ఘట్టమనేని లెగసీని మోయాల్సిన బాధ్యత ఈ యువహీరోదే
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు `పద్మాలయ`వారసత్వాన్ని..ఘట్టమనేని కుటుంబ లెగసీని జయకృష్ణ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు, ప్రముఖ నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు `పద్మాలయ`వారసత్వాన్ని..ఘట్టమనేని కుటుంబ లెగసీని జయకృష్ణ ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. జయకృష్ణ నటించిన చిత్రం విడుదలైన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఘట్టమనేని అభిమానులకు.. మీడియా మిత్రులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
సూపర్ స్టార్ కృష్ణ నటనకు దూరమై దాదాపు 20 ఏళ్లు అవుతున్నా..ఆయన భౌతికంగా దూరమై నాలుగేళ్లయినా ఇప్పటికీ అభిమానులు చూపిస్తున్న ఆదరణ ఎంతో గొప్పదని ఆదిశేషగిరిరావు గుర్తుచేసుకున్నారు. మేము కృష్ణ గారి అభిమానులమని చెప్పుకోవడానికి వారు ఎంతో గర్వపడతారని, ప్రతి ఈవెంట్‌ను తమ సొంత కార్యక్రమంలా భావించి నెత్తిన వేసుకొని విజయవంతం చేస్తున్నారని కొనియాడారు. అభిమానుల ఈ నిస్వార్థమైన ప్రేమకు ఘట్టమనేని కుటుంబం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు.
సినిమా బడ్జెట్, కలెక్షన్లు- బిజినెస్ గణాంకాలతో సంబంధం లేకుండా ఒక నటుడిగా జయకృష్ణ పూర్తిగా విజయవంతమయ్యాడని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మొదటి సినిమాతోనే యాక్షన్, డాన్సులు, డైలాగ్ డెలివరీ, వాయిస్ మోడ్యులేషన్, లవ్ - సెంటిమెంట్ దృశ్యాలలో జయకృష్ణ నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించారు. ఒక హీరోగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసే సామర్థ్యం అతనిలో ఉందని చిత్రబృందం .. ప్రేక్షకులు అనుభూతి చెందారని తెలిపారు.
ఇదే సమయంలో ఘట్టమనేని కుటుంబం .. పద్మాలయ సంస్థల వారసత్వం గురించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కృష్ణ గారు, రమేష్ బాబు - మహేష్ బాబుల నటనతో పాటు `పద్మాలయ స్టూడియోస్` బ్యానర్‌కు అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని చెప్పారు. మునుముందు 25 నుండి 30 సంవత్సరాల పాటు ఈ ఘనమైన లెగసీని, ఆశయాలను తన భుజస్కంధాలపై మోస్తూ ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత జయకృష్ణదేనని.. కుటుంబ సభ్యులందరి ఆశీస్సులు అతనికి ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పారు.
చివరగా ప్రస్తుత సినీ పరిశ్రమలోని పోకడలు, పబ్లిసిటీ వ్యూహాలపై ఆయన విశ్లేషించారు. హాలీవుడ్ సినిమాలు ముందస్తు పబ్లిసిటీతో భారతీయ బాక్స్ ఆఫీస్‌ను ఎంతగా ప్రభావం చేస్తున్నాయో టాలీవుడ్ ప్రొడ్యూసర్లు అధ్యయనం చేయాలని సూచించారు. అలాగే సినిమాలు విడుదల కాకముందే నెగిటివ్ ట్రోలింగ్ చేయడం, పైరసీ కావడం వంటి అంశాలను నిర్మాతల మండలి (ఛాంబర్స్) తీవ్రంగా పరిగణించి అరికట్టాల్సిన అవసరం ఉందో చెప్పారు.