వీరాభిమాని పాడె మోసిన ఎన్టీఆర్ కుటుంబీకులు
తమ అభిమానులను కష్టాల్లో ఆదుకునేందుకు మన హీరోలు చాలా ఉదారత చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అభిమాని పాడె మోయడం ఒక గొప్ప ఉదాత్తత.;
తమ అభిమానులను కష్టాల్లో ఆదుకునేందుకు మన హీరోలు చాలా ఉదారత చూపిస్తున్నారు. కానీ ఇప్పుడు ఏకంగా అభిమాని పాడె మోయడం ఒక గొప్ప ఉదాత్తత. స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) వీరాభిమాని, `ఎన్టీఆర్ రాజు`గా పిలుచుకునే రామచంద్ర రాజు మృతికి పలువురు ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గురువారం ఆయన భౌతికకాయానికి ఎన్టీఆర్ కుటుంబీకులైన నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన్ రూప, నందమూరి చైతన్య కృష్ణ, నందమూరి కుటుంబ సభ్యులు, శాప్ ఛైర్మన్ రవి నాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ , తిరుపతి టౌన్ బ్యాంక్ మాజీ ఛైర్మన్, ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, మురళి, ఎక్స్ ఎమ్మెల్యే సుగుణమ్మ, శ్రీనాథ్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్, అడిషనల్ ఈవో అంకం చౌదరి, పలువురు రాజకీయ ప్రముఖులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు, నాయకులు మాట్లాడుతూ... రామచంద్ర రాజు అనే పేరు కంటే `ఎన్టీఆర్ రాజు`గానే ఆయన ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ పట్ల ఆయన చూపిన అభిమానం వెలకట్టలేనిదని అన్నారు. అటువంటి వ్యక్తి నేడు మన మధ్య లేకపోవడం ఎన్టీఆర్ అభిమానులకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజు టీటీడీ బోర్డు సభ్యులుగా చేసిన సేవలు వెలకట్టలేని కొనియాడారు.
రెండు సార్లు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండి కూడా రూపాయి వేతనం తీసుకోకుండా ఆయన టీటీడీకు చేసిన సేవలు, భక్తులకు అందించిన సదుపాయాలు లెక్కలేనివి. నందమూరి తారక రామారావు ప్రతి సినిమా రీళ్ల బాక్స్ లను స్వామి వారి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేసేవారనీ ఈ సందర్భంగా ఆయన అభిమానాన్ని స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.