యశ్ పిల్లలకు తొలి సినిమా అనుభూతి.. అది కూడా రామాయణంతోనే!

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణం సినిమా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ప్రత్యేక ప్రీమియర్‌లో ఈ పిల్లలు సినిమాను వీక్షించినట్లు సమాచారం.

Update: 2026-10-31 04:08 GMT

రాకింగ్ స్టార్ యశ్ కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. యశ్, రాధికా పండిట్ పిల్లలు అయ్రా, యథర్వ్ తమ జీవితంలో తొలిసారి సినిమా చూశారు. విశేషం ఏమిటంటే.. వారి మొదటి సినిమా అనుభవం సాధారణ చిత్రంతో కాకుండా, భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంతో మొదలైంది.

నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న రామాయణం సినిమా లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ప్రత్యేక ప్రీమియర్‌లో ఈ పిల్లలు సినిమాను వీక్షించినట్లు సమాచారం. అక్టోబర్ 30న యథర్వ్ ఏడో పుట్టినరోజు సందర్భంగా ఈ విషయం మరింత ప్రత్యేకంగా మారింది. అయితే పిల్లలు సినిమా చూసినప్పుడు ఎలా స్పందించారు అనే వివరాలను కుటుంబం బయటకు వెల్లడించలేదు.

ఈ సినిమాలో యశ్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. అంతేకాదు, తన సొంత నిర్మాణ సంస్థ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులో సహ నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అందుకే ఈ సినిమా యశ్ కెరీర్‌లోనే కాకుండా ఆయన కుటుంబానికి కూడా ప్రత్యేకమైన జ్ఞాపకంగా నిలిచే అవకాశం ఉంది.

పిల్లల పేర్ల వెనుక కూడా ఆసక్తికరమైన అర్థాలు ఉన్నాయి. అయ్రా అనే పేరు ఐరావతి నుంచి ప్రేరణ పొందింది. ఇది లక్ష్మీదేవికి సంబంధించిన మరో పేరుగా చెబుతారు. ఇక యథర్వ్ అంటే సంపూర్ణమైనది అనే అర్థం. యశ్, రాధికా, అయ్రా పేర్లలోని అంశాలను కలిపి యథర్వ్ పేరును రూపొందించినట్లు గతంలో ఈ దంపతులు వెల్లడించారు.

ఒక తండ్రి తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన పాత్రలో నటిస్తున్న సినిమా.. అదే తన పిల్లలకు తొలి సినిమా కావడం నిజంగా ప్రత్యేకమైన విషయం. తరతరాలుగా భారతీయులకు పరిచయమైన రామాయణం ఇప్పుడు ఒక కొత్త తరానికి సినిమా రూపంలో పరిచయం కాబోతోంది.

Tags:    

Similar News