రాముడే గొప్పవాడు.. రావణుడి పాత్రపై యశ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అయితే రాముడి గొప్పతనం గురించి వివరిస్తూ యశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రామాయణం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు రణబీర్ కపూర్, యశ్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ యాంకర్ సుమతో ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యశ్ తన పిల్లలతో రామాయణం గురించి మాట్లాడిన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా రావణుడి పాత్రలో తనను చూసిన పిల్లలు అడిగిన ప్రశ్నలు ఆసక్తికరంగా ఉన్నాయని తెలిపారు.
యశ్ రామాయణంలో రావణుడి పాత్రను పోషిస్తున్న విషయం తన పిల్లలకు చెప్పినప్పుడు వారు ఆశ్చర్యపోయారని వెల్లడించారు. తెరపై రావణుడిగా కనిపించబోతున్నానని చెప్పగానే, పిల్లలు తనను ప్రశ్నించారని తెలిపారు.
"నేను రామాయణం చేస్తున్నానని నా పిల్లలకు చెప్పినప్పుడు, వారు ఆశ్చర్యపోయారు. రావణుడిగా ఎందుకు నటిస్తున్నావు? రాముడిగా ఎందుకు నటించడం లేదు? అని అడిగారు" అని యశ్ వెల్లడించారు.
అయితే రాముడి గొప్పతనం గురించి వివరిస్తూ యశ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
"చివరికి రాముడిని అనుసరించాల్సిందే. నిజ జీవితంలో నేను రాముడిని, తెరపై రావణుడిని" అని యశ్ అన్నారు.
రావణుడికి అందం, శక్తి, జ్ఞానం వంటి ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్నప్పటికీ, రాముడి ధర్మం, విలువలు మరింత గొప్పవని యశ్ అభిప్రాయపడ్డారు.
"రావణుడికి అందం, శక్తి అన్నీ ఉన్నాయి. అయినప్పటికీ రాముడే గొప్పవాడు. మీరు జీవితంలో గెలవాలంటే రాముడి సారాన్ని, ఆయన విలువలను అనుసరించాలి" అని యశ్ పేర్కొన్నారు.
ఇటీవల రామాయణం కథలు పిల్లలకు మంచి విలువలను నేర్పించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని కూడా యశ్ అభిప్రాయపడ్డారు. తల్లిదండ్రులు పిల్లలకు ఏది మంచో, ఏది చెడో చెప్పడం కంటే కథల ద్వారా అర్థమయ్యేలా వివరించవచ్చని అన్నారు.
"రామాయణం వంటి కథలు పిల్లలకు జీవితాన్ని, మన విలువలను వారి సొంత ఆలోచనలతో అర్థం చేసుకునే స్వేచ్ఛను ఇస్తాయి. గత తరాల అనుభవాలు, జ్ఞానం, విజ్ఞతను కథల ద్వారా వారికి అందించవచ్చు" అని యశ్ చెప్పారు.
నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్నారు. మొదటి భాగం నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.