ఎమోషన్ కోసం ఇన్ని సమస్యలా?
సినిమా కథలో ఎక్కువ సమస్యలు, ఎక్కువ ట్విస్టులు, వరుస విషాదాలు ఉంటే ఆడియన్స్ పై ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ఒకప్పుడు భావించేవారు.
సినిమా కథలో ఎక్కువ సమస్యలు, ఎక్కువ ట్విస్టులు, వరుస విషాదాలు ఉంటే ఆడియన్స్ పై ఎమోషనల్ ఇంపాక్ట్ కూడా అంతే స్థాయిలో ఉంటుందని ఒకప్పుడు భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా ఓటీటీల విస్తరణతో ఆడియన్స్ సినిమా చూసే విధానం పూర్తిగా మారిపోయింది. కథలో ఎన్ని సమస్యలు ఉన్నాయి అనే దానికంటే.. ఆ సమస్యలతో సినిమాలోని క్యారెక్టర్లు ఎంత నేచురల్ గా ప్రయాణించాయనేదే ఇప్పుడు ఎక్కువగా డిస్కషన్ కు వస్తోంది. ఈ మార్పు ఫీల్ గుడ్ సినిమాల విషయంలో మరింత స్పష్టంగా కనిపిస్తోంది.
ఒక కథను ఇంట్రెస్టింగ్ గా మార్చేందుకు కుటుంబ కలహాలు, అనారోగ్యం, సంబంధాల మధ్య సంక్లిష్టత, వ్యక్తిగత నష్టాలు, ఊహించని మలుపులు వంటి అంశాలను వరుసగా జోడించడం వల్ల కథకు వెయిట్ పెరగొచ్చు. కానీ ప్రతి అంశాన్ని ఎమోషన్ కోసం ఉపయోగిస్తే మాత్రం ఆడియన్స్ కు అది మామూలు లైఫ్ లాగా కాకుండా సినిమా కోసం రెడీ చేసిన లైఫ్ లాగానే అనిపించే అవకాశముంది. ఒక క్యారెక్టర్ బాధను ఆడియన్స్ అర్థం చేసుకోవడానికి పది రీజన్స్ అవసరం లేదు. ఉన్న ఒక్క రీజన్ ను బలంగా, నిజాయితీగా చూపించడం కొన్నిసార్లు మరింత ఇంపాక్ట్ ను చూపిస్తుంది. ఇదే ఇప్పుడు ఆర్గానిక్ స్టోరీటెల్లింగ్‌పై జరుగుతున్న డిస్కషన్‌కు మెయిన్ రీజన్ గా మారుతోంది.
ఇదే సమయంలో పెద్ద కాన్ఫ్లిక్ట్‌లు లేని సింపుల్ కథలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. పక్కింటి మనుషులు, ఫ్యామిలీ బాండింగ్స్, చిన్న అపార్థాలు, సాధారణ జీవితంలోని ఆనందాలు, బాధలు వంటి అంశాలతోనే ఆడియన్స్ ను కదిలించే ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలాంటి కథల్లో హీరోయిజం కంటే క్యారెక్టర్స్ ముఖ్యం. భారీ డైలాగ్ కంటే ఒక చిన్న సీన్ ఎక్కువగా గుర్తుండిపోవచ్చు. అంటే ఆడియన్స్ కథలో సమస్యల కంటే అందులో కనిపించే పాత్రల నిజాయితీనే ఎక్కువగా పరిగణనలోకి తీసుకుంటున్నారు.
ఓటీటీ ఈ మార్పును మరింత స్పష్టంగా బయటపెడుతోంది. థియేటర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, భారీ స్క్రీన్, ఆడియన్స్ మిక్డ్స్ రెస్పాన్స్ ఒక సీన్ కు ఎక్స్‌ట్రా ఇంపాక్ట్‌ను ఇవ్వొచ్చు. ఇంట్లో మాత్రం ఆడియన్స్ తన సౌకర్యంలో సినిమాను చూస్తాడు. అవసరమైతే ఆ సీన్‌ను ఆపి, వెనక్కి వెళ్లి మళ్లీ చూసే వెసులుబాటు ఉంటుంది. వెంటనే సోషల్ మీడియాలో రియాక్ట్ అవ్వొచ్చు. దీంతో రైటింగ్, పెర్ఫార్మెన్స్, సీన్ స్ట్రక్చర్, ఎమోషన్స్ రియాలిటీ మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
అందుకే థియేటర్‌లో వచ్చిన రెస్పాన్సే ఓటీటీ విజయానికి కొలమానంగా చూడటం క్రమంగా కష్టమవుతోంది. ఒకే సినిమాను ఆడియన్స్ రెండు విధాలుగా చూసే అవకాశముండటంతో రెండు రకాల రెస్సాన్స్ లు వచ్చే ఛాన్సుంది. ప్రస్తుతం ఫీల్ గుడ్ సినిమా ఎదుర్కొంటున్న అసలు పరీక్ష ఇదే. ఆడియన్స్ ను ఏడిపించడానికి ఎన్ని కారణాలు ఇచ్చామన్నది కాదు.. ఆ పాత్ర బాధను ఆడియన్స్ నిజంగా తనదిగా భావించాడా అనేదే అసలు ప్రశ్నగా మారుతోంది.