భర్త పక్కనే ఉండగా స్టార్ హీరోని ప్రేమిస్తున్నానంటూ..!
సెలబ్రిటీలపై అభిమానం ఉండటం సహజమే కానీ.. ఆ ఆరాధన పిచ్చిగా మారి సొంత బంధాలను నడిరోడ్డుపై నిలబెట్టే స్థాయికి చేరితే అది తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది.
అభిమాని పిచ్చి పరాకాష్ఠకు చేరితే... భర్తను అగౌరవపరుస్తూ పబ్లిక్ వేదికపైనే ఇంతగా అరిచేస్తూ స్టార్ హీరోని ప్రేమిస్తున్నానని చెప్పాలా? ఈ ఘటనతో గ్లామర్ రంగం, స్టార్ల వైపు ఆకర్షితులవుతున్న మహిళలను వేలెత్తి చూపే అరుదైన ఘటన ఇది...!
సెలబ్రిటీలపై అభిమానం ఉండటం సహజమే కానీ.. ఆ ఆరాధన పిచ్చిగా మారి సొంత బంధాలను నడిరోడ్డుపై నిలబెట్టే స్థాయికి చేరితే అది తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక వీడియో క్లిప్ ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచింది. ఒక బహిరంగ వేదికపై భర్త పక్కనే నిలబడి ఉండగా ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ (మినాల్ రాజ్) బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ను ఉద్దేశించి ``నా భర్త కంటే మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాను`` అని గట్టిగా అరిచి చెప్పింది. ఈ హఠాత్ పరిణామానికి షారుఖ్ ఖాన్ ఎంతో హుందాగా, సున్నితంగా స్పందించి ఆ పరిస్థితిని చక్కదిద్దినా సదరు మహిళ చేసిన వ్యాఖ్యలు మాత్రం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి.
భర్త పక్కన ఉండగానే... కేవలం ఒక స్టార్ హీరో అటెన్షన్ కోసం తన జీవిత భాగస్వామిని అంతలా కించపరచడం దేనికి సూచిక అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. గ్లామర్ ప్రపంచానికి.. తెరపై కనిపించే నటీనటుల కృత్రిమ వ్యక్తిత్వానికి మగువలు ఇలా అడిక్ట్ కావడం సమాజంలో మారుతున్న విలువల పతనానికి అద్దం పడుతోంది. ఎంతో పవిత్రంగా భావించే వివాహ బంధాన్ని, ఒక క్షణికావేశపు పబ్లిసిటీ స్టంట్ కోసం బలిపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని ఫ్యాషన్ & సామాజిక విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఆ సమయంలో పక్కనే ఉన్న భర్త ముఖంలో కనిపించిన నిస్సహాయత, అవమానం ఎంతోమంది నెటిజన్లను కదలించింది.
ఈ వైరల్ వీడియోపై రెడ్డిట్‌లోని కమ్యూనిటీలలో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. అత్యధికులు ఆ భర్తపై సానుభూతి ప్రకటిస్తూ..ఇదొక ఘోరమైన అవమానమని కొట్టిపారేశారు. ఒకరిని సంతోషపెట్టడం కోసం సొంత మనిషిని తక్కువ చేయకూడదు! అని ఒక యూజర్ పేర్కొనగా.. తామైతే ఆ క్షణంలోనే విడాకులు ఇచ్చేసేవాళ్లమని చాలామంది మగవాళ్లు తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కారు. ఒకవేళ విడాకులు ఇచ్చినా.. చట్టాల ప్రకారం భరణం రూపంలో సంపాదనంతా కోల్పోవాల్సి వస్తుందేమో కానీ... ఆత్మగౌరవాన్ని చంపుకుని ఇలాంటి మనస్తత్వం ఉన్నవారితో `విక్రమార్క-భేతాళుడి`లా జీవితాంతం కలిసి బతకడం కంటే విడిపోవడమే మేలని భగ్గుమన్నారు.
ఈ సంఘటన భారతదేశంలో వేళ్లూనుకుపోతున్న విపరీతమైన `సెలబ్రిటీల వీరారాధన` సంస్కృతిని ఎండగడుతోంది. కేవలం తెరపై వారు చేసే నటనను చూసి... వారిని దేవుళ్లలా భావించడం.. తమ ఉనికిని కూడా ఎరుగని వ్యక్తుల కోసం కన్నవారిని, కట్టుకున్నవారిని తక్కువ చేసేయడం తీవ్రమైన మానసిక బలహీనతకు నిదర్శనం. ఒక నెటిజన్ అన్నట్లు... ``నేను నా భర్త కంటే ఎక్కువగా ప్రేమించేది నన్ను మాత్రమే.. ఇలాంటి సెలబ్రిటీ పిచ్చి అస్సలు అర్థం కాదు``. నటీనటులు తమ కెరీర్ కోసం, డబ్బు కోసం పనిచేసే సాధారణ మనుషులని...వారి కోసం ప్రాణప్రదమైన బంధాలను రోడ్డున పడేయడం కేవలం అజ్ఞానమే అవుతుంది.
అయితే కొందరు దీనిని ``ఆ క్షణంలో వచ్చిన ఎగ్జైట్‌మెంట్`` లేదా `సరదాగా అన్న మాట` అని సమర్థించే ప్రయత్నం చేసినా.. ఆ మగువలోని ద్వంద్వ ప్రమాణాలను మెజారిటీ నెటిజన్లు ఎండగట్టారు. ఒకవేళ ఇదే స్థానంలో ఒక భర్త ఉండి, భార్య పక్కన ఉండగా మరో స్టార్ హీరోయిన్ (ఉదాహరణకు సిడ్నీ స్వీనీ) వైపు చూసి.. ``నా భార్య కంటే నిన్నే ఎక్కువ ప్రేమిస్తున్నా`` అని ఉంటే ఈ పాటికి అతడిని సమాజం నడిరోడ్డుపై నిలబెట్టి ఘోరంగా ట్రోల్ చేసేదని గుర్తుచేశారు. ఏదేమైనా... వినోదం పరిధి దాటి వైవాహిక బంధాల సరిహద్దులను దాటినప్పుడు ఇలాంటి విపరీత పరిణామాలు ఎదురవుతాయని... ఇది ఆధునిక సమాజంలో ఆలోచించాల్సిన విషయమని ఈ ఘటన నిరూపించింది.