ప్రతి పరాజయానికి AIని నిందించకూడదు.. ఫిలింమేకర్స్‌కి పాఠం!
అయితే ఒక చిత్రం చైనాలో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా ఏఐ సినిమాలు విఫలమైనట్టు భావించలేము. ప్రతి సినిమాకు దాని ప్రత్యేకత దానికి ఉంటుంది.
ఏదైనా సినిమా పరాజయానికి కారణం `ఏఐ` అంటూ చాలా సులువుగా ప్రచారం చేయడం తగునా? అంటే.. అది సరికాదు! సాంకేతికత ఎప్పుడూ సమస్య కానే కాదు. సృజనాత్మక రంగంలో ఇంకా చాలా కారణాలు పరాజయానికి దోహదపడొచ్చు. ఇప్పుడు ఒక భారీ ఏఐ సినిమా చైనాలో విఫలమవ్వడం వెనక కారణాలేమిటన్నది విశ్లేషించుకోవాల్సి ఉంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికత సినిమా రంగంలోకి వేగంగా అడుగుపెడుతున్న ఈ సమయంలో చైనాలో థియేట్రికల్ గా విడుదలై తొలి భారీ పరీక్షను ఎదుర్కొన్న ఏఐ చిత్రం తీవ్ర నిరాశను మిగల్చడం చర్చగా మారింది. చైనాలో భారీ థియేట్రికల్ విడుదల పొందిన మొదటి పూర్తిస్థాయి ఏఐ ఫీచర్ ఫిలింగా చెబుతున్న `సాన్క్సింగ్దుయ్: ఫ్యూచర్ పాస్ట్` బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది. సుమారు 10 మిలియన్ యువాన్ల (రూ. 12.5 కోట్లు) బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మొదటి రోజే 10 వేలకు పైగా షోలు ఆడించే అవకాశం దక్కించుకున్నా కానీ.. తొలి వారంలో కేవలం 1,98,000 డాలర్లు (సుమారు రూ. 1.65 కోట్లు) మాత్రమే వసూలు చేయగలిగింది. సాంప్రదాయ సినిమాలతో పోలిస్తే ఇందులో క్వాలిటీ లోపించిందని ప్రేక్షకులు పెదవి విరిచారు.
అయితే ఒక చిత్రం చైనాలో ఫెయిల్ అయినంత మాత్రాన ప్రపంచవ్యాప్తంగా ఏఐ సినిమాలు విఫలమైనట్టు భావించలేము. ప్రతి సినిమాకు దాని ప్రత్యేకత దానికి ఉంటుంది. ఏఐ ఇప్పుడిప్పుడే అభివృద్ధి దశలో ఉంది కాబట్టి మునుముందు సాంకేతికత మరింత పరిణతి చెందితే క్రియేటివ్ ఫీల్డ్స్, కథలు, కథనాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. స్థానిక మార్కెట్లకు అనుగుణంగా బలమైన కథాంశాలను ఎంపిక చేసుకుంటే.. మేకింగ్ పరంగా స్పష్ఠత ఉంటే ఏఐ సినిమాలు బాక్సాఫీస్ వద్ద గొప్ప మ్యాజిక్ చేయగలవు.
అలాగే ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచినా దానికి కేవలం ఏఐ కంటెంట్ మాత్రమే కారణం కాకపోవచ్చు. చిత్రానికి సరైన ప్రచారం లేకపోవడం...బలమైన పంపిణీ వ్యవస్థ కుదరకపోవడం, లేదా ప్రైమ్ థియేటర్లలో సరైన సమయాలు దక్కకపోవడం వంటి అనేక మార్కెటింగ్ పరిమితులు కూడా వ్యాపారపరమైన పరాజయానికి దారితీస్తాయి. ఒకే ఒక్క పరాజయం ఏఐ సినిమా భవిష్యత్తుకు ముగింపు కాదని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
ఎందుకంటే చైనాలో ఇప్పటికే మైక్రో డ్రామాలు, షార్ట్ ఆన్లైన్ సినిమాల నిర్మాణంలో 95 శాతం వరకు ఏఐ సాంకేతికతనే ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో ఏఐ ఫీచర్ ఫిలింస్ నిర్మాణానికి ప్రయత్నిస్తున్నారు.
