హాఫ్ మీల్స్‌తో సరిపెట్టిన గురూజీ.. తారక్‌తో ఏం చేస్తారో!
ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌లో పెద్ద జోరు కనిపించలేదు. అయినా వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఉంటుంది.
ఒక డైరెక్టర్‌తో హిట్ కొట్టిన హీరో మళ్లీ ఆయనతో సినిమా చేస్తే బజ్ మామూలుగా ఉండదు. కానీ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ వెనుక కొంచెం ప్రత్యేకమైన కథ ఉంది. గతంలో త్రివిక్రమ్ ఫ్లాప్‌లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఆయనతో సినిమా చేశారు. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలుస్తున్నారు. అయితే అప్పట్లో ఎదురైన పరిస్థితులకు, ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్టుకు చాలా తేడా ఉంది. మధ్యలో వచ్చిన సినిమాల కారణంగా త్రివిక్రమ్‌పై ప్రేక్షకుల అంచనాలు కూడా మారాయి.
2018లో పవన్ కళ్యాణ్‌తో చేసిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్‌పై రకరకాల కామెంట్స్ వచ్చాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే ఎన్టీఆర్‌తో 'అరవింద సమేత' తెరకెక్కించారు. ఆ సినిమా ప్రమోషన్లలో తారక్ మాట్లాడిన మాటలు ఆకట్టుకున్నాయి. ఒక్క ఫ్లాప్‌తో దర్శకుడి సత్తాను నిర్ణయించలేమని, తన కెరీర్లోనూ విజయాలు, పరాజయాలు ఉన్నాయని చెప్పారు. త్రివిక్రమ్‌పై తనకున్న నమ్మకాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు.
అంతేకాదు, 'నువ్వే నువ్వే' కంటే ముందునుంచే త్రివిక్రమ్ తనకు దగ్గరి మిత్రుడని ఎన్టీఆర్ చెప్పారు. తండ్రి హరికృష్ణ మరణించిన సమయంలో త్రివిక్రమ్ అన్నలా, తండ్రిలా తోడున్నారని ప్రీరిలీజ్ వేడుకలో ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత 'అరవింద సమేత' మంచి విజయం సాధించింది. ఫ్యాక్షన్ నేపథ్యంలో హింసకు ముగింపు పలకాలనే కథను త్రివిక్రమ్ తెరకెక్కించిన విధానం కూడా ప్రశంసలు అందుకుంది.
ఇప్పుడు 'ఆదర్శ కుటుంబం' విషయంలో మాత్రం పరిస్థితి వేరు. నిన్ననే విడుదలైన ఈ సినిమాను అప్పుడే ఫ్లాప్ అనలేం. వెంకటేష్ కామెడీ, త్రివిక్రమ్ మార్క్ డైలాగులకు లోటు లేదు. కానీ 'అత్తారింటికి దారేది'లో కనిపించిన స్థాయి కంటెంట్ ఇక్కడ లేదనే అభిప్రాయం ఉంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ ఆశించినంత ఆకట్టుకోలేదంటున్నారు. మొత్తంగా యావరేజ్ ఎంటర్టైనర్ అనిపిస్తోంది. త్రివిక్రమ్ నుంచి ఫుల్ మీల్స్ ఆశిస్తే, ప్రస్తుతానికి హాఫ్ మీల్స్‌తో సరిపెట్టుకున్నట్లే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఓపెనింగ్స్, అడ్వాన్స్ బుకింగ్స్‌లో పెద్ద జోరు కనిపించలేదు. అయినా వెంకటేష్ సినిమాలకు ఫ్యామిలీ ఆడియన్స్ ఆదరణ ఉంటుంది. ముందున్న దీపావళి సెలవులు కలిసొస్తే వసూళ్లు పుంజుకుని బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశముంది. హిట్ అనిపించుకోవడం ఒకటైతే, దర్శకుడి స్థాయికి తగ్గ సినిమా ఇచ్చారనిపించుకోవడం మరో విషయం. 'గుంటూరు కారం' తర్వాత కూడా త్రివిక్రమ్‌పై ఉన్న అంచనాలన్నీ ఈ సినిమాతో తీరలేదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఇప్పుడు ఎన్టీఆర్‌తో కార్తికేయుడి నేపథ్యంలో పురాణ కథను తెరకెక్కించే ప్రయత్నంలో ఉన్నారు. ప్రస్తుతం తారక్ ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' చేస్తున్నారు. అది పూర్తయ్యాక ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని చెబుతున్నారు. స్క్రిప్ట్ సిద్ధమైందని త్రివిక్రమ్ ప్రకటించినా, షూటింగ్ మొదలయ్యేవరకు ఏ సినిమాపైనా పూర్తి నమ్మకం పెట్టుకోలేని రోజులివి. అయితే ఎన్టీఆర్‌తో ఉన్న బంధాన్ని చూస్తే ఈ కాంబినేషన్‌పై ఆ సందేహాలు తక్కువే. గతంలో త్రివిక్రమ్‌కు అండగా నిలిచిన తారక్ ఇప్పుడు కూడా అదే నమ్మకం చూపిస్తే, ఈసారి హాఫ్ మీల్స్ కాకుండా పూర్తి స్థాయి సినిమా ఇవ్వాల్సిన బాధ్యత గురూజీదే.