ప్లాన్డ్ నెగెటివిటీపై టాలీవుడ్ చర్చ!
పాన్-ఇండియా సినిమాలతో సౌత్ హీరోలు - దర్శకులు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు.
పాన్-ఇండియా సినిమాలతో సౌత్ హీరోలు - దర్శకులు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను శాసిస్తున్నారు. అయితే ఈ పరిణామాలను జీర్ణించుకోలేని కొందరు నార్త్ మీడియా ప్రతినిధులు మాత్రం సౌత్ సెలబ్రిటీలను లక్ష్యంగా చేసుకుని వ్యూహాత్మక దాడికి దిగుతున్నారు. ముఖ్యంగా మైథలాజికల్ ..భారీ బడ్జెట్ చిత్రాల సమయంలో ఈ టార్గెటింగ్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా గ్లోబల్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న `రామాయణం` చిత్రంలో సీత పాత్రలో నటిస్తోన్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవిని టార్గెట్ చేస్తూ బాలీవుడ్ మీడియా చేస్తున్న ప్రచారమే దీనికి తాజా నిదర్శనం.
సినిమా ట్రైలర్ రాకముందు నుంచే సీత పాత్రకు ఆమె సరిపోలేదంటూ అనవసరమైన డిస్కషన్లను తెరపైకి తీసుకురావడం, సోషల్ మీడియాలో ప్లాన్డ్ ట్రోల్స్‌ను ప్రోత్సహించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. పక్కనున్న ఇతర నటీమణులతో పోల్చి సాయి పల్లవిని డామినేట్ చేయాలనే కుట్రపూరిత కథనాలు నార్త్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేవలం సాయి పల్లవి మాత్రమే కాదు. గతంలో సౌత్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లిన .. అక్కడ సంచలనాలు సృష్టించిన ఎంతోమంది ప్రముఖులు ఇలాగే కార్నర్ అయ్యారు.
నేషనల్ క్రష్ రష్మికా మందన్న ఖాతాలో`యానిమల్`, `పుష్ప`వంటి బ్లాక్‌బస్టర్లు ఉన్నా? ఆమెపై అనవసరమైన విమర్శలు గుప్పించి అక్కడి మీడియా చిన్నచూపు చూసే ప్రయత్నం చేసింది. కానీ అప్పుడు పప్పులుడకలేదు. కానీ గత ఏడాది ఓ సినిమా ఫెయిల్యూర్ కాగానే ఆ నిందను పూర్తిగా ఆమెపైనే నెట్టి నెగెటివిటీని సృష్టించారు.హీరోల విషయంలోనూ బాలీవుడ్ మీడియా తీరు అలాగే ఉంటోందని టాలీవుడ్ జనాలు మండిపడుతున్నారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాలీవుడ్ డెబ్యూ సమయంలోనూ అక్కడి మీడియా ఏ రేంజ్‌లో ట్రోల్స్ నడిపించిందో? అభిమానులకు ఇప్పటికీ గుర్తే.
అలాగే `ఆదిపురుష్` చిత్రం ఫెయిల్యూర్ టైమ్‌లో రెబల్ స్టార్ ప్రభాస్‌ను మాత్రమే ప్రత్యేకంగా టార్గెట్ చేసి నార్త్ మీడియా చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. బాలీవుడ్ బాక్సాఫీస్ మూలాలను కదిలిస్తున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను లక్ష్యంగా చేసుకుని ఓ పెద్ద మీడియా మాఫియానే నడుస్తోందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.సౌత్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న కంటెంట్ , నటీనటుల క్రేజ్‌ను తట్టుకోలేకనే కొందరు కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలకు తెరలేపుతున్నారని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎంత మంచి ప్రతిభ ఉన్నా? కేవలం ప్రాంతీయ దురాభిమానంతో సౌత్ స్టార్స్‌ను నిరుత్సాహపరిచేలా కథనాలు రాయడం వల్ల జాతీయ స్థాయిలో సినిమా పరిశ్రమ ఐక్యత దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి బురదజడుడు రాజకీయాలను లెక్కచేయకుండా సౌత్ ఆర్టిస్టులు తమ విజయాలతోనే సమాధానం చెబుతున్నారు. బాలీవుడ్ మీడియా ఎంతగా తొక్కాలని ప్రయత్నించినా? సౌత్ స్టార్స్ మాత్రం తమ ప్రతిభతో అంతకంతకు పైకి లేస్తున్నారు. అద్భుతమైన నటనతో దేశవ్యాప్తంగా సంపాదించుకున్న ఆదరణను ఎప్పటికీ తగ్గించలేరన్నది కాదనలేని నిజం.