చైనాలో తొలి ఏఐ ఫీచర్ ఫిలిం పరాజయం చెందడం అనేది అందరూ విశ్లేషించుకోదగిన పరిణామం. మన టాలీవుడ్, బాలీవుడ్ మేకర్స్ నిర్మాణ వ్యయాన్ని తగ్గించుకోవడానికి.. సరికొత్త ఫార్మాట్లలో ప్రయోగాలు చేయడానికి ఏఐని వేగంగా పరిశీలిస్తున్నారు. అయితే ఏఐ సాంకేతికత నిర్మాణ సమయాన్ని, బడ్జెట్‌ను తగ్గించగలిగినా.. బలమైన కథా కథనాలు.. నటీనటుల సహజ సిద్ధమైన అభినయం.. గుండెను తాకే భావోద్వేగాలను ఎప్పటికీ పునఃసృష్టించలేదు. కేవలం విజువల్స్ పరంగా రిచ్‌గా ఉండి మానవీయ స్పర్శ లేని సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరించరు. మొత్తానికి ఏఐతో ఒక పూర్తి సినిమాను సృష్టించడం సాంకేతికంగా సాధ్యమే కావొచ్చు. కానీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి టికెట్ కొనిపించాలంటే సాంకేతికతతో పాటు బలమైన హ్యూమన్ ఎమోషన్ తప్పనిసరి అని ఈ ప్రయోగం స్పష్టం చేసింది.
ఏఐ సాంకేతికత చలనచిత్ర రంగానికి సరికొత్త అవకాశాలను అందిస్తూ నిర్మాణ వ్యయాన్ని, సమయాన్ని భారీగా తగ్గిస్తోంది. కథా విస్తరణ, కాన్సెప్ట్ ఆర్ట్, పోస్ట్-ప్రొడక్షన్, డీ-ఏజింగ్ , వీఎఫ్ఎక్స్ వంటి సంక్లిష్టమైన ప్రక్రియలను ఏఐ సాధనాలు అత్యంత వేగంగా.. తక్కువ బడ్జెట్లో పూర్తి చేసేందుకు దోహదపడుతున్నాయి. ఇది పెద్ద స్టూడియోలకే కాకుండా పరిమిత వనరులున్న స్వతంత్ర (ఇండిపెండెంట్) ఫిల్మ్‌మేకర్లకు కూడా అంతర్జాతీయ స్థాయి విజువల్ నాణ్యతతో సినిమాలు తెరకెక్కించే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది.
అయితే ఏఐ ఎంతటి అద్భుతమైన సాంకేతికత అయినా కానీ.. సినీ రంగానికి అది ఒక సహాయక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప మానవ సృజనాత్మకతకు సంపూర్ణ ప్రత్యామ్నాయం కాజాలదు. నటీనటుల సహజసిద్ధమైన అభినయం, వారి హావభావాలలోని డెప్త్.. ప్రేక్షకుల గుండెలను తాకే మానవీయ భావోద్వేగాలను ఏఐ యంత్రాలు పునఃసృష్టించలేవు. దీనికితోడు కాపీరైట్ వివాదాలు, కళాకారుల ఉపాధిపై చూపుతున్న ప్రభావం .. కంటెంట్‌లో నిజమైన కొత్తదనం లోపించడం వంటి సవాళ్లు కూడా ఉన్నాయి. అందువల్ల మానవ మేధస్సుకు, సాంకేతికతకు సరైన సమతుల్యత కుదిరినప్పుడే అద్భుతమైన చిత్రాలు రూపుదిద్దుకుంటాయి.
అమెరికన్ యూట్యూబర్ ఏఐ సినిమా:
ప్రపంచ దేశాలలో ప్రస్తుతం ఏఐ సినిమాల వెల్లువ మొదలైంది. అమెరికాలో కూడా ప్రముఖ యూట్యూబర్ గాసిప్ గాబ్లిన్ రూపొందించిన `గాడ్స్ డోంట్ గివ్ గిఫ్ట్స్` అనే ఏఐ సైన్స్ ఫిక్షన్ చిత్రం డిసెంబర్ 4న లిమిటెడ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతుండటం ఈ సాంకేతికతపై ఉన్న నిరంతర ఆసక్తికి నిదర్శనం.