టైటిలే కాదు.. రిజల్ట్ కూడా అంతే రేంజ్ లో అందుకుంటారా?
కుటుంబ కథా చిత్రాలను హృదయాన్ని తాకేలా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ అట్లూరికి ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే.;
కుటుంబ కథా చిత్రాలను హృదయాన్ని తాకేలా తెరకెక్కించడంలో దర్శకుడు వెంకీ అట్లూరికి ప్రత్యేక గుర్తింపు ఉందన్న విషయం తెలిసిందే. భావోద్వేగాలు, వినోదం, రిలేషన్షిప్స్ ను కలిపి ప్రేక్షకులను ఆకట్టుకునే స్టోరీలను ఎంచుకునే ఆయన, ఇప్పుడు మరో ఆసక్తికర ప్రాజెక్ట్ తో రెడీ అవుతున్నారు. ఈసారి తమిళ స్టార్ హీరో సూర్యతో కలిసి ఓ ఫ్యామిలీ డ్రామాను తెరకెక్కిస్తూ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.
ఆ సినిమాకు విశ్వనాథం అండ్ సన్స్ అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు సమాచారం. కథా నేపథ్యానికి తగ్గట్టుగా తండ్రి– కొడుకుల అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఆ పేరు ఉండటంతో మేకర్స్ అదే టైటిల్ ను ఫిక్స్ అయ్యారట. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. టైటిల్ వినగానే సినిమా జానర్ పై క్లారిటీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.
అయితే విశ్వనాథం అండ్ సన్స్ పేరు వినగానే చాలా మందికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా గుర్తుకొస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలోనూ కుటుంబ విలువలు, తండ్రి– కొడుకు బంధం ప్రధానంగా ఉండగా.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఇప్పుడు సూర్య- వెంకీ చిత్రం కూడా అదే తరహా ఫ్యామిలీ ఎమోషన్స్‌తో సాగుతుందా అన్న ఆసక్తి నెలకొంది. టైటిల్ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అవుతుందా అన్న చర్చ కూడా మొదలైంది.
అయితే వెంకీ అట్లూరి స్టైల్ కు సూర్య నటన కలిస్తే సినిమాకు మరింత బలం చేకూరుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పెర్ఫార్మెన్స్ కు ప్రాధాన్యం ఉన్న పాత్రలు, భావోద్వేగాలతో నిండిన కథ.. ఆ రెండూ కలిస్తే మంచి ఫలితం రావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. కుటుంబ విలువలు, బంధాల ఇంపార్టెన్స్, జెనరేషన్స్ మధ్య తేడాల వంటి అంశాలతో కథ నడిచే అవకాశం ఉందని సమాచారం.
మొత్తానికి టైటిల్ నుంచే పాజిటివ్ వైబ్స్ రావడంతో విశ్వనాథం అండ్ సన్స్ మూవీపై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. టైటిల్ మాత్రమే కాదు.. రిజల్ట్ కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందా అన్నది చూడాలి. అధికారిక ప్రకటన, ఫస్ట్ లుక్ కోసం సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.
ఇక సినిమా విషయానికొస్తే.. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. సూర్య సరసన ప్రేమలు ఫేమ్ మమిత బైజు హీరోయిన్ గా నటిస్తున్నారు. రవీనా టాండన్, రాధిక శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. వేసవిలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.