మీసం తిప్పితే నరసింహం అయిపోదు!

సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి క్లారిటీ ఉండాలనే అంశాన్ని స‌ద‌రు నిర్మాత‌ స్పష్టం చేశారు. `నరసింహం` సినిమాతో కొత్త చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బేరీజు వేయకూడదని హితవు పలికారు.

Update: 2026-10-31 11:30 GMT

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్- టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ మూర్తి కాంబినేషన్‌లో తెర‌కెక్కుతోన్న‌ మోస్ట్ అంటెసిపేటెడ్ ప్రాజెక్ట్ `అతిమనోహరం` పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై వస్తున్న హైప్.. అంచనాల గురించి నిర్మాత ఆంటోనీ పెరుంబవూరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోహన్‌లాల్ మీసం మెలివేసే లుక్‌లో కనిపిస్తున్నంత మాత్రాన ఇది ఆయన కెరీర్లో చారిత్రాత్మక విజయం సాధించిన `నరసింహం` సినిమా లాంటి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు ఎవరూ అస్సలు భావించొద్ద‌ని స్పష్టం చేశారు.

సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి క్లారిటీ ఉండాలనే అంశాన్ని స‌ద‌రు నిర్మాత‌ స్పష్టం చేశారు. `నరసింహం` సినిమాతో కొత్త చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బేరీజు వేయకూడదని హితవు పలికారు. మోహన్‌లాల్ మీసం తిప్పే మాస్ క్యారెక్టర్ ఇందులో ఉన్నా? ఇది పూర్తిగా తరుణ్ మూర్తి శైలిలో తెరకెక్కుతున్న డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా అని తెలిపారు. ప్రేక్షకులు ఎవరైనా కేవలం తరుణ్ మూర్తి సినిమాగానే చూడాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో మోహన్‌లాల్, తరుణ్ మూర్తి కలయికలో రిలీజ్ అయిన  'తుడరుమ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఆ సక్సెస్ ఇచ్చిన నమ్మకంతోనే ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ 'అతిమనోహరం' మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కావాలని తామంతా ఆశగా ఎదురు చూస్తున్నామని ఆంటోనీ పెరుంబవూరు ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే ఒక స్టార్ హీరో సినిమా అనగానే పాత క్లాసిక్ చిత్రాలతో పోల్చడం లేదా ఓ ప్రత్యేకమైన మాస్ టెంప్లేట్‌ను ఆశించడం ప్రేక్షకులకు సాధారణమే. కానీ దర్శకులు ఎంచుకునే కథాంశాలు.. కథ చెప్పే విధానం మారుతున్న నేపథ్యంలో అంచనాలను ముందుగానే సరిదిద్దడం నిర్మాతగా ఆయన తీసుకున్న బాధ్యతగా కనిపిస్తోంది. మోహన్‌లాల్‌లోని నటుడిని కొత్త కోణంలో ఆవిష్కరించే ప్రయత్నమే ఈ చిత్రమని నిర్మాత‌ మాటలను బట్టి స్పష్టమవుతోంది.

ఈ చిత్రానికి టెక్నికల్ నిపుణుల బృందం కూడా బలంగా నిలుస్తోంది. `తుడరుమ్` సినిమాకు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ షాజీ కుమార్ ప్రాజెక్ట్‌కి కూడా కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే వివేక్ హర్షన్ ఎడిటింగ్, గోకుల్ దాస్ ఆర్ట్ డైరెక్షన్ బాధ్యతలు చూస్తున్నారు. పటిష్టమైన సాంకేతిక నిపుణుల కలయికతో సినిమా తెర‌కెక్కుతోంది.

Tags:    

Similar News