సరైన బ్రేక్ కోసం వెయిటింగ్.. శ్రీహరి కొడుకు నమ్మకం ఇలా!
తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు శ్రీహరి.
తెలుగు సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దివంగత నటుడు శ్రీహరి. ఇప్పుడు ఆయన కొడుకు మేఘాంశ్ శ్రీహరి హీరోగా మంచి హిట్ అందుకునేందుకు ట్రై చేస్తున్నారు. తొలి సినిమాతో ఆశించిన రిజల్ట్ అందుకోలేకపోయినా.. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఆస్మాన్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ సినిమా తన కెరీర్ కు సరైన బ్రేక్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేఘాంశ్.
మేఘాంశ్ చిన్న వయసులోనే కెమెరా ముందుకు వచ్చారు. తన తండ్రి శ్రీహరి నటించిన భైరవలో చిన్న పాత్రలో కనిపించారు. ఆ తర్వాత కాలేజీ టైమ్ లోనే హీరోగా ఛాన్స్ వచ్చింది. కాలేజీకి వెళ్లకుండా సినిమా చేయాలనే సరదా ఆలోచనతో రాజ్ దూత్ సినిమాకు ఓకే చెప్పానని గతంలో మేఘాంశ్ తెలిపారు. 2019లో వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో తొలి సినిమా తర్వాత ఆయన కెరీర్ లో కొంత గ్యాప్ వచ్చింది.
ఇప్పుడు ఆ గ్యాప్ తర్వాత ఆస్మాన్ తో తన లక్ టెస్ట్ చేసుకుంటున్నారు మేఘాంశ్. రామ్ నందన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా మిస్టీరియస్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. లేటెస్ట్ గా సినిమా టీజర్ ను మంచు మనోజ్ రిలీజ్ చేయగా... అందులో మేఘాంశ్ ఇంతకుముందు కనిపించని రగ్గడ్, ఇంటెన్స్ లుక్ లో కనిపించడం హైప్ పెంచింది.
హీరోయిన్ ప్రమాదంలో పడటం, పోలీస్ స్టేషన్ సీన్స్, కాగడా పట్టుకుని హీరో చేసే యాక్షన్.. టీజర్ లో స్పెషల్ గా కనిపించాయి. చివర్లో వచ్చే సీన్స్ కథపై మరింత ఇంట్రెస్ట్ పెంచుతున్నాయి. ప్రశాంత్ విహారి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆ సీన్స్ కు స్ట్రెంగ్త్ చేకూర్చింది. దీంతో ఆస్మాన్ పై బజ్ పెరుగుతోంది. ఇక టీజర్ రిలీజ్ ఈవెంట్ లో మేఘాంశ్ తన సినిమా గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు.
'సినిమా కోసం నేను కష్టపడలేదు. ఎంజాయ్ చేస్తూ చేశాను. నాకు ఏ హెల్ప్ కావాలన్నా మంచు మనోజ్ అన్న ఫస్ట్ ఉంటారు. డైరెక్టర్ రమేష్ గారికి థ్యాంక్స్. డీవోపీ అశోక్ గారు లేకుండా సినిమా పాజిబుల్ కాదు' అని చెప్పారు. అలాగే సీనియర్ నటుడు రవివర్మ, కమల్ కు స్పెషల్ థ్యాంక్స్ తెలిపారు. చిన్నప్పుడు తన తండ్రితో కలిసి భైరవలో పనిచేసిన విషయాన్ని కూడా మేఘాంశ్ గుర్తు చేసుకున్నారు. అప్పట్లో కమల్ అంకుల్ తో కలిసి నటించానని, ఇప్పుడు తన సినిమాలో ఆయన బెస్ట్ ఇచ్చారని చెప్పారు.
హీరోయిన్ రాయంచ బాగా నటించారని, సినిమా అందరికీ నచ్చుతుందని మేఘాంశ్ ధీమా వ్యక్తం చేశారు. శ్రీహరి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మేఘాంశ్ కు తొలి సినిమా తర్వాత వచ్చిన గ్యాప్.. కెరీర్ స్పీడ్ ను తగ్గించింది. కానీ ఇప్పుడు ఆస్మాన్ తో ఆ గ్యాప్ ను దాటుకుని తనకంటూ ఒక ప్లేస్ సంపాదించుకోవాలని చూస్తున్నారు. మరి ఆస్మాన్ మేఘాంశ్ కు ఎలాంటి గుర్తింపును తీసుకొస్తుందో చూడాలి.