ఓవర్సీస్ టాప్ 5.. ఇరుముడి కంటే మా ఇంటి బంగారం ముందే!
ఈ ఏడాది తెలుగు సినిమాలకు బాక్సాఫీస్ పరంగా బాగానే కలిసొచ్చింది. మన శంకర వర ప్రసాద్ గారు, ఇరుముడి మంచి నెంబర్స్ అందుకున్నాయి.
ఈ ఏడాది తెలుగు సినిమాలకు బాక్సాఫీస్ పరంగా బాగానే కలిసొచ్చింది. మన శంకర వర ప్రసాద్ గారు, ఇరుముడి మంచి నెంబర్స్ అందుకున్నాయి. కానీ ఓవర్సీస్ వసూళ్లు మాత్రమే తీసుకుంటే లిస్ట్ కాస్త మారుతోంది. ఇండియాలో భారీగా ఆడిన ఇరుముడి ఐదో స్థానంలో ఉంటే, వరల్డ్ వైడ్‌గా రూ.100 కోట్ల దగ్గర ఆగిన మా ఇంటి బంగారం ఓవర్సీస్‌లో దాని కంటే ముందుంది.
పెద్దికి టాక్ కాస్త డివైడ్ గా వచ్చినా మొదటి స్థానంలో ఉంది. రామ్ చరణ్‌కు అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా పెద్ద మార్కెట్ ఉంది. భారీ సినిమా కావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే మంచి నంబర్లు వచ్చాయి. చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సంక్రాంతి టైమ్‌లో రావడం కూడా ఓవర్సీస్‌కు బాగా కలిసొచ్చింది. ఫ్యామిలీ సినిమాలకు అక్కడ పండగ సీజన్‌లో ప్రత్యేకంగా డిమాండ్ ఉంటుంది.
ది రాజాసాబ్ కు ఫ్లాప్ టాక్ వచ్చినా ప్రభాస్ క్రేజ్ తో బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుకుంది. భారీ రిలీజ్ వలన మొదటి వీకెండ్‌లోనే పెద్ద మొత్తం వచ్చింది. సినిమా ఫుల్ రన్ ఎలా ఉన్నా, స్టార్ హీరోలకు ఓవర్సీస్ ఓపెనింగ్ ఎంత ఉపయోగపడుతుందో ఈ నంబర్‌లో కనిపిస్తోంది.
సెప్టెంబర్ మిడ్ వరకు అందుబాటులో ఉన్న ట్రేడ్ లెక్కల్లో టాప్ 5 ఇలా ఉంది.
2026 తెలుగు సినిమాలు - ఓవర్సీస్ టాప్ 5
1. పెద్ది: దాదాపు రూ.53 కోట్లు
2. మన శంకర వర ప్రసాద్ గారు: రూ.43 కోట్లు
3. ది రాజాసాబ్: రూ.34 కోట్లు
4. మా ఇంటి బంగారం: దాదాపు రూ.28 కోట్లు
5. ఇరుముడి: రూ.22 కోట్లకు పైగా
మా ఇంటి బంగారం దగ్గరే లిస్ట్ ఇంట్రెస్టింగ్‌గా మారుతోంది. సినిమా వరల్డ్ వైడ్ వసూళ్లలో దాదాపు నాలుగో వంతుకు పైగా ఓవర్సీస్ నుంచే వచ్చింది. ఇరుముడి మొత్తం వసూళ్లు దీని కంటే రెండింతలకు పైగా ఉన్నా, విదేశాల్లో మాత్రం మా ఇంటి బంగారం ముందుంది. రెండు సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రియాక్షన్స్ వచ్చిన మార్కెట్లు ఒకేలా లేవు.
ఇరుముడి ప్రస్తుతం రూ.230 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్‌తో దూసుకెళ్తోంది. కానీ అందులో ఎక్కువ భాగం ఇండియా నుంచే వచ్చింది. నాలుగో వారంలో కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి షోలు కొనసాగుతుండటం అసలైన బలం. ఇక ఈ ఏడాది ఇంకా ప్యారడైజ్, ఆదర్శ కుటుంబం లాంటి పెద్ద సినిమాలు రావాల్సి ఉండటంతో ఓవర్సీస్ టాప్ 5లో కూడా మార్పులు వచ్చే అవకాశం ఉంది.