుకూ పెరుగుతున్నాయి.

ముఖ్యంగా సినిమా విజయాన్ని ఆస్వాదించకుండా అనవసరమైన ట్రోలింగ్, విమర్శలు చేసుకోవడంలో మునిగిపోతున్నారు. నిజానికి సినీ ప్రియులకు కలెక్షన్లతో పని లేదు. సినిమా ఎలా ఉంది? బాగా తీశారా? తమ అంచనాలను అందుకున్నారా? అన్న విషయంపై ఫోకస్ పెట్టాలి. కానీ చాలా మంది సినీ ప్రియులు వాటిని పట్టించుకోకుండా కలెక్షన్ల కోసం మాట్లాడుతున్నారు. అనవసరమైన పోస్టులు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు నిర్మాతలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం సోషల్ మీడియాలో వ్యక్తమవుతోంది. ప్రతి చిన్న మైలురాయికి కలెక్షన్ల పోస్టర్లు విడుదల చేయడం తగ్గిస్తే, అభిమానుల మధ్య అనవసరమైన కంపేరిజన్లు కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. సినిమా విజయాన్ని సంఖ్యలతో కాకుండా ప్రేక్షకుల ఆదరణతో కొలిచే కల్చర్ పెరగాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.

సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం. కానీ అదే సినిమా కలెక్షన్ల పేరుతో అభిమానుల మధ్య ఫ్యాన్స్ వార్స్ కరెక్ట్ కాదు. ఒకరి విజయాన్ని మరొకరు గౌరవించే వాతావరణం ఏర్పడితేనే హెల్దీ క్లైమేట్ కొనసాగుతుంది. అందుకోసం కలెక్షన్ల పోస్టర్ల ప్రమోషన్స్ లో కొంత ఛేంజ్ అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. బాక్సాఫీస్ నంబర్లు ఎప్పటికీ సినీ బిజినెస్ భాగమే. అయితే వాటిని ప్రమోట్ చేసే తీరు మారితే, సోషల్ మీడియాలో కనిపిస్తున్న అనవసరమైన వార్స్ బాగా తగ్గే అవకాశం కచ్చితంగా ఉంది. అప్పుడు మళ్లీ సినిమా గురించి చర్చించే రోజులు మళ్లీ వస్తాయేమో వేచి చూడాలి.

Tags:    

Similar News