తండ్రితో సినిమా తీసే ఛాన్సొస్తే? దళపతి కొడుకు అలా కింగ్ ఖాన్ కొడుకు ఇలా!
ఇకపై తమ తండ్రులతో సినిమాలు తీసే అవకాశం వస్తే ఎలాంటి కలల ప్రాజెక్టులు రూపొందిస్తారనే విషయంపై వీరిద్దరి ఆలోచనలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారాయి.
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో సూపర్‌స్టార్ల వారసులు హీరోలుగా అరంగేట్రం చేసేందుకు ఆసక్తిగా ఉంటే.. అందుకు భిన్నంగా దర్శకత్వం వైపే మొగ్గు చూపుతూ.. దళపతి విజయ్ కుమారుడు జాసన్ సంజయ్ .. బాద్షా షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇద్దరు సూపర్ స్టార్ల వారసుల నిర్ణయంపై చాలా చర్చ సాగుతోంది. ఈ ఇద్దరు స్టార్ కిడ్స్ తమ సినీ ప్రయాణాన్ని కెమెరా వెనుక ఉండి నడిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ ఇద్దరూ బయటి హీరోలతో సినిమాలు తీసారు. ఇకపై తమ తండ్రులతో సినిమాలు తీసే అవకాశం వస్తే ఎలాంటి కలల ప్రాజెక్టులు రూపొందిస్తారనే విషయంపై వీరిద్దరి ఆలోచనలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఆసక్తికరంగా మారాయి.
తమిళ చిత్రసీమలో నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న దళపతి విజయ్ తనయుడు జాసన్ సంజయ్ తెలుగు హీరో సుందీప్ కిషన్‌తో `సిగ్మా` అనే చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జాసన్ మాట్లాడుతూ.. హాలీవుడ్ యాక్షన్ స్టార్ జేసన్ స్టాథమ్‌తో పనిచేసే అవకాశం వస్తే.. భారతీయ సినిమా నుండి తన తండ్రి విజయ్‌నే కథానాయకుడిగా ఎంచుకుంటానని తెలిపాడు. ఈ కాంబినేషన్ నెట్టింట పెద్ద ఎత్తున మీమ్స్, ట్రెండ్స్ సృష్టిస్తుందని నవ్వుతూ వ్యాఖ్యానించినా.. తన తండ్రిని అంతర్జాతీయ స్థాయిలో ఒక భారీ యాక్షన్ కాంబినేషన్‌లో చూడాలనేది సంజయ్ ఆకాంక్షగా కనిపిస్తోంది.
వారసత్వంగా నటన వైపే వెళ్లకుండా దర్శకత్వాన్ని ఎంచుకోవడం వెనుక ఉన్న కారణాలను కూడా జాసన్ సంజయ్ షేర్ చేసారు. చిన్నతనం నుంచే షూటింగ్ సెట్లలో గడిపే అవకాశం రావడం వల్ల సినిమా మేకింగ్‌పై ఆసక్తి పెరిగిందని తెలిపాడు. మొదట్లో పైలట్ లేదా క్రికెటర్ కావాలని అనుకున్నా 11, 12 తరగతుల్లో ఉన్నప్పుడు కథలు రాయడం అలవాటుగా మారి... ఆ తర్వాత కెనడాలో ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పూర్తి చేసి పూర్తిస్థాయి దర్శకుడిగా మారాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. తన మొదటి చిత్రం `సిగ్మా` విడుదల తేదీలో కొన్ని మార్పులు జరిగినా.. తన విజన్ విషయంలో సంజయ్ చాలా స్పష్టతతో ఉన్నాడు.
మరోవైపు బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కూడా తన తండ్రి బాటలో నటుడిగా కాకుండా సృజనాత్మక దర్శకుడిగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే `ది బాడ్స్ ఆఫ్ బాలీవుడ్` అనే వెబ్ సిరీస్‌తో ఫిల్మ్ మేకర్‌గా తన ప్రతిభను నిరూపించుకున్న ఆర్యన్ త్వరలోనే వెండితెరపై కూడా దర్శకుడిగా డెబ్యూ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు. నటుడిగా తండ్రి సంపాదించిన అపారమైన ప్రజాదరణను పక్కనబెట్టి.. తెర వెనుక నుండి కథలను నడిపించే దర్శకుడి పాత్రకే తాను ఓటు వేస్తానని ఆర్యన్ క్లారిటీ ఇచ్చాడు.
ఒకవేళ కింగ్ ఖాన్ షారూఖ్‌తో సినిమా తీసే అవకాశం వస్తే ఆర్యన్ ఎలాంటి సినిమా తీస్తాడనే ప్రశ్న అభిమానుల్లో ఎప్పుడూ కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. గతంలో మీడియా వేదికలపై ఈ తరహా ప్రశ్నలు ఎదురైనప్పుడు.. తన తండ్రి ఇమేజ్‌కు భిన్నంగా.. సరికొత్త షేడ్స్‌ను ఆవిష్కరించే కథలలోనే తన తండ్రిని ఆవిష్కరిస్తానని ఆర్యన్ సంకేతాలిచ్చాడు. షారూఖ్ ఖాన్ ఇప్పటికే అన్ని రకాల లవ్, యాక్షన్ డ్రామాల్లో నటించేశారు కాబట్టి.. ఒక కొడుకుగా .. ఈ తరం దర్శకుడిగా తన తండ్రిలోని ఇప్పటివరకు చూడని కొత్త కోణాన్ని.. డిఫరెంట్ ఎమోషన్స్‌ను లార్జర్ దాన్ లైఫ్ స్కేల్‌లో చూపించాలనేదే ఆర్యన్ డ్రీమ్. ఇలా ఇద్దరు సూపర్‌స్టార్ల కొడుకులు తమ తండ్రులతో కలిసి పని చేసే విషయంలో వేర్వేరు ప్రత్యేకమైన ఆలోచనలతో ఉండడం సినీ ప్రియులను ఆకట్టుకుంటోంది.