విరాట్ కోహ్లీ స్ఫూర్తితో క‌ష్ట‌ప‌డుతున్న టాలీవుడ్ యువ న‌టుడు

ఈ సందర్భంలోనే క్రికెట్ రంగానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా నందు ఉదహరించడం గమనార్హం.

Update: 2026-09-18 14:30 GMT

టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న హీరో నందు తాజాగా నటిస్తున్న చిత్రం `మగాళ్ళు జిందాబాద్`. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ ప్రెస్ మీట్ సందర్భంగా మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను, తన వ్యక్తిగత అనుభవాలను షేర్ చేసారు. సమాజంలోనూ, ఇళ్లలోనూ మగవాళ్లపై జరిగే సరదా చర్చల ఆధారంగా ఈ టైటిల్‌ను పెట్టుకున్నామ‌ని.. ఇది పూర్తిగా కుటుంబ సమేతంగా నవ్వుకునేలా ఉంటుందని స్పష్టం చేశారు.

త‌న కెరీర్ జ‌ర్నీ గురించి మాట్లాడుతూ.. త‌న‌కు ఎవ‌రు స్ఫూర్తి అనేది కూడా నందు ప్ర‌స్థావించిన తీరు ఆక‌ట్టుకుంది. ఈ సందర్భంలోనే క్రికెట్ రంగానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను కూడా నందు ఉదహరించడం గమనార్హం. క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ఎవరితోనూ సంబంధం లేకుండా కేవలం తన ఆటపైనే దృష్టి పెట్టి ఎలా శ్రమిస్తాడో తాను కూడా నటుడిగా తన పని తాను చేసుకుంటూ అలాగే కష్టపడతానని ఆయన అభిప్రాయపడ్డారు. అదే అంకితభావంతో ముందుకు సాగుతూ ప్రేక్షకులకు మంచి సినిమాలను అందించడమే తన లక్ష్యమని నందు వెల్లడించారు. అయితే విరాట్ కోహ్లీ స్ఫూర్తితో న‌టుడిగా హార్డ్ వ‌ర్క్ చేస్తున్న నందుకి ఆల్ ది బెస్ట్ చెబుతూ నెటిజ‌నులు అత‌డి స‌తీమ‌ణి, ప్ర‌ముఖ గాయ‌ని గీతా మాధురిని ట్యాగ్ చేస్తున్నారు. మీ ఆయ‌న‌గారి విజ‌న్ బావుంద‌ని, ఇదే ప్రోత్సాహం ఇలానే కొన‌సాగాల‌ని కూడా కోరుతున్నారు.

ఈ సినిమా కథాంశం.. మేకింగ్ గురించి చెబుతూ.. చిత్రంలో ఎలాంటి అశ్లీలతకు తావులేకుండా కేవలం 1 శాతం కూడా వల్గారిటీ లేకుండా చాలా కాన్షియస్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నందు తెలిపారు. ఈ సినిమా నిర్మాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో అక్కడ వీకెండ్స్‌లో కుటుంబంతో కలిసి థియేటర్లకు వెళ్లే ఆడియెన్స్ కల్చర్‌కు తగినట్టుగా అందరూ కలిసి హాయిగా ఎంజాయ్ చేసే పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది ఉంటుందని వివరించారు.

ఇక తన భార్య గీతా మాధురి ఎప్పుడూ తనను ఉద్దేశించి `మగాళ్ళు ఉట్టి మాయగాళ్ళు` అనే పాట పాడుతూ ఉంటారని.. అక్కడే ఈ టైటిల్ డిబేట్ పుట్టిందని నందు సరదాగా గుర్తుచేసుకున్నారు. ఈ టైటిల్ విన్నప్పుడు గీత ఎంతో సంతోషించారని.. అందరికీ సులభంగా రీచ్ అయ్యేలా టైటిల్ బాగుందని అప్రిషియేట్ చేశారని తెలిపారు. అంతేకాకుండా ఆడవాళ్లను తొక్కేయాలనే ఉద్దేశం ఇందులో లేదని.. ఎప్పుడూ లేడీస్ సపోర్ట్ ఉన్నట్లే.. సరదాగా మగవాళ్లకు మగవాళ్ళు సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ టైటిల్ పెట్టామని క్లారిటీ ఇచ్చారు.

తన 20 ఏళ్ల సినీ ప్రయాణంలో 2026 సంవత్సరం తనకు అత్యంత బ్యూటిఫుల్‌గా వరుస ప్రాజెక్ట్‌లతో గోల్డెన్ పీరియడ్‌లా సాగిపోతోందని నందు ఆనందం వ్యక్తం చేశారు. ఎంటర్‌టైనర్ అనగానే అనిల్ రావిపూడి వంటి దర్శకులు గుర్తువచ్చేలా ఈ చిత్రంలో ఆ మార్క్ కనిపిస్తుందని తెలిపారు. అవార్డుల కంటే ప్రేక్షకుల నుంచి లభించే రివార్డ్సే తమకు అసలైన బలామని పేర్కొంటూ ఈ సినిమాతో అందరినీ అలరిస్తామన్న పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. త్వ‌ర‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న నందు సినిమా విజ‌యం సాధించాల‌ని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

Tags:    

Similar